అవకాశమిస్తే ఒలింపిక్స్‌ నిర్వహిస్తం:మోదీ

అవకాశమిస్తే ఒలింపిక్స్‌ నిర్వహిస్తం:మోదీ

ముంబై: 2036 ఒలింపిక్స్‌ ఆతిథ్యం కోసం తాము చేస్తున్న ప్రయత్నాల్లో ఏ అవకాశాన్ని వదిలిపెట్టబోమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా ఈవెంట్‌ అయిన ఒలింపిక్స్‌ను నిర్వహించాలనే బలమైన ఆకాంక్ష తమలో ఉందన్నారు. ఇండియన్‌ ఒలింపిక్‌ కమిటీ (ఐవోసీ) 141వ సెషన్‌ను ప్రారంభించిన మోదీ.. హోస్టింగ్‌కు సంబంధించిన రోడ్‌ మ్యాప్‌ను ప్రదర్శించారు. 2029 యూత్‌ ఒలింపిక్స్‌కు కూడా ఇండియా ఆతిథ్యమివ్వాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ‘ఒలింపిక్స్‌ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వడానికి ఇండియన్స్‌ చాలా ఉత్సాహంగా ఉన్నారు. 2036 ఒలింపిక్స్‌ నిర్వహణకు సంబంధించి ఏ అవకాశాన్ని మేం వదలిపెట్టబోం. 

ఇది 140 కోట్ల మంది భారతీయుల కల. మీ మద్దతుతో మా కలను నెరవేర్చుకోవాలనుకుంటున్నాం. యూత్‌ ఒలింపిక్స్‌నూ నిర్వహించాలనుకుంటున్నాం. ఐవోసీ నుంచి భారత్‌కు నిరంతరం మద్దతు లభిస్తుందని నేను ఆశిస్తున్నా’ అని మోదీ పేర్కొన్నారు. భారతదేశ విశిష్ట చరిత్రలో క్రీడల ప్రాముఖ్యత గురించి ప్రధాని మాట్లాడారు. ‘క్రీడల స్ఫూర్తి విశ్వ వ్యాప్తం. ఇందులో ఓడినవారు ఉండరు, కేవలం విజేతలు, అభ్యాసకులు మాత్రమే ఉంటారు. మానవాళిని ఏకం చేసే శక్తి క్రీడలకు ఉంది. ఎవరు రికార్డులను బద్దలు కొట్టినా ప్రతి ఒక్కరూ దాన్ని స్వాగతిస్తారు’ అని మోదీ వ్యాఖ్యానించారు. ప్రధానితో పాటు సమావేశంలో పాల్గొన్న ఐవోసీ ప్రెసిడెంట్‌ థామస్‌ బాచ్‌ ‘నమస్తే’ అంటూ తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. ‘ఆప్కా బహుత్‌ స్వాగత్‌ హై’ అంటూ మోదీని ఆహ్వానించారు. భారత దేశం ఒక స్ఫూర్తిదాయకమైన ప్రదేశమన్న బాచ్‌.. ఆర్థికంగా, క్రీడల్లో బాగా అభివృద్ధి చెందుతోందని ప్రశంసించారు.

ప్రధాని మోదీ పాట రాసిండు ‘గార్బా’ సాంగ్ యూట్యూబ్ లో రిలీజ్


న్యూఢిల్లీ: ప్రధాని మోదీ పాట రాశారు. ఆయన గుజరాతీ సంప్రదాయ నృత్యమైన ‘గార్బా’ పాట రచించారు. ఇది ‘గార్బో’ పేరుతో యూట్యూబ్ లో విడుదలైంది. దీనికి బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ తనిష్క్ బాగ్చీ మ్యూజిక్ అందించగా, సింగర్ ధ్వని భానుషాలీ పాడారు. ఈ పాట రిలీజ్ గురించి తెలియజేస్తూ ధ్వని భానుషాలీ శనివారం ట్విట్టర్ లో పోస్టు పెట్టారు. ‘‘మోదీజీ.. మీరు రాసిన పాట తనిష్క్ కు, నాకు బాగా నచ్చింది. దాన్ని సరికొత్త రిథమ్, ఫ్లేవర్ తో కంపోజ్ చేయాలని అనుకున్నాం. ఇందుకు ‘జె జస్ట్’ మ్యూజిక్ మాకు సహకారం అందించింది” అని అందులో పేర్కొన్నారు. దీనిపై మోదీ స్పందిస్తూ.. ‘‘ఇది నేను కొన్నేండ్ల కింద రాసిన పాట. దీన్ని అత్యద్భుతంగా కంపోజ్ చేసినందుకు ధ్వని భానుషాలీ, తనిష్క్ బాగ్చీ, జె జస్ట్ మ్యూజిక్ టీమ్ కు ధన్యవాదాలు. ఈ పాట ఎన్నో పాత జ్ఞాపకాలను గుర్తు చేసింది. నేను కొన్నేండ్లుగా రాయడం మానేశాను. కానీ ఈ మధ్య కొన్ని రోజులుగా కొత్త గార్బా పాట రాశాను. అది నవరాత్రుల సందర్భంగా విడుదల చేస్తాను” అని ట్వీట్ చేశారు. కాగా, దసరా సందర్భంగా గుజరాత్ లో దేవీ శరన్నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తారు. ఈ టైమ్ లో సంప్రదాయ నృత్యమైన గార్బా చేస్తారు. 

పార్వతీ కుండ్ కు తప్పక వెళ్లండి.. 

ఇటీవల ఉత్తరాఖండ్ లో పర్యటించిన మోదీ.. ఆ ఫొటోలను ట్విట్టర్ లో షేర్ చేశారు. ‘‘ఉత్తరాఖండ్ లో ఏ ప్రాంతాలను తప్పనిసరిగా చూడాలని నన్ను ఎవరైనా అడిగితే.. పార్వతీ కుండ్, జగేశ్వర్ టెంపుల్ అని చెబుతాను. అక్కడి ప్రకృతి సౌందర్యం మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది. అలాగే ఉత్తరాఖండ్ లో ఇంకా చాలానే సందర్శించాల్సిన ప్రదేశాలు ఉన్నాయి. కేదార్ నాథ్, బద్రీనాథ్ కు వెళ్తే మరిచిపోలేని అనుభూతి లభిస్తుంది” అని మోదీ ట్వీట్ చేశారు.