- చొరబాటుదారుల కోసమే
- ‘సర్’ను టీఎంసీ వ్యతిరేకించింది
- రాష్ట్ర ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నది
- డబుల్ ఇంజిన్ సర్కార్ గెలిస్తేనే
- ఇక్కడ డెవలప్‌మెంట్
- బిహార్ ఫలితాలే బెంగాల్‌లోనూ వస్తాయని ధీమా
- ‘పరివర్తన్ సంకల్ప సభ’ సందర్భంగా వర్చువల్‌గా ప్రధాని ప్రసంగం
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ప్రస్తుతం ‘మహా జంగిల్ రాజ్’ నడుస్తున్నదని, అవినీతి, బంధుప్రీతి, బుజ్జగింపు రాజకీయాల వల్ల బెంగాల్ అభివృద్ధి కుంటుపడిందని ఆరోపించారు. శనివారం బెంగాల్‌లోని నాదియా జిల్లా తాహెర్‌పూర్‌లో నిర్వహించిన ‘పరివర్తన్ సంకల్ప సభ’లో ప్రధాని మోదీ పాల్గొనాల్సి ఉండగా, దట్టమైన పొగమంచు కారణంగా ఆయన హెలికాప్టర్ ల్యాండింగ్ సాధ్యం కాలేదు.
దీంతో కోల్‌కతా విమానాశ్రయం నుంచే వర్చువల్ విధానంలో (ఫోన్ ద్వారా) ప్రజలనుద్దేశించి మోదీ ప్రసంగించారు. తమ రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజలను టీఎంసీ పార్టీ ఇబ్బందులకు గురిచేస్తున్నదని మండిపడ్డారు. ‘‘నన్ను, బీజేపీని తృణమూల్ నేతలు ఎంతైనా వ్యతిరేకించవచ్చు. కానీ బెంగాల్ అభివృద్ధిని అడ్డుకోకూడదు” అని అన్నారు. రాష్ట్రంలో చొరబాటుదారులకు టీఎంసీ కొమ్ముకాస్తున్నదని, అందుకే ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియను వారు వ్యతిరేకిస్తున్నారని ఆరోపించారు.
2026 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి అవకాశం ఇచ్చి ‘డబుల్ ఇంజిన్’ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. మమత పాలనలో ఉద్రిక్తతలు, అల్లర్లు, బెదిరింపులతో విసిగిపోయిన ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని అన్నారు. బిహార్ ఎన్నికల ఫలితం బెంగాల్‌లో తమ విజయానికి బాటలు వేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
అస్సాంలో ‘నేచర్ థీమ్’ ఎయిర్‌పోర్ట్ టెర్మినల్..
అస్సాంలోని గువాహటి ‘లోకప్రియ గోపీనాథ్ బోర్డోలోయ్ అంతర్జాతీయ విమానాశ్రయం’లో కొత్త టెర్మినల్ బిల్డింగ్‌ను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఇది దేశంలోనే తొలి నేచర్ థీమ్ టెర్మినల్. దీనిని రూ. 4వేల కోట్లతో నిర్మించారు. అస్సాం సంస్కృతి, ప్రకృతి సౌందర్యం ఉట్టిపడేలా వెదురు, ఆర్కిడ్ పూల ఆకృతులను ఉపయోగించి నిర్మించిన ఈ టెర్మినల్ ఏటా 1.3 కోట్ల మంది ప్రయాణికులకు సేవలు అందిచనున్నది.
అస్సాంలోని నదులు, దట్టమైన అడవులు, జీవవైవిధ్యాన్ని ప్రతిబింబించేలా నిర్మాణ శైలి ఉంటుంది. స్థానిక కళలు, సంస్కృతిని ప్రతిబింబించే అనేక కళాఖండాలను అందులో ఏర్పాటు చేశారు. కాగా, ఎయిర్‌పోర్ట్ ఆవరణలో అస్సాం తొలి సీఎం గోపీనాథ్ బోర్డోలోయ్ 80 అడుగుల భారీ విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత కాంగ్రెస్ ప్రభుత్వం ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిని విస్మరించిందని, ఇప్పుడు అస్సాం అభివృద్ధిలో కొత్త అధ్యాయం మొదలైందని అన్నారు.
దేశానికి నార్త్‌ఈస్ట్ నుంచి కొత్త సూర్యుడు ఉదయిస్తున్నాడని వ్యాఖ్యానించారు. అస్సాం యాక్ట్ ఈస్ట్ పాలసీ కింద దేశం తూర్పు గేట్‌వేగా మారుతున్నదని, ఈ కొత్త టెర్మినల్ దానికి బలం చేకూరుస్తుందని చెప్పారు.ఈ ప్రాజెక్ట్ వికాస్ కా ఉత్సవ్‌లో భాగమని, వెదురు ఆధారిత డిజైన్
బలం, సస్టైనబిలిటీకి చిహ్నమని ప్రశంసించారు.
ర్యాలీకి రాలేకపోయా సారీ..
బంగ్లాదేశ్ సరిహద్దుల్లోని నాదియా జిల్లాలో ఎక్కువగా ఉన్న మతువా సామాజిక వర్గ దైవాలైన హరిచంద్ ఠాకూర్, గురుచంద్ ఠాకూర్, చైతన్య మహాప్రభులను ప్రధాని మోదీ స్మరించుకున్నారు. వందేమాతరం గేయ రచయిత బంకిమ్ చంద్ర చటర్జీని ‘రిషి బంకిమ్ బాబు’గా అభివర్ణిస్తూ, జాతీయ గీతం 150 ఏండ్ల వేడుకలను గుర్తు చేశారు. ప్రతికూల వాతావరణం వల్ల అక్కడికి రాలేకపోయినందుకు ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ క్షమాపణలు చెప్పారు.
