- గేయానికి వ్యతిరేకంగా చేసిన ప్రచారానికి నెహ్రూ మద్దతిచ్చారు
- పదవిని కాపాడుకునేందుకే ఆయన ఇదంతా చేశారు
- గాంధీజీ ఆశయాలనూ గౌరవించలేదని వ్యాఖ్య
- ‘వందేమాతరం’ గేయం 150వ వార్షికోత్సవంపై లోక్‌సభలో చర్చ
న్యూఢిల్లీ: వందేమాతరం గేయానికి కాంగ్రెస్ పార్టీ, జవహర్ లాల్ నెహ్రూ అన్యాయం చేశారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. జాతీయ గేయంలోని కొన్నిభాగాలు ముస్లింలకు నచ్చకపోవచ్చని మాజీ ప్రధాని నెహ్రూ అన్నారని తెలిపారు. ‘‘1937లో మహ్మద్ అలీ జిన్నా వందేమాతరం గేయాన్ని వ్యతిరేకించారు. జిన్నా నేతృత్వంలోని ముస్లిం లీగ్.. వందేమాతరం గేయానికి వ్యతిరేకంగా ప్రచారం చేపట్టింది. ఈ ప్రచారాన్ని ఖండించాల్సిన కాంగ్రెస్ పార్టీ, నెహ్రూ.. ఆ ప్రచారానికే వత్తాసు పలికి వందేమాతరం గేయం నుంచి కొన్ని పంక్తులను తొలగించారు’’ అని మోదీ ఆరోపించారు. గేయాన్ని కాంగ్రెస్ ‘తుక్డే.. తుక్డే’ (ముక్కలు ముక్కలు) చేసిందని, ఇది దేశ విభజనకు బీజాలు వేసిందని మోదీ విమర్శించారు.
‘వందేమాతరం’ గేయం 150వ వార్షికోత్సవంపై సోమవారం జరిగిన ప్రత్యేక చర్చలో ప్రధాని మోదీ పాల్గొని మాట్లాడారు. మహమ్మద్ అలీ జిన్నా వ్యతిరేకించినప్పుడు, నెహ్రూ తన సింహాసనం కదులుతుందని భయపడ్డారని, జిన్నా వాదనతో ఏకీభవించి సుభాష్ చంద్రబోస్‌కు లేఖ రాశారని ఆరోపించారు. గాంధీజీ ఆశయాలను కూడా కాంగ్రెస్ గౌరవించలేకపోయిందని అన్నారు. వందేమాతరం గేయానికి జరిగిన అన్యాయం గురించి నేటి తరం యువతకు తెలియజేయాల్సిన అవసరం ఉందని మోదీ పేర్కొన్నారు.
మాతృభూమికి విముక్తి కల్పించింది
‘వందేమాతరం’ కేవలం రాజకీయ స్వేచ్ఛా మంత్రం మాత్రమే కాదని, బ్రిటీష్ పాలన నుంచి మాతృభూమిని విముక్తి కల్పించడానికి జరిగిన ‘పవిత్ర యుద్ధం’ అని మోదీ అన్నారు. లక్షలాది మంది ఈ గేయాన్ని ఆలపించడం వల్లే ఈరోజు మనమంతా పార్లమెంట్‌లో కూర్చోగలిగామని తెలిపారు. బ్రిటిష్ వారి అణచివేతలకు వ్యతిరేకంగా ఈ గేయాన్ని 1875లో బంకించంద్ర ఛటర్జీ రాశారని చెప్పారు. బ్రిటిష్ జాతీయ గీతం ‘గాడ్ సేవ్ ది క్వీన్’ను బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తున్నప్పుడే వందేమాతర గీతం భారతీయుల్లో ధైర్యాన్ని, ఐక్యతను నింపిందని తెలిపారు. వందేమాతరం గేయానికి 50 ఏండ్ల సమయంలో దేశం బానిసత్వంలో ఉందన్నారు. 100 ఏండ్లు నిండినప్పుడు దేశం ఎమర్జెన్సీ చీకటి కాలంలో ఉందని, ఆ టైమ్‌లో రాజ్యాంగాన్ని అణిచివేసి దేశభక్తులను జైళ్లలో పెట్టారని మోదీ గుర్తుచేశారు.
గేయం గొప్పతనాన్ని పునరుద్ధరించాలి
వందేమాతరం గొప్పతనాన్ని పునరుద్ధరించే అవకాశం ఇప్పుడు లభించిందని, దీనిని వదులుకోకూడదని మోదీ అన్నారు. ఈ చర్చలో అధికార, ప్రతిపక్షాలు లేవని, ఇప్పుడు మరోసారి ఐక్యంగా ముందుకు సాగి, 2047 నాటికి దేశాన్ని అభివృద్ధి చెందిన, ఆత్మనిర్భర్ భారత్‌గా మార్చే సంకల్పం తీసుకోవాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ పార్టీ బుజ్జగింపు రాజకీయాల కారణంగానే ముస్లిం లీగ్‌కు లొంగిపోయిందని, వందేమాతరం విషయంలో రాజీపడిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ విధానాలు ఇప్పటికీ మారలేదని, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (ఐఎన్‌సీ) ఇప్పుడు ముస్లిం లీగ్ -మావోయిస్ట్ కాంగ్రెస్ (ఎంఎంసీ)గా మారిందని విమర్శించారు. బ్రిటీష్ వాళ్లు 1905లో బెంగాల్‌ను విభజించినప్పుడు వందేమాతరం ఒక ఆయుధంలా బలంగా నిలబడి ఐక్యతా స్ఫూర్తిని రగిల్చిందని చెప్పారు.
‘బంకిం దా’ కాదు.. ‘బంకిం బాబు’ అనండి: టీఎంసీ ఎంపీ
వందేమాతరంపై లోక్‌సభలో చర్చ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతుండగా.. తృణమూల్ ఎంపీ సౌగత్ రాయ్ అడ్డుకున్నారు. వందేమాతరం గేయ రచయిత బంకించంద్ర ఛటర్జీని ప్రధాని బంకిం దా (దాదా) అని పలుమార్లు సంబోధించారు. అదే సమయంలో సౌగత్ రాయ్ కల్పించుకుని ప్రధాని ‘దా’ అని సంబోధించడంపై అభ్యంతరం చెప్పారు. సోదరుడు అనే సంబోధించేందుకు బెంగాలీ భాషలో ‘దా’ అని వాడతారని.. సాంస్కృతిక దిగ్గజానికి అటువంటి పదం వాడటం సరికాదని పేర్కొన్నారు.
‘బంకిం బాబు’ అని ప్రధాని సంబోధించాలని సూచించారు. దీనికి సానుకూలంగా స్పందించిన ప్రధాని వెంటనే స్పందించారు. ఇకనుంచి ‘బంకిం బాబు’ అనే సంబోధిస్తానని వెల్లడించారు. తన పొరబాటును సరిచేసినందుకు సౌగత్‌రాయ్‌కు ధన్యవాదాలు తెలియజేశారు. కాగా, వందేమాతరం విషయంలో విభజనను సృష్టించింది ముస్లింలు కాదని డీఎంకే ఎంపీ ఏ రాజా అన్నారు. ప్రధాని మోదీ చేసిన కామెంట్లను ఆయన ఖండించారు. వందేమాతరం గేయాన్ని కేవలం హిందువుల గేయంగా చిత్రీకరించింది మీ పూర్వీకులే (బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలను ఉద్దేశిస్తూ) అని విమర్శించారు.
ఎంపీలంతా కలిసి అద్భుత విజయం సాధించారు
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్డీయే ఎంపీలకు ధన్యవాదాలు తెలిపారు. ఎంపీలంతా కలిసి సాధించిన అద్భుతమైన విజయమని కొనియాడారు. ఈ విజయం కేవలం వేడుకలకే పరిమితం కాదని, ప్రజలు తమపై ఉంచిన అపారమైన నమ్మకానికి అనుగుణంగా ప్రవర్తించాలని, వారి కోసం మరింత కష్టపడి పనిచేయాలని ఎంపీలకు మోదీ సూచించారు. ఈ విజయాన్ని రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి ఉపయోగించాలని, ప్రజా జీవితంలో పారదర్శకత, జవాబుదారీతనం
పాటించాలని వారికి దిశానిర్దేశం చేశారు.
