
- ప్రజల సంపదను లూటీ చేస్తుండు
- ల్యాండ్ మాఫియా రెచ్చిపోతున్నది.. ఆఖరికి ఎగ్జామ్ పేపర్లూ లీక్ చేస్తున్నరు
- అవినీతి, కుటుంబ రాజకీయాలంటే కాంగ్రెస్, బీఆర్ఎస్సే గుర్తొస్తయ్
- సామాజిక న్యాయం బీజేపీతోనే సాధ్యం.. రాష్ట్రానికి తమ ప్రభుత్వం చాలా అవసరమని కామెంట్
- కరీంనగర్, మహబూబాబాద్‌లో విజయ సంకల్ప సభలు
కరీంనగర్, మహబూబాబాద్, వెలుగు: రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కేసీఆర్ ఫ్యామిలీ తిన్నదంతా కక్కిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సాగునీటి ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్ భారీ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ‘‘కాళేశ్వరం అవినీతి గురించి యావత్ దేశానికి తెలుసు. సాగునీటి ప్రాజెక్టులతోపాటు సచివాలయ నిర్మాణంలో, ప్రభుత్వ స్కీముల్లో అవినీతి, అక్రమాలు పెరిగిపోయాయి. రాష్ట్రంలో ల్యాండ్ మాఫియా పెట్రేగుతున్నది. ఆఖరికి ఎగ్జామ్ పేపర్లు కూడా లీకవుతున్నాయి. ప్రజల సంపదను కేసీఆర్ కుటుంబం తమ సొంత సంపదగా భావించి లూటీ చేస్తున్నది. ఇలాంటి బీఆర్ఎస్‌కు తగిన శిక్ష పడాలా? వద్దా?’’ అని ఆయన ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వం వచ్చాక లిక్కర్ స్కాం దర్యాప్తు వేగవంతం చేస్తామని అన్నారు. కేసీఆర్ కుటుంబం దోచుకున్న అవినీతి సొమ్మును కక్కిస్తామని చెప్పారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని తాళ్లపూసపల్లి రోడ్డు వద్ద, కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజీ గ్రౌండ్‌లో నిర్వహించిన సకల జనుల విజయ సంకల్ప సభలకు ప్రధాని ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ‘ఫామ్ హౌస్ సీఎం కేసీఆర్ హఠావో.. బీజేపీ బీసీ సీఎం బనావో’ అంటూ నినదించారు.
హుజూరాబాద్‌లో ట్రైలర్.. ఇప్పుడు ఫుల్ మూవీ..
హుజూరాబాద్ ఉప ఎన్నికలో సీఎం కేసీఆర్‌కు ట్రైలర్ చూపించామని, ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఫుల్‌మూవీ చూపిస్తామని, ఇక కేసీఆర్ ఖేల్ ఖతమని మోదీ అన్నారు. తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని, రాష్ట్రంలో బీజేపీ తొలి సీఎం బీసీ వర్గం నుంచే ఉంటారని చెప్పారు. ‘‘తెలంగాణ వయస్సు ఇప్పుడు పదేండ్లు. పదేండ్ల బిడ్డ విషయంలో వచ్చే ఐదేండ్ల కోసం ఎంత జాగ్రత్త తీసుకుంటామో.. అలానే తెలంగాణకు వచ్చే ఐదేండ్లు కూడా చాలా ముఖ్యం. ఇప్పుడు తెలంగాణ విషయంలో పొరపాటు చేయలేం. దాని అదృష్టానికి వదలేయలేం. రాష్ట్రానికి బీజేపీ ప్రభుత్వం చాలా అవసరం” అని చెప్పుకొచ్చారు. ప్రజలను మోసం చేసేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోవని, అవినీతి, కుటుంబ రాజకీయాలంటే ఈ రెండు పార్టీలే గుర్తుకొస్తాయన్నారు. కాంగ్రెస్ నేతలకు గ్యారంటీ లేదని, వాళ్లు ఎప్పుడైనా బీఆర్ఎస్ లో చేరుతారని ఎద్దేవా చేశారు. అందుకే కాంగ్రెస్ కు ఓటు వేయడం అంటే మళ్లీ కేసీఆర్‌ను గద్దె ఎక్కించడమేనని విమర్శించారు.
పీవీని అవమానించారు..
కుటుంబ పార్టీల వల్ల ప్రతిభకు ఎంతటి అన్యాయం జరుగుతుందో ఈ కరీంనగర్ గడ్డను చూస్తే తెలుస్తుందని ప్రధాని మోదీ తెలిపారు. ‘‘ఈ గడ్డ పీవీ నరసింహా రావు లాంటి వ్యక్తిని ప్రధానిగా అందించింది. ఆయన్ను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా అవమానించింది. చనిపోయిన తర్వాత కూడా పీవీని అవమానించింది” అని మండిపడ్డారు. కుటుంబ పార్టీలు వారి పిల్లల భవిష్యత్తు గురించే ఆలోచిస్తాయని, ప్రజల పిల్లల గురించి కాదని ఆరోపించారు. ఫ్యామిలీ పార్టీలు చట్టాన్ని దుర్వినియోగం చేస్తాయన్నారు. ‘‘కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు బాంబు పేలుళ్లు జరిగాయి. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పీఎఫ్ఐ వంటి దేశ వ్యతిరేక శక్తులను ప్రోత్సహిస్తున్నది’’ అని చెప్పారు.
కాంగ్రెస్ వస్తే తెలంగాణను ఏటీఎంలా..
రాష్ట్రంలో పొరపాటున కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వాళ్లకు తెలంగాణ ఏటీఎం అవుతుందని, రాష్ట్రం కొన్నేళ్లు వెనక్కి పోవడం ఖాయమని నరేంద్ర మోదీ హెచ్చరించారు. రాష్ట్రంలో రాజకీయంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటేనని ఆరోపించారు. ఆ రెండు పార్టీల మధ్య ఒప్పందం ఉందని ధ్వజమెత్తారు.వాటిలో కుటుంబ వ్యవస్థ పెరిగిపోయిందని విమర్శించారు. అవినీతిలోనూ ఒకరిపై మరొకరు పోటీ పడుతున్నారని ఎద్దేవా చేశారు.
బీజేపీతోనే సామాజిక న్యాయం
ఇతర దేశాల్లో యూరియా బస్తా ధర రూ.3,500 వరకు ఉన్నప్పటికీ మన వద్ద రూ.300 కే అందిస్తున్నట్లు మోదీ తెలిపారు. ప్రజలపై పన్నుల భారం తగ్గించేలా ఇతర రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ తగ్గిస్తే.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో, తెలంగాణలో బీఆర్ఎస్ తగ్గించలేదని విమర్శించారు. దేశంలో, రాష్ట్రంలో బీజేపీ పాలనతోనే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని చెప్పారు. ‘‘ఆర్థికంగా వెనుకబడిన గిరిజనులు, ఆదివాసుల స్వశక్తి కోసం దేశవ్యాప్తంగా వెల్ఫేర్ బోర్డులు ఏర్పాటు చేశాం. ఎస్టీ స్టూడెంట్స్ కు స్కాలర్షిప్లు పెంచాం. ములుగు జిల్లాకు గిరిజన యూనివర్సిటీ ప్రకటించడంతోపాటు మేడారం సమ్మక్క సారక్క జాతరకు ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చాం. హైదరాబాద్‌లో రాంజీ గోండ్ మ్యూజియం ఏర్పాటు చేశాం” అని అన్నారు. నన్ను గెలిపించకుంటే.. నా
భార్యాపిల్లలకు ఏం చెప్పాలి?: బండి సంజయ్
కరీంనగర్ సభలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ అభ్యర్థి బండి సంజయ్ మాట్లాడుతూ.. ‘‘పేదల కోసం కష్టపడి పనిచేసిన నాలాంటోళ్లను మీరు గెలిపించకపోతే.. ‘పేదల కోసం ఎందుకు కొట్లాడాలి’ అని నా కార్యకర్తలు ప్రశ్నిస్తే నేనేం సమాధానం చెప్పాలె? నా భార్యాపిల్లలను చంపుతామన్నా భయపడకుండా ధర్మం కోసం, ప్రజల కోసం ఇన్నాళ్లు పోరాడిన. నాకు ఓట్లేసి గెలిపించకుంటే.. నా భార్యాపిల్లలు ప్రశ్నించినప్పుడు ఏమని చెప్పాలి? కరీంనగర్ ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. రాష్ట్రంలోని అన్ని వర్గాలు మీ తీర్పు కోసం ఎదురు చూస్తున్నాయి. ఒక్క చాన్స్ ఇస్తే 5 ఏండ్లు మీకు సేవ చేసుకుంటా. కరీంనగర్‌కు రక్షణ కవచంగా నిలుస్తా’’ అని అన్నారు.
తెలుగులో మాట్లాడిన ప్రధాని
మోదీ తన ప్రసంగంలో తరచూ ‘నా కుటుంబ సభ్యులారా’ అని తెలుగులో సంబోధించడం జనాన్ని ఆకట్టుకుంది. ‘తెలుగు రాష్ట్ర ప్రజలకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు’ అని చెప్పారు. మహబూబాబాద్ జిల్లాలోని కురవి వీరభద్ర స్వామిని, సంత్ సేవాలాల్ మహారాజ్ ని స్మరించకున్నారు. కరీంనగర్‌లో మాట్లాడుతూ.. ‘‘కాంగ్రెస్, కేసీఆర్ ఒక్కటే.. ఇద్దరితో జాగ్రత్తగా ఉండండి. బీజేపీ మాత్రమే తెలంగాణ ప్రతిష్టను పెంచుతుంది’’ అని తెలుగులో అన్నారు. అలాగే ‘తెలంగాణలో తొలిసారి’ అని మోదీ అంటే.. ‘బీజేపీ సర్కార్ వస్తుంది’ అని జనం నినదించారు. మొదటిసారి తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కానుందని చెప్పారు. ‘‘సామాజిక న్యాయం బీజేపీతోనే సాధ్యం. నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడితే.. కన్నీళ్లు, మోసాలు, నిరుద్యోగాన్ని ఇచ్చారు. మోదీ గారి గ్యారంటీ అంటే.. గ్యారెంటీగా పూర్తయ్యే గ్యారంటీ’’ అని తెలుగులో వ్యాఖ్యానించారు. మహబూబాబాద్ సభలో బీజేపీ మహబూబాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి జాటోత్ హుస్సేన్ నాయక్, మాజీ ఎంపీలు గరికపాటి మోహన్ రావు, రవీంద్ర నాయక్, మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు వద్దిరాజు రామచందర్ రావు, బీజేపీ డోర్నకల్ అభ్యర్థి భూక్య సంగీత.. కరీంనగర్ సభలో బీజేపీ వేములవాడ అభ్యర్థి వికాస్ రావు, చొప్పదండి అభ్యర్థి బొడిగె శోభ, మానకొండూరు అభ్యర్థి ఆరేపల్లి మోహన్, హుస్నాబాద్ అభ్యర్థి బొమ్మా శ్రీరామ్ చక్రవర్తి, సిరిసిల్ల అభ్యర్థి రాణిరుద్రమ, బీజేపీ నాయకులు ప్రతాపరామకృష్ణ పాల్గొని మాట్లాడారు.
రోడ్‌షోకు భారీగా జనం
ముషీరాబాద్, వెలుగు: హైదరాబాద్‌లో ప్రధాని మోదీ రోడ్‌షోకు భారీగా జనం తరలివచ్చారు. సోమవారం సాయంత్రం 6 గంటలకు ఆర్టీసీ క్రాస్ రోడ్డుకు ఆయన చేరుకున్నారు. అక్కడి నుంచి ఓపెన్ టాప్ వాహనంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్‌తో కలిసి రెండు కిలోమీటర్ల మేర రోడ్ షో నిర్వహించారు. జనం రోడ్డుకు ఇరువైపులా నిలబడి.. ‘జై మోదీ’ అంటూ నినాదాలు చేశారు. మోదీ వారికి చెయ్యి ఊపుతూ, అభివాదం చేస్తూ ముందుకు సాగారు. జనం ఆయనపై పూలు జల్లుతూ అభిమానాన్ని చాటుకున్నారు. ప్రధాని మోదీ సైతం ప్రజలపై పువ్వులు జల్లారు. రోడ్ షో సందర్భంగా చాలాచోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. మెట్రోల వద్ద ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.
రాష్ట్రంలో పొరపాటున కాంగ్రెస్ వస్తే వాళ్లకు తెలంగాణ ఏటీఎం అవుతుంది. తెలంగాణ కొన్నేండ్లు వెనక్కి పోవడం ఖాయం. ఒక రోగాన్ని తగ్గించుకునేందుకు మరో రోగాన్ని కొని తెచ్చుకోవద్దు. అభివృద్ధిలో వెనకబడిన తెలంగాణను కాంగ్రెస్ మరింత భ్రష్టు పట్టిస్తుంది. బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే.. తెలంగాణను ప్రగతిపథంపై వేగంగా దూసుకెళ్లేలా చేస్తుంది.
కేసీఆర్‌కు మూఢ నమ్మకాలు ఎక్కువ. మోదీకి ఎదురుపడితే ఆయన అక్రమ సంపాదన మొత్తం పోతుందని ఎవరో చెప్పారు. అందుకే నాకు ఎదురుపడడం లేదు. ఇలాంటి వ్యక్తి తెలంగాణ
లాంటి రాష్ట్రానికి అవసరమా?. .
కేసీఆర్ ఢిల్లీకి వచ్చిన సమయంలో బీజేపీ స్నేహం కోసం చేయి చాచారు. మా పార్టీతో దోస్తానా కోసం ప్రాధేయపడ్డారు. కానీ తెలంగాణ ప్రజలు ఆశించిన మేరకు బీఆర్ఎస్ నేతలు పాలన సాగించకపోవడం వల్లే వారిని దూరం పెట్టినం. - ప్రధాని నరేంద్ర మోదీ