- సివిల్స్లో నేతాజీ సంస్కృతం పేపర్ ఎంచుకున్నరు: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: దేశంలో బ్రిటీష్ పాలన సాగుతున్న సమయంలోనూ సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో సంస్కృతం పేపర్ ఉండేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత్ మండపంలో జరిగిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) శతాబ్ది ఉత్సవాల్లో ప్రధాని ప్రసంగించారు.
ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన చారిత్రక ఆర్కైవల్ ప్రదర్శనలోని వివరాలను ఆయన పంచుకున్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 1920లో రాసిన సివిల్స్ పరీక్షలో సంస్కృతం పేపర్‌ను ఎంచుకున్నారని మోదీ ప్రస్తావించారు.
‘‘గ్యాలరీని పరిశీలిస్తున్నప్పుడు 1920లో సుభాష్ చంద్రబోస్ ఇదే పరీక్ష ప్రక్రియ ద్వారా ఎలా ఎంపికయ్యారనే వివరాలు కనిపించాయి. అప్పట్లో ఇండియా బ్రిటీష్ పాలనలో ఉన్నప్పటికీ, సివిల్స్ పరీక్షల్లో సంస్కృతం పేపర్ ఉండేదన్న విషయం నా దృష్టిని ఆకర్షించింది’’ అని ప్రధాని వివరించారు.
గడచిన వందేండ్లలో పలువురు మహనీయులు ఈ పరీక్షా విధానాన్ని నమ్మకమైన వారసత్వంగా తీర్చిదిద్దారని, సంస్థను ఉన్నత శిఖరాలకు చేర్చారని ప్రశంసించారు.
