మోడీ తెలంగాణకు క్షమాపణ చెప్పాలి

మోడీ తెలంగాణకు క్షమాపణ చెప్పాలి

హైదరాబాద్: దేశంలో తెలంగాణ ఉందో, లేదో అన్నట్లు కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. పార్లమెంట్లో ప్రధాని మోడీ తెలంగాణ పట్ల చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ.. బుధవారం ఎంజి రోడ్ లోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. నల్లజెండాలతో నిరసన తెలుపుతూ  గన్ పార్క్ అమరవీరుల స్తూపం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. నిరసనలో భాగంగా మోడీ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. ప్రధాని తెలంగాణపై అక్కసు వెళ్లగక్కారన్నారు. బడ్జెట్ మీద ప్రసంగించాల్సిన ప్రధాని .. ఐదు రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇష్టానుసారంగా మాట్లాడారన్నారు. బీజేపీ ప్రభుత్వం తెలంగాణ పట్ల దుర్మార్గంగా  వ్యవహరిస్తుందన్నారు.  రాజ్యాంగం ప్రకారం విభజన జరిగినప్పుడు... విభజన హామీలను ఏమి చేశారని ప్రశ్నించారు.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అఖిలేష్ యాదవ్ గెలుస్తాడనే భయంతో ప్రధాని మోడీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారన్నారు.  దేశంలో నరేంద్ర మోడీ రాజ్యాంగం నడుస్తుందన్న తలసాని.. ప్రజాస్వామ్యంలో నియంత పాలన నడవదన్నారు. ఉత్తర్ ప్రదేశ్ లో ఎస్పీ గెలుస్తుందని ఐబీ రిపోర్టు ఇవ్వడంతో కాశీ, అయోధ్యలో, చినజీయర్ ఆశ్రమంలో మోడీ డ్రామాలు చేశారన్నారు. పార్లమెంటులో డ్రామాలు స్టార్ట్ చేశాడని.. బీజేపీ నాయకులు కుక్కల్లాగా మాట్లాడుతున్నారన్నారు. రాజ్యాంగం గురించి నోటికి వచ్చినట్టు వాగుతున్నారని.. సింగరేణి జోలికి వస్తే తెలంగాణ మరోసారి భగ్గు మంటదన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు దాన్ని అమ్మాలని చూస్తున్నారన్న ఆయన..  రైతన్న ఉద్యమంలో రైతుల పైకి కారెక్కించి తొక్కించి చంపిన దుర్మార్గపు ప్రభుత్వం బీజేపీదన్నారు.  కరోనా విషయంలో ప్రపంచం ముందు భారతదేశం పరువు తీసిన మోడీ.. కనీసం పేదవాళ్లు ఇతర రాష్ట్రాలకు వెళ్లడానికి ట్రైన్  ఉచితంగా ఇవ్వలేదన్నారు. ముఖ్యమంత్రిపై, ఆయన కుటుంబంపై ఏకవచనంతో విమర్శిస్తే ప్రధానిని, కేంద్ర ప్రభుత్వాన్ని కడిగేస్తామన్నారు.  ప్రధాని నరేంద్ర మోడీ రోజుకు మూడు డ్రెస్సులు మారుస్తూ ఫ్యాషన్ షోలో క్యాట్ వాక్ చేస్తాడన్నా తలసాని..  ప్రధాని మోడీ తెలంగాణకు క్షమాపణ చెప్పాలన్నారు. వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని.. లేదంటే కేసీఆర్ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా ఉద్యమం చేస్తామన్నారు.