సుప్రీంకోర్టు వజ్రోత్సవ వేడుకలు... అందుబాటులోకి వచ్చిన డిజిటల్ ఫార్మాట్‌

సుప్రీంకోర్టు వజ్రోత్సవ వేడుకలు... అందుబాటులోకి వచ్చిన డిజిటల్ ఫార్మాట్‌

సుప్రీంకోర్టు డైమండ్ జూబ్లీ వేడుకలను ప్రధాని మోదీ ప్రారంభించారు. దేశ సర్వోన్నత న్యాయస్థానం 75వ వసంతంలోకి అడుగు పెట్టింది. 1950 జనవరి 28న సుప్రీంకోర్టు ప్రారంభమైంది. నేటికి ( 2024 జనవరి 28) 75 సవంత్సరాలు పూర్తి చేసుకున్న  సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యాయస్థాన వజ్రోత్సవాలను ప్రారంభించారు.   అనంతరం సుప్రీంకోర్టు కొత్త వెబ్‌సైట్‌ను ప్రధాని ప్రారంభించారు. 

దీంతో దేశ పౌరులకు ఉచితంగా ఎలక్ట్రానిక్ ఫార్మాట్‌లో డిజిటల్ సుప్రీం కోర్టు నివేదికలు, సుప్రీంకోర్టు తీర్పులు అందుబాటులోకి వచ్చాయి. డిజిటల్ సుప్రీం కోర్టు నివేదికలు (డీజీ ఎస్‌సీఆర్),  1950 నుంచి ఉన్న సుప్రీం కోర్టు నివేదికలు, 519 వాల్యూమ్స్ నివేదికలు, 36 వేల 308 కేసుల తీర్పులు డిజిటల్ ఫార్మాట్‌లో అందుబాటులో ఉండనున్నాయి. 

భారత సుప్రీంకోర్టు 75 ఏళ్లు పూర్తి చేసుకుంది.. ఏడు దశాబ్దాల్లో సుప్రీంకోర్టు ఎన్నో చరిత్రాత్మక తీర్పులనిచ్చిందని ప్రధాని మోదీ అన్నారు.. ప్రజాస్వామ్య పరిరక్షణకు సామాజిక న్యాయానికి సుప్రీంకోర్టు నిరంతరం కృషి చేసింది.. కోర్టుల డిజిటలైజేషన్‌ గొప్ప ముందడుగు.. దేశ పౌరుల హక్కులను కాపాడడంలో సుప్రీంకోర్టుది కీలక పాత్ర అని ప్రధాని తెలిపారు.

దేశ ప్రజల ప్రాథమిక హక్కులను కాపాడటంలో కీలక భూమిక పోషిస్తున్న ఈ న్యాయస్థానానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. 1947లో భారత్‌కు స్వాతంత్య్రం రావడంతో 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. దరిమిలా 1950 జనవరి 28 నుంచి సుప్రీంకోర్టు మనుగడలోకి రావడం గమనార్హం.  సుప్రీంకోర్టు జారీ చేసే ఉత్తర్వులకు దేశంలోని అన్ని కోర్టులూ కట్టుబడి ఉండాలన్న నిబంధనలు అమల్లోకి వచ్చాయి. చట్టసభలు, కార్యనిర్వాహక వ్యవస్థలు తీసుకొనే నిర్ణయాలను సమీక్షించి రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నవాటిని కొట్టివేసే అధికారం ఈ కోర్టుకు దక్కింది. 1950 జనవరి 28 ఉదయం 9.45 గంటలకు న్యాయమూర్తులు తొలిసారి సమావేశమవడంతో దాన్నే సుప్రీంకోర్టు అధికారిక ప్రారంభంగా గుర్తించారు. ప్రస్తుత కోర్టు నడుస్తున్న భవనం అందుబాటులోకి వచ్చేంతవరకూ పాత పార్లమెంటు భవనంలోని ఛాంబర్‌ ఆఫ్‌ ప్రిన్సెస్‌లో సుప్రీంకోర్టు కొనసాగింది.