రేపు షింజో అబే అంత్యక్రియల్లో పాల్గొననున్న మోడీ

రేపు షింజో అబే అంత్యక్రియల్లో పాల్గొననున్న  మోడీ

భారత ప్రధాని నరేంద్ర మోడీ జపాన్కు బయల్దేరారు.  ఇటీవల హత్యకు గురైన జపాన్‌ మాజీ ప్రధాని షింజో అబే అంత్యక్రియల్లో పాల్గొనేందుకు మోడీ కొద్దిసేపటి క్రితం ప్రత్యేక విమానంలో వెళ్లారు. ఈ విషయాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి ట్వీట్ చేశారు.

షింజో అబే అంత్యక్రియలకు హాజరయ్యే ముందు మోడీ ఆ దేశ ప్రధాని ఫుమియో కిషిదాతో ద్వైపాక్షిక సమావేశానికి హాజరుకానున్నారు. షింజో అబే మృతి పట్ల మోడీ సంతాపం తెలిపారు , షింజో అబే వంటి మహోన్నత నేతను కోల్పోయినందుకు జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా, అబే అర్ధాంగికి భారతీయులందరి తరఫున ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నట్లుగా మోడీ ట్వీట్ చేశారు.  షింజో అబే ఆశయాలను కొనసాగిస్తూ భారత్, జపాన్ సంబంధాల బలోపేతానికి కృషి చేస్తామని  తన ట్వీట్ లో తెలిపారు. 

జపాన్‌లో అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన షింజో అబే జూలై 8న పశ్చిమ జపాన్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా హత్యకు గురయ్యారు. నిందితుడిని పోలీసులు వెంటనే అరెస్టు చేశారు. అబేకు గౌరవసూచకంగా జూలై 9న భారతదేశం ఒకరోజు జాతీయ సంతాప దినాన్ని ప్రకటించింది. షింజో అబే అంత్యక్రియ‌ల కోసం జ‌పాన్ ప్రభుత్వం సుమారుగా 11 మిలియ‌న్ల డాల‌ర్లు ఖ‌ర్చు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. వివిధ దేశాధినేత‌లు షింజో అంత్యక్రియ‌ల‌కు హాజ‌ర‌వుతున్న నేప‌థ్యంలో పోలీసులు భారీ భద్రతను కల్పించనున్నారు.