- ‘ఆపరేషన్ సిందూర్’ టైంలోనూ ఆ దేశం వాదనలే వినిపించింది
- ఆ పార్టీ ‘అబద్ధాల దుకాణం’ ‘అవమానాల పార్టీ’ అంటూ ఫైర్
భవానీపూర్, సోర్భోగ్/హోజాయి(అస్సాం): కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్‌కు అనుకూలంగా వ్యవహరిస్తోందని, ఆ దేశం పాట పాడుతున్నదని ప్రధాని నరేంద్రమోదీ తీవ్ర ఆరోపణలు చేశారు. అస్సాం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మోదీ ఈ కామెంట్లు చేశారు. సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ బర్‌పేట రోడ్, హోజాయి, మొరాన్ (దిబ్రూగఢ్)లో బీజేపీ చేపట్టిన మూడు భారీ ర్యాలీల్లో పాల్గొన్నారు. బర్‌పేట ర్యాలీలో మోదీ మాట్లాడుతూ.. 2025 ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలోనూ కాంగ్రెస్ పాకిస్తాన్ వాదనే వినిపించిందన్నారు.
ఈ సంబంధం ఇప్పటిది కాదని, ఎప్పటి నుంచో సాగుతోందని ఆరోపించారు. ఆ సమయంలో కాంగ్రెస్ నేతలు పవన్ ఖేరా, గౌరవ్ గొగోయ్ నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పేర్కొన్న సమాచారం పాకిస్తాన్ సోషల్‌మీడియా నుంచి తీసుకున్నట్టు గుర్తించామన్నారు. రాహుల్ గాంధీ నినాదం ‘మెహబ్బత్కీ దుకాణ్’ ను పరోక్షంగా ప్రస్తావిస్తూ కాంగ్రెస్‌ను ‘అబద్ధాల దుకాణం’, ‘అవమానాల పార్టీ’గా అభివర్ణించారు. వన్ ర్యాంక్ వన్ పెన్షన్ పేరిట ఇప్పటివరకు రూ.1.24 లక్షల కోట్లు సైనికుల ఖాతాల్లో నేరుగా వేశామని ప్రధాని తెలిపారు. ఎన్నికల సమయంలో పాకిస్తాన్ టీవీ చానెళ్లు కొన్ని టాక్ షోలు, డిబేట్లు నిర్వహించి కాంగ్రెస్ గెలవాలని చెప్పినట్టు అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ఆరోపించారు. తన భార్య రినికి భుయాన్ శర్మపై తప్పుడు ఆరోపణలు చేసిన కాంగ్రెస్‌పై ఆమె పోలీసు కేసు నమోదు చేసిందని తెలిపారు.
- అస్సాంను ప్రపంచ వేదికపై నిలబెడతాం
గత పదేండ్లు అస్సాంలో శాంతి, భద్రతలు పునరుద్ధరించడానికి, రాష్ట్ర గుర్తింపును కాపాడటానికి వినియోగించామని, రాబోయే కాలంలో రాష్ట్రాన్ని ప్రపంచ వేదికపై నిలబెట్టడమే తమ లక్ష్యమని మోదీ అన్నారు. మొరిగావ్‌లో రానున్న సెమీకండక్టర్ ఫ్యాక్టరీ ఎలక్ట్రానిక్స్ నుంచి ఎలక్ట్రిక్ వాహనాల వరకు అనేక పరిశ్రమలకు ద్వారాలు తెరుస్తుందని, విద్యుత్ రంగంలో అస్సాం ఇతర రాష్ట్రాలపై ఆధారపడటం తగ్గించి ఉత్పత్తిలో మోడల్ రాష్ట్రంగా ఎదిగిందని చెప్పారు.
పార్లమెంటులో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ 2029 ఎన్నికల నుంచి అమలవుతుందని, దీనిపై ఏప్రిల్ 16న అన్ని పార్టీలతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని ప్రకటించారు. వరి మద్దతు ధర రూ.1,300 నుంచి రూ.2,370కి పెంచామని, అస్సాం 'జోహా' బియ్యం యూరప్‌కు ఎగుమతి అవుతోందని చెప్పారు.
అలాగే ఏప్రిల్ 1న గొగాముఖ్ లో నిర్వహించిన ర్యాలీలో మోదీ మాట్లాడుతూ యూనిఫాం సివిల్ కోడ్ ప్రవేశపెడతామని ప్రకటించారు. ఇది ఆదివాసీల సంప్రదాయాలను, భూహక్కులను కాపాడుతుందని చెప్పారు. ఏప్రిల్ 7 సాయంత్రం 5 గంటలకు అస్సాంలో ఎన్నికల ప్రచారం గడువు ముగియనుంది. ఏప్రిల్ 9న 126 స్థానాలకు పోలింగ్ జరగనుంది. మే 4న రిజల్ట్ వెలువడనుంది.
