2030 దాటినా మోదీ హవానే!..నాలుగోసారి ప్రధాని పీఠంపై కన్ను..బ్లూమ్‌‌‌‌బెర్గ్ విశ్లేషణలో ఆసక్తికర అంశాలు

2030 దాటినా మోదీ హవానే!..నాలుగోసారి ప్రధాని పీఠంపై కన్ను..బ్లూమ్‌‌‌‌బెర్గ్ విశ్లేషణలో ఆసక్తికర అంశాలు
  • వరుస రాష్ట్రాల విజయాలతో ప్రతిపక్షాలు కకావికలం
  • కఠినమైన ఆర్థిక సంస్కరణలను అమలు చేయడంపై మోదీ ఫోకస్​
  • రాజ్యసభలో పూర్తి మెజార్టీ లేకపోవడం పార్టీకి మైనస్‌‌‌‌

న్యూఢిల్లీ: దేశ రాజకీయాల్లో ప్రధాని నరేంద్ర మోదీ జైత్రయాత్ర అప్రతిహతంగా సాగుతోంది. 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలతో మోదీ పదేండ్ల పాలనకు బ్రేకులు పడతాయన్న విశ్లేషణలను తలకిందులు చేస్తూ.. ఆయన మరో దశాబ్ద కాలం పాటు అధికారాన్ని నిలబెట్టుకునే దిశగా అడుగులు వేస్తున్నారని బ్లూమ్‌‌‌‌బెర్గ్‌‌‌‌ నివేదిక వెల్లడించింది.

ఇటీవల పశ్చిమ బెంగాల్‌‌‌‌లో సాధించిన చరిత్రాత్మక విజయం, కేరళ, తమిళనాడులో పాలక పక్షాల ఓటమి.. మోదీ రాజకీయ వ్యూహాలకు అద్దం పడుతున్నాయని పేర్కొన్నది. 2029లో జరగనున్న జాతీయ ఎన్నికల్లో నాలుగోసారి విజయకేతనం ఎగురవేసి, దేశ చరిత్రలోనే అత్యధిక కాలం పనిచేసిన ప్రధానిగా రికార్డు సృష్టించేందుకు ఆయన సిద్ధమవుతున్నట్టు వెల్లడించింది.

మోదీ ప్రస్థానం కేవలం ఒక దశాబ్దానికే పరిమితం కాబోదని, 2030 తర్వాత కూడా బలంగా కొనసాగే అవకాశం ఉన్నదని విశ్లేషించింది. ఇటీవల బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సాధించిన అసాధారణ విజయం, మారుతున్న అంతర్జాతీయ సమీకరణాలు మోదీ నాయకత్వానికి మరింత బలాన్ని చేకూరుస్తున్నాయని పేర్కొంది.

హిందూ ఓట్ల ఏకీకరణే మంత్రం! 

2024 ఎన్నికల్లో బీజేపీ తన సొంత మెజారిటీని కోల్పోయినప్పటికీ, ఆ తర్వాత జరిగిన పరిణామాలు పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. ముఖ్యంగా కులాలవారీగా చీలిపోయిన హిందూ ఓటర్లను మళ్లీ ఏకతాటిపైకి తీసుకురావడంలో మోదీ సఫలీకృతమైనట్టు బ్లూమ్​బెర్గ్‌‌‌‌ రిపోర్ట్‌‌‌‌ తేల్చింది. జాతీయ భద్రత, సంక్షేమ పథకాల అమలు, మైనారిటీ బుజ్జగింపు రాజకీయాలకు వ్యతిరేకంగా ఆయన చేస్తున్న ప్రచారం ప్రజల్లోకి బలంగా వెళ్తోంది.

ఇటీవలి బెంగాల్‌‌‌‌ ఎన్నికలను పరిశీలిస్తే హిందూ జనాభా ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో బీజేపీ తన పట్టును స్థిరంగా పెంచుకున్నది. అదే సమయంలో, ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో ఓట్లు చీలిపోవడంతో, ప్రతిపక్ష పార్టీలేవీ బలమైన ప్రత్యామ్నాయంగా ఎదగలేకపోయాయని బ్లూమ్​బెర్గ్‌‌‌‌ విశ్లేషించింది.

బెంగాల్ విజయం.. ఒక టర్నింగ్ పాయింట్

మోదీ హవా 2030 దాటి కొనసాగుతుందని చెప్పడానికి బ్లూమ్‌‌‌‌బెర్గ్ ప్రధానంగా పశ్చిమ బెంగాల్ ఫలితాలను ఉదహరించింది. తృణమూల్ కాంగ్రెస్‌‌‌‌లాంటి బలమైన ప్రాంతీయ శక్తిని సొంత గడ్డపైనే మట్టికరిపించడం ద్వారా బీజేపీ తిరుగులేని శక్తిగా ఎదిగిందని నివేదిక తెలిపింది. ‘‘వరుస విజయాలతో బీజేపీ అత్యంత పటిష్ట స్థితిలో ఉంది. 2029 ఎన్నికల్లో ఆ పార్టీయే హాట్ ఫేవరెట్’’ అని అట్లాంటిక్ కౌన్సిల్ సీనియర్ ఫెలో మైఖేల్ కుగెల్మాన్ చెప్పారు.

భవిష్యత్తు అజెండా, సవాళ్లు..

ప్రస్తుతం దేశంలోని మూడింట రెండొంతుల రాష్ట్రాల్లో బీజేపీ లేదా దాని మిత్రపక్షాలు అధికారంలో ఉండటంతో, మోదీ ప్రభుత్వం మరింత దూకుడుగా వ్యవహరించే అవకాశం ఉందని బ్లూమ్‌‌‌‌బెర్గ్‌‌‌‌ రిపోర్ట్​ వెల్లడించింది. ఈ ఊపుతో వ్యాపార అనుకూల ఆర్థిక సంస్కరణలు, వన్ నేషన్ -వన్ ఎలక్షన్, యూనిఫామ్‌‌‌‌ సివిల్​ కోడ్‌‌‌‌ అమలు, నియోజకవర్గాల పునర్విభజనలాంటి కీలక మార్పులను చేపట్టే దిశగా మోదీ అడుగులు వేస్తున్నారు. అయితే, ఇరాన్ యుద్ధం కారణంగా పెరుగుతున్న చమురు ధరలు, ద్రవ్యోల్బణంలాంటి ఆర్థిక సవాళ్లు మోదీకి అడ్డంకిగా మారనున్నాయని, ఈ నేపథ్యంలో 2029 ఎన్నికలకు ముందే కఠినమైన ఆర్థిక సంస్కరణలను అమలు చేయాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

ప్రతిపక్షాల వైఫల్యం.. మోదీకి బలం!

ప్రతిపక్షాల మధ్య ఐక్యత లేకపోవడం బీజేపీకి వరంగా మారింది. ‘‘ప్రతిపక్షాలు తమ విభేదాలను పక్కన పెట్టి ఏకం కానంత వరకు మోదీని అడ్డుకోవడం అసాధ్యం”అని సీపీఎం సీనియర్ నేత హన్నన్ మొల్లా వ్యాఖ్యానించారు. అయితే, వచ్చే ఏడాది జరిగే గుజరాత్, యూపీలాంటి రాష్ట్రాల ఎన్నికలు ప్రతిపక్షాలకు చివరి అవకాశంగా మిగలనున్నాయి. బయటి శత్రువుల కంటే పార్టీలో తలెత్తే అంతర్గత విభేదాలే మోదీకి భవిష్యత్తులో సవాలుగా మారవచ్చని రాజకీయ విశ్లేషకుడు సందీప్ శాస్త్రి పేర్కొన్నారు.

మోదీ ముందున్న సవాళ్లు ఇవే..

ఈ ప్రస్థానం అంత సులువేమీ కాదని కూడా నివేదిక హెచ్చరించింది. రాజ్యాంగ సవరణలు చేయడానికి అవసరమైన పూర్తి మెజారిటీ ఇంకా రాజ్యసభలో లేకపోవడం ప్రధాన అడ్డంకిగా మారవచ్చు. భూసేకరణ చట్టాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కారణంగా తలెత్తే ఉపాధి సమస్యలు భవిష్యత్తులో ప్రభుత్వానికి సవాల్‌‌‌‌ విసరొచ్చు. పంజాబ్, గుజరాత్‌‌‌‌లాంటి రాష్ట్రాల్లో స్థానిక వ్యతిరేకతను అధిగమించడం మోదీకి కీలకం కానున్నది.