మీ తల్లిదండ్రులు పడ్డ కష్టం మీకుండదు

మీ తల్లిదండ్రులు పడ్డ కష్టం మీకుండదు

సాంబా(జమ్మూకాశ్మీర్): ‘‘కాశ్మీర్​ లోయలోని యువతా! మీ అమ్మానాన్న, మీ తాతమామ్మలు జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించారు. అయితే మీకు మాత్రం అలాంటి జీవితం ఉండదని హామీ ఇస్తున్నాను. మీ పెద్దోళ్లు చాలా కాలం పాటు ఎదుర్కొన్న ఇబ్బందులకు ఇప్పుడు ముగింపు పలికాం. శాంతి, అభివృద్ధికి సంబంధించి ఎన్నో కార్యక్రమాలను చేపట్టాం”అని ప్రధానమంత్రి నరేంద్రమోడీ కాశ్మీరీ యువతకు హామీ ఇచ్చారు. కాశ్మీర్ యువత తన మాటలు నమ్మాలని, అందుకు తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కాశ్మీర్​లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలే నిదర్శనమని చెప్పారు. 2019లో ఆర్టికల్​ 370ని రద్దు చేసి, జమ్మూకాశ్మీర్​ను కేంద్ర పాలిత ప్రాంతం(యూటీ) చేసిన తర్వాత తొలిసారిగా కాశ్మీర్​లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించారు.

పల్లి.. కార్బన్​ న్యూట్రల్​ పంచాయతీ

సాంబా జిల్లాలోని పల్లి గ్రామంలో 500 కిలోవాట్ల సోలార్​ పవర్​ ప్లాంట్​ను ప్రధాని మోడీ ప్రారంభించారు. దీని ద్వారా దేశంలోనే మొట్టమొదటి కార్బన్ న్యూట్రల్ పంచాయతీగా పల్లి గ్రామం నిలిచిందని చెప్పారు. ఇందులో పల్లి ప్రజల సహకారం మరువలేనిదని కొనియాడారు. ఈ ప్రాజెక్టులో పాల్గొన్న వారికి అన్ని రకాలుగా వారు సహాయం చేశారన్నారు. ప్రజాస్వామ్యం, అభివృద్ధిలో జమ్మూకాశ్మీర్​ దేశానికి కొత్త దశను చూపిస్తోందని, గత మూడేండ్లుగా జమ్మూకాశ్మీర్​లో అభివృద్ధి కొత్త శిఖరాలను చేరుకుందని చెప్పారు. పంచాయతీ రాజ్​ వ్యవస్థ బలోపేతానికి కాశ్మీర్​ ఎంతగానో కృషి చేస్తోందని, ఈ ఏడాది పంచాయతీ రాజ్​ దినోత్సవంలో ఈ యూటీ మార్పునకు చిహ్నంగా నిలిచిందని చెప్పారు. జమ్మూకాశ్మీర్​ నుంచి దేశవ్యాప్తంగా ఉన్న పంచాయతీరాజ్​ సంస్థలను ఉద్దేశించి మాట్లాడటం తనకు చాలా గొప్ప గౌరవమని, ఎన్నో ఏండ్ల తర్వాత కాశ్మీర్​ ప్రజలు ఇలాంటి కార్యక్రమంలో పాల్గొంటున్నారని చెప్పారు.

రోడ్​ టన్నెల్​ ప్రారంభం

కాశ్మీర్​ లో చేపట్టిన పలు కీలక ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. బనిహాల్, కాజీగుండ్ మధ్య రోడ్​ టన్నెల్​​లను కూడా మోడీ ఈ సందర్భంగా ప్రారంభించారు. ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా ప్రయాణం చేయడానికి వీలుగా ఈ సొరంగం నిర్మించారు. 8.45 కి.మీ. పొడవైన ఈ టన్నెల్ వల్ల బనిహాల్, కాజీగుండ్ మధ్య 16 కి.మీ. దూరం తగ్గనుంది. అంటే గంటన్నర సమయం ఆదా అవుతుంది. ఆదివారం జాతీయ పంచాయతీ రాజ్​ దినోత్సవంలో భాగంగా సాంబా జిల్లాలో నిర్వహించిన ర్యాలీలో మోడీ మాట్లాడారు. ‘‘రోడ్​ కనెక్టివిటీ, ఎలక్ట్రిసిటీకి సంబంధించి రూ.20 వేల కోట్లతో చేపట్టిన ప్రాజెక్టులను ఈరోజు ప్రారంభించా. జమ్మూ, కాశ్మీర్ అభివృద్ధిని వేగవంతం చేసేందు కు అనేక కార్యక్రమాలు చేపట్టా”అని చెప్పారు.

చిన్న చెల్లింపులతో పెద్ద డిజిటల్ ఎకానమీ

దేశంలో రోజూ రూ.20 వేల కోట్ల డిజిటల్​ చెల్లింపులు జరుగుతున్నాయని, దీనివల్ల సౌకర్యాలు పెరగడమే కాకుండా నిజాయితీ కలిగిన వాతావరణాన్ని సృష్టిస్తోందని ప్రధాని మోడీ అన్నారు. మార్చిలో యూపీఐ చెల్లింపులు మొత్తంగా రూ.10 లక్షల కోట్లకు చేరుకున్నాయని చెప్పారు. చిన్న ఆన్​లైన్​ చెల్లింపులే.. అతి పెద్ద డిజిటల్​ ఎకానమీని నిర్మించేందుకు సహాయం చేస్తోందని చెప్పారు. డిజిటల్​ చెల్లింపులు, స్టార్టప్​ సిస్టంపై అవగాహన ఉన్న వారు తమ అభిప్రాయాలను ఇతరులతో పంచుకోవాలని సూచించారు. మన్​కీ బాత్​ కార్యక్రమంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.

కరోనాపై అలెర్ట్​గా ఉండాలె

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో అలెర్ట్​గా ఉండాలని ప్రధాని మోడీ సూచించారు. రంజాన్, అక్షయ తృతియ వంటి పండుగలు ఉన్నందువల్ల అప్రమత్తంగా ఉండాలని, కరోనా జాగ్రత్తలు పాటించాలని చెప్పారు. మాస్క్​ పెట్టుకోవాలని, తరచుగా చేతులు కడుక్కోవాలన్నారు. కరోనాకు ఎలాంటి జాగ్రత్తలు అవసరమో వాటిని ఫాలో కావాలన్నారు.