దేశమంతా ఫ్రీ వ్యాక్సిన్

దేశమంతా ఫ్రీ వ్యాక్సిన్

రాష్ట్ర ప్రభుత్వాలు పైసా కూడా ఖర్చు పెట్టాల్సిన పనిలేదు.. వ్యాక్సినేషన్​ బాధ్యత కేంద్రానిదే
18 ఏండ్లు నిండినోళ్లందరికీ ఈ నెల 21 నుంచి టీకా: ప్రధాని
75% డోసులు కొని రాష్ట్రాలకు సప్లయ్​ చేస్తం 25% డోసులు ప్రైవేటు హాస్పిటల్స్​ కొనొచ్చు 
ప్రైవేటులో సర్వీస్​ చార్జ్​ రూ. 150 వ్యాక్సిన్​పై తప్పుడు ప్రచారం నమ్మొద్దని సూచన


కరోనా టీకాను ముందుగా హెల్త్​, ఫ్రంట్​లైన్​ వర్కర్ల​కు ఇచ్చినం కాబట్టే వాళ్లు  ధైర్యంగా ఉండి, మనందరి జీవితాలను కాపాడేందుకు నిరంతరం శ్రమిస్తున్నరు. డాక్టర్లకు, నర్సులకు, సఫాయి కార్మికులకు, అంబులెన్స్​ వాళ్లకు ముందుగా టీకా ఇవ్వకపోతే పరిస్థితి మరోలా ఉండేది. కొందరు వ్యాక్సినేషన్​పై ప్రశ్నిస్తున్నరు. ఏజ్​ గ్రూప్​  ఎందుకు పెట్టారని నిలదీస్తున్నరు. వృద్ధులకే ముందుగా ఎందుకు వేశారని అంటున్నరు. ఒక వర్గం అదే పనిగా ఈ విషయాలపై క్యాంపెయిన్​  నడిపించింది. కానీ.. వ్యాక్సిన్​ ఉత్పత్తి సామర్థ్యానికి తగ్గట్టుగా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. వ్యాక్సినేషన్​పై దుష్ప్రచారాలు, భయాందోళనలు స్ప్రెడ్​ చేయడమంటే జీవితాలతో ఆడుకోవడమే. డోసులను వృథా చేయొద్దు. ఒక్కో డోస్​లో ఒక్కో జీవితం దాగి ఉందనే విషయం మరవొద్దు. - ప్రధాని నరేంద్ర మోడీ
ఇప్పటికే 23 కోట్ల డోసులు ఇచ్చాం
జనవరి 16 నుంచి దేశంలో వ్యాక్సినేషన్​ మొదలైందని, ఇప్పటివరకు 23 కోట్ల డోసులు ఇచ్చామని ప్రధాని చెప్పారు.  గత ఏడాది ఏప్రిల్​లోనే కరోనాను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం టాస్క్​ఫోర్స్​ను ఏర్పాటు చేసిందని, వ్యాక్సిన్​ ఉత్పత్తి దారులకు అన్ని రకాలుగా అండగా నిలిచిందని చెప్పారు. ‘‘ఆత్మనిర్భర్​  భారత్​ ప్యాకేజీ, మిషన్​ కొవిడ్​ సురక్ష పథకం కింద వేల కోట్ల రూపాయలు వ్యాక్సిన్​ తయారీ సంస్థలకు ఇచ్చాం. వారి వెంట ఉండి నడిచాం. మన సైంటిస్టులు తక్కువ టైంలో వ్యాక్సిన్లు అందుబాటులోకి తెచ్చారు. వారి సేవలు మరువలేనివి. రాబోయే రోజుల్లో వ్యాక్సిన్​ సప్లయ్​ మరింత పెరుగుతుంది” అని చెప్పారు. దేశంలో 7 కంపెనీలు వ్యాక్సిన్లను​ తయారు చేస్తున్నాయని, మూడు రకాల వ్యాక్సిన్ల తయారీ అడ్వాన్స్​ స్టేజ్​లో ఉందన్నారు. ఇతర దేశాల్లోని కంపెనీల నుంచి కూడా వ్యాక్సిన్​ కొనేందుకు చర్యలు  చేపట్టామని తెలిపారు.
న్యూఢిల్లీ: దేశంలో ప్రతి ఒక్కరికీ ఫ్రీగా కరోనా వ్యాక్సిన్​ను కేంద్ర ప్రభుత్వమే వేయిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు. వ్యాక్సిన్​ కోసం రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదన్నారు. వ్యాక్సినేషన్​ బాధ్యత పూర్తిగా కేంద్రానిదేనని స్పష్టంచేశారు. 18 ఏండ్లు నిండినవాళ్లందరికీ ఈ నెల 21 నుంచి ఉచితంగా టీకా వేస్తారని, కరోనాపై పోరాటంలో టీకా సురక్ష కవచమని ఆయన చెప్పారు. ఇంత పెద్ద దేశంలో వ్యాక్సినేషన్​ ఎలా అని ప్రపంచ దేశాలు సందేహాలు వ్యక్తం చేశాయని, అయినా వ్యాక్సినేషన్​లో ఇతర దేశాలతో పోలిస్తే మనమే ముందున్నామని తెలిపారు. దీపావళి వరకు ఉచిత రేషన్​ స్కీం కొనసాగుతుందని వెల్లడించారు. సోమవారం సాయంత్రం ప్రధాని మోడీ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. 


కరోనా వ్యాప్తి, వ్యాక్సిన్ల తయారీ, తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి పలు అంశాలపై ఆయన మాట్లాడారు. కరోనాపై పోరాటంలో దేశం విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మాస్క్​, సోషల్​ డిస్టెన్స్​ వంటి ప్రొటోకాల్​ను తప్పక పాటించాలని ఆయన పిలుపునిచ్చారు. కరోనా సెకండ్​ వేవ్​పై పోరాటం కొనసాగుతోందని, అన్ని దేశాలతో పాటు మన దేశం కూడా కరోనా వల్ల చాలా నష్టపోయిందని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. ‘‘సెకండ్​ వేవ్​లో ఆత్మీయులు, తోబుట్టువులు, స్నేహితులను కోల్పోయాం. ఇది చాలా బాధాకరం. ఆ కుటుంబాల బాధను పంచుకుంటున్నా. వందేండ్లలో అతిపెద్ద మహమ్మారి ఇది. ఇలాంటి మహమ్మారిని ఆధునిక ప్రపంచం కనీవినీ ఎరుగలేదు. కరోనాపై ప్రపంచమంతా ఒక్కటిగా పోరాడుతోంది” అని పేర్కొన్నారు.
10 రెట్లు ఆక్సిజన్​ ఉత్పత్తి పెరిగింది
ఈ ఏడాది ఏప్రిల్​, మేలో కరోనా సెకండ్​ వేవ్​ వల్ల దేశ చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఆక్సిజన్​కు  డిమాండ్​ పెరిగిందని మోడీ అన్నారు. కొరతను అధిగమించేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టామని, ఆక్సిజన్​ సరఫరా కోసం రైల్వే, ఎయిర్​ఫోర్స్​, నేవీలను ఉపయోగించుకున్నామని చెప్పారు. తక్కువ టైంలో మెడికల్​ ఆక్సిజన్​ ఉత్పత్తిని  10 రెట్లు పెంచామన్నారు. 
అదే పరిస్థితి ఉంటే వ్యాక్సిన్​కు 40 ఏండ్లు పట్టేది
మన దేశంలో వ్యాక్సిన్​ ఉత్పత్తికాకపోతే పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవాలని ప్రధాని మోడీ అన్నారు. ‘‘ఇంత పెద్ద జనాభాకు ఇండియా ఎలా వ్యాక్సిన్​ ఇస్తుందని ప్రపంచమే సందేహాలు వ్యక్తం చేసింది. అయితే.. నీతి, నిజాయితీ, నిరంతర శ్రమ ఉంటే ఏ సమస్యకైనా పరిష్కారం ఉంటుంది. మన సైంటిస్టుల కఠోర కృషి వల్ల ఏడాదిలోనే రెండు మేడిన్​ ఇండియా వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి” అని చెప్పారు. మన దేశంలో వ్యాక్సిన్​ఉత్పత్తి చేసే కంపెనీలు చాలా తక్కువగా ఉన్నాయని, 50 ఏండ్లుగా విదేశాల నుంచే వ్యాక్సిన్​ తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉండేదన్నారు. ‘‘పోలియో వ్యాక్సిన్​ కావొచ్చు.. స్మాల్​ పాక్స్​ వ్యాక్సిన్​ కావొచ్చు.. హెపిటైటీస్​ బీ వ్యాక్సిన్​ కావొచ్చు.. దేనికైనా విదేశాల మీదే ఆధారపడాల్సిన పరిస్థితి ఉండేది. ఆయా దేశాల్లో వ్యాక్సినేషన్​ పూర్తయ్యాక కూడా మన దేశంలో వ్యాక్సిన్​ మొదలయ్యేది కాదు. ఇదే పరిస్థితి ఉంటే.. కరోనా వ్యాక్సిన్​ మనకు అందుబాటులోకి రావడానికి ఇంకో 40 ఏండ్లు పట్టేది”అని మోడీ అన్నారు. పిల్లలకు రెగ్యులర్​గా వేసే టీకాల విషయంలో ‘మిషన్​ ఇంద్రధనస్సు’ పథకాన్ని తీసుకొచ్చామని, దేశంలో యుద్ధప్రాతిపదికన వ్యాక్సిన్​లు తయారు చేసేలా ప్రోత్సహించామని చెప్పారు. 2014 వరకు దేశంలో వ్యాక్సినేషన్​ కవరేజ్​ 60 శాతంగా ఉంటే ఐదారేండ్లల్లో అది 90 శాతానికి పెరిగిందని వివరించారు. 
పిల్లలపై వ్యాక్సిన్​ ట్రయల్స్​
కరోనా వ్యాక్సిన్​ పిల్లలకు ఇచ్చే విషయంలోనూ పరిశోధనలు జరుగుతున్నాయని మోడీ చెప్పారు. పిల్లలపై రెండు రకాల టీకాల ట్రయల్స్​ నడుస్తున్నాయన్నారు. ముక్కుద్వారా వేసే ‘నాజల్​స్పే వ్యాక్సిన్​’పై కూడా రీసెర్చ్​ వేగంగా జరుగుతోందని, అది ఫలిస్తే వ్యాక్సినేషన్​ మరింత సులభమవుతుందని చెప్పారు. 
అందుకే ఫ్రంట్​లైన్​ వర్కర్స్​కు ముందుగా ఇచ్చాం
జనవరి 16 నుంచి  ఏప్రిల్​ చివరి వరకు కేంద్రం వ్యాక్సినేషన్​ చేపట్టిందని, ముందుగా హెల్త్​ వర్కర్స్​, ఫ్రంట్​లైన్​ వర్కర్స్​, ఇలా ప్రయార్టీని బట్టి టీకాలు ఇవ్వడం మొదలుపెట్టిందన్నారు. కరోనాపై పోరులో ముందు వరుసలో ఉన్న డాక్టర్లు, నర్సులు, సఫాయి కార్మికులు ముందుగా వ్యాక్సిన్​ ఇవ్వడంతోనే వారు అందరి ప్రాణాలను కాపాడగలుగుతున్నారని చెప్పారు. 
ఏజ్​ గ్రూప్​ ఎందుకంటున్నరు?
వ్యాక్సినేషన్​ విషయంలో రాష్ట్రాలు చేస్తున్న విమర్శలను ప్రధాని మోడీ తప్పుబట్టారు. అయినా వారి సలహాలను, సూచనలను స్వీకరిస్తూ ముందుకు వెళ్తున్నామని చెప్పారు. ‘‘వ్యాక్సినేషన్​ను డీ సెంట్రలైజ్​ చేయాలంటున్నరు. వ్యాక్సిన్​ కొరతపై ప్రశ్నిస్తున్నరు. ఏజ్​ గ్రూప్​ ఎందుకు పెట్టారని నిలదీస్తున్నరు.  రాష్ట్రాలకు ఎందుకు అధికారం ఇవ్వడం లేదంటున్నరు. ఫ్రంట్​లైన్​ వర్కర్స్​తోపాటు ముందుగా వృద్ధులకే ఎందుకు వేస్తున్నారు అని ప్రశ్నిస్తున్నరు. ఒక వర్గం మీడియా అదే పనిగా ఈ విషయాలపై క్యాంపెయిన్​ నడిపించింది. కానీ.. వ్యాక్సిన్​ ఉత్పత్తిని బట్టి, ప్రయారిటీని బట్టి నిర్ణయాలు తీసుకున్నం. వ్యాక్సిన్​ ఉత్పత్తి అనేది చాలా కష్టతరమైనపని. అయినా వేగంగా ఉత్పత్తి చేసేందుకు కంపెనీలకు ప్రోత్సాహం అందిస్తున్నం” అని ఆయన తెలిపారు. 
రాష్ట్రాలపై భారం పడదు
వ్యాక్సిన్​ కోసం రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టాల్సిన పనిలేదని, కేంద్రమే టీకా డోసులను సరఫరా చేస్తుందని ప్రధాని వెల్లడించారు. ‘‘ఉత్ప త్తవుతున్న వ్యాక్సిన్​లో ఇప్పటివరకు కేంద్రం 50 శాతం కొని సరఫరా చేస్తోంది. రాష్ట్రాలు కొనాల్సిన 25 శాతం వ్యాక్సిన్​ను కూడా ఇక నుంచి కేంద్రమే ఇస్తుంది. టీకాల భారం నుంచి రాష్ట్రాలను తప్పిస్తున్నాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చర్చించి, రెండు వారాల్లో దీనిపై కొత్త  గైడ్​లైన్స్​ విడుదల చేస్తాయి. మొత్తంగా 75 శాతం వ్యాక్సిన్​ను కేంద్రమే కొని రాష్ట్రాలకు సరఫరా చేస్తుంది. దేశంలోని అందరికీ ఫ్రీగా వ్యాక్సిన్​ వేస్తారు” అని ప్రకటించారు. 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ  ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం నుంచి ఉచితంగా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని చెప్పారు. ‘‘ ఉత్పత్తయ్యే దానిలో  25 శాతం వ్యాక్సిన్​ను ప్రైవేటు హాస్పిటళ్లు కొనుగోలు చేసుకోవచ్చు. ప్రైవేటు హాస్పిటళ్లు ఒక్కో డోసుకు రూ.  150 మాత్రమే సర్వీస్​ చార్జ్​ తీసుకోవాలి” అని మోడీ స్పష్టంచేశారు.