ప్రతిపక్షాలకు ప్రజల బాధ పట్టదు : మోదీ

ప్రతిపక్షాలకు ప్రజల బాధ పట్టదు : మోదీ
  • ప్రతిపక్షాలు పారిపోయినయ్​
  • మణిపూర్​పై పార్లమెంట్​లో వారు చర్చను కోరుకోలేదు: మోదీ
  • ప్రతిపక్ష నేతలకు కావాల్సింది రాజకీయాలేనని విమర్శ
  • వాళ్లు మణిపూర్ ప్రజలకు ద్రోహం చేశారన్న ప్రధాని
  • అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్​కు భయపడి వాకౌట్ చేశారని వ్యాఖ్య

కోలాఘాట్(పశ్చిమ బెంగాల్):  మణిపూర్ అంశంపై ప్రతిపక్షాలు చర్చను కోరుకోలేదని, దానిపై రాజకీయం చేయాలని అనుకున్నాయని ప్రధాని మోదీ మండిపడ్డారు. ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానంపై చర్చలో పాల్గొనకుండా పార్లమెంట్ నుంచి పారిపోయాయని విమర్శించారు. శనివారం పశ్చిమ బెంగాల్ లో జరిగిన బీజేపీ క్షేత్రియ పంచాయతీరాజ్ పరిషత్ మీటింగ్ లో మోదీ వర్చువల్ గా మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై, బెంగాల్ లోని తృణమూల్ సర్కార్ పై ఆయన విమర్శలు చేశారు. ‘‘ పార్లమెంట్​లో ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని రెండ్రోజుల కింద మేం ఓడించాం. అలాగే వాళ్లు వ్యాప్తి చేస్తున్న విష ప్రచారాన్ని కూడా ఓడించాం. నిజమేమిటంటే.. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ కు ప్రతిపక్షాలు భయపడ్డాయి. వాళ్లకు ఓటింగ్ జరగడం ఇష్టం లేదు. ఓటింగ్ జరిగితే వాళ్ల కూటమిలో చీలికలు బయటపడతాయని భయం. అందుకే వాళ్లు పార్లమెంట్ నుంచి పారిపోయారు” అని విమర్శించారు. 

ప్రతిపక్షాలకు ప్రజల బాధ పట్టదు..

పార్లమెంట్ లో ప్రతిపక్షాలు వ్యవహరించిన తీరును దేశ ప్రజలందరూ చూశారని మోదీ అన్నారు. ‘‘మణిపూర్ అంశంపై ప్రతిపక్షాలకు సీరియస్ నెస్ లేదు. వాళ్లు కేవలం దానిపై రాజకీయం చేయాలని అనుకున్నారు. పార్లమెంట్ సెషన్ ప్రారంభానికి ముందే మణిపూర్ అంశంపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పాం. కానీ పార్లమెంట్ లో ఏం జరిగిందో మీరందరూ చూశారు కదా.. ప్రతిపక్షాలు అడుగడుగునా సభను అడ్డుకున్నాయి. చర్చ జరగకుండా చేశాయి. చివరకు సభ నుంచి వాకౌట్ చేసి, మణిపూర్ ప్రజలను మోసం చేశాయి’’ అని ఫైర్ అయ్యారు.

 ‘‘ప్రతిపక్షాలకు ప్రజల బాధ పట్టదు. వాళ్లకు కావాల్సిందల్లా రాజకీయాలు మాత్రమే. అందుకే చర్చను కాదని అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి” అని మండిపడ్డారు. ప్రతిపక్షాలు ముసుగు వేసుకుని ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నాయని, ఆ ముసుగు తొలగించి ప్రతిపక్షాల అసలు రూపాన్ని ప్రజల ముందుంచాలని బీజేపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. 

తృణమూల్ సర్కార్ పై ఫైర్.. 

పశ్చిమ బెంగాల్ లో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ రక్తపాతం సృష్టించిందని మోదీ ఆరోపించారు. ‘‘టీఎంసీ గూండాలు ప్రతిపక్ష నేతలను, ప్రజలను భయపెట్టారు. అయినప్పటికీ బీజేపీ అభ్యర్థులను జనం ఆశీర్వదించారు. గెలిచిన బీజేపీ అభ్యర్థులు విజయోత్సవ ర్యాలీలు తీసేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. అయినా కొంతమంది ర్యాలీలు తీస్తే దాడి చేశారు” అని మండిపడ్డారు. తమకు తాము ప్రజాస్వామ్యవాదులుగా చెప్పుకుంటున్న కొందరు.. ఈవీఎంలను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారని మమతా బెనర్జీని ఉద్దేశించి కామెంట్ చేశారు.

సంత్ రవిదాస్ ఆలయానికి శంకుస్థాపన..  

ప్రధాని మోదీ మధ్యప్రదేశ్ పర్యటనకు వెళ్లారు. శనివారం సాగర్ జిల్లా బద్ తుమాలో ఆధ్యాత్మిక కవి, సంఘ సంస్కర్త సంత్ రవిదాస్ ఆలయ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ మంగూభాయ్ పటేల్, సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్రమంత్రి వీరేంద్ర కుమార్ పాల్గొన్నారు. ఈ ఆలయాన్ని 11 ఎకరాల్లో రూ.100 కోట్ల ఖర్చుతో నిర్మిస్తున్నారు. ఇక్కడ  మ్యూజియం, ఆర్ట్ గ్యాలరీ తదితర ఏర్పాట్లు చేస్తున్నారు.