ఇలాంటి మహమ్మారిని వందేండ్లలో చూడలె

ఇలాంటి మహమ్మారిని వందేండ్లలో చూడలె
  • బుద్ధపూర్ణిమ వేడుకల్లో ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: ప్రజల ప్రాణాలను కాపాడడానికి, కరోనాపై విజయం సాధించడానికి టీకాలే కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. బుద్ధపూర్ణిమ సందర్భంగా బుధవారం వర్చువల్ గా నిర్వహించిన ‘వెసాక్ గ్లోబల్ సెలబ్రేషన్స్’లో ఆయన మాట్లాడారు. జీవితకాలంలో ఒకసారి వచ్చే ఈ సంక్షోభం ఎంతో విషాదాన్ని మిగిల్చిందని, ఎకానమీపై తీవ్ర ప్రభావాన్ని చూపిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచం ఘోరమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, గత వందేండ్లలో ఇలాంటి మహమ్మారిని చూడలేదన్నారు. కరోనా ప్రభావం అన్ని దేశాలపైనా పడిందని, ఈ మహమ్మారి తర్వాత ప్రపంచమంతా మారిపోతుందని.. భవిష్యత్తులో కరోనాకు ముందు, కరోనాకు తర్వాత అని చెప్పుకోవాల్సి ఉంటుందన్నారు. మన శాస్త్రవేత్తలు ఎంతో కష్టపడి కేవలం ఏడాది లోపే వ్యాక్సిన్లను తయారు చేశారని, అందుకు దేశం గర్వపడుతోందన్నారు. హెల్త్ కేర్, ఫ్రంట్ లైన్ వర్కర్లు ప్రాణాలను పణంగా పెట్టి కరోనాపై పోరాడుతున్నారని కొనియాడారు. వారందరికీ సెల్యూట్ చేస్తున్నానన్నారు. కరోనా కారణంగా ఆప్తులను కోల్పోయిన వారందరికీ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కష్ట కాలంలో ఎన్నో డెవలప్ మెంట్స్ చోటు చేసుకున్నాయని, అవన్నీ కరోనాపై పోరులో మన సామర్థ్యాన్ని పెంచాయన్నారు. నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి, శ్రీలంక ప్రధాని మహీందా రాజపక్స ఈ వర్చువల్ ఈవెంట్ లో పాల్గొన్నారు

టెర్రరిజంపై పోరాడుదాం.. 
క్లైమేట్ ఛేంజ్, టెర్రరిజం సమస్యలను ప్రధాని ఈ సందర్భంగా ప్రస్తావించారు. కరోనాపై పోరులో పడి, ఇతర సమస్యలను మర్చిపోవద్దని సూచించారు. టెర్రరిజం, రాడికలిజంపై పోరాడేందుకు కలిసి రావాలని పిలుపునిచ్చారు. ప్రస్తుత జనరేషన్ జీవన విధానంతో భవిష్యత్ తరాలకు ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మన గ్రహాన్ని గాయపరచొద్దని విజ్ఞప్తి చేశారు. గౌతమ బుద్ధుడి ఆదర్శాలను మోడీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. వాటిని ఆచరించాల్సిన అవసరం ఉందన్నారు.