- తన ప్రభుత్వానికి12 ఏండ్లు పూర్తయిన సందర్భంగా ఎన్డీయే నేతలతో ఢిల్లీలో సమావేశం
- సామాన్యుడి ఆశలకు ఎన్డీయే పాలన అద్దం పట్టిందని వ్యాఖ్య
- ఆర్టికల్ 370 నుంచి ఆపరేషన్ సిందూర్ వరకు గట్టి నిర్ణయాలు తీసుకున్నట్లు వివరణ
న్యూఢిల్లీ: మన దేశం నెమ్మదిగా అభివృద్ధి చెందడానికి కాంగ్రెస్ పార్టీయే ప్రధాన కారణమని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. గత కాంగ్రెస్ పాలనలో ధైర్యమైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం, అవినీతి పెరగడం వంటి పలు కారణాల వల్లే అభివృద్ధి నత్తనడకన సాగిందని విమర్శించారు. కాంగ్రెస్ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి దేశ అభివృద్ధికి 'హిందూ వృద్ధి రేటు' అని పేరు పెట్టి తన చేతగానితనాన్ని ఒప్పుకోలేక నిందను దేశంలోని మెజారిటీ ప్రజల మీదకు నెట్టేసిందని మండిపడ్డారు. ఏండ్ల తరబడి అనుసరించిన తప్పుడు విధానాలు, పాలనా వైఫల్యాలతో కాంగ్రెస్ ప్రభుత్వాలు మన దేశాన్ని నిస్సహాయత, అభద్రతా భావం అనే అగాధంలోకి నెట్టాయని ఆవేదన వ్యక్తం చేశారు.
బుధవారం ఎన్డీయే ప్రభుత్వం 12 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఢిల్లీలోని భారత్ మండపంలో ఎన్డీయే నేతల సమావేశం జరిగింది. మోదీ నాయకత్వాన్ని, ఆయన పనితీరును అభినందిస్తూ ఎన్డీయే సభ్యులు ఓ తీర్మానాన్ని ఆమోదించారు. ఈ సందర్భంగా ఎన్డీయే సభ్యులను ఉద్దేశించి ప్రధాని మాట్లాడుతూ.. ఎన్డీయే ప్రభుత్వం సాధించిన విజయాల్లో ఒకటి కాంగ్రెస్ పాలన నుంచి దేశాన్ని విముక్తి చేయడమేనని అన్నారు. " ప్రభుత్వం కాంగ్రెస్‌ది.. బాధ్యత కాంగ్రెస్‌ది, వైఫల్యం కూడా కాంగ్రెస్‌దే. కానీ నిందను మాత్రం దేశంలోని హిందూ జనాభాపై వేశారు. నిజానికి, ఈ చెడు సంస్కృతిని 'కాంగ్రెస్ వృద్ధి రేటు' అని పిలవాలి" అని పేర్కొన్నారు.
రాజకీయాల కంటే దేశమే ఫస్ట్
గత 12 ఏండ్ల ఎన్డీయే పాలనలో 25 కోట్ల ప్రజలు పేదరికం నుంచి బయటపడటం తమ ప్రభుత్వ విధానాలు సరైన దిశలో ఉన్నాయని నిరూపిస్తోందని మోదీ వెల్లడించారు. సెమీకండక్టర్ల నుంచి క్రిటికల్ మినరల్స్ వరకు, ఏఐ నుంచి క్వాంటం కంప్యూటింగ్ వరకు కీలక రంగాల్లో దేశం స్వయం సమృద్ధిని సాధిస్తోందని, అలాగే, జాతీయ భద్రత..ఆర్థిక సంస్కరణలపై కీలక నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పారు."ఎనర్జీ, ఖనిజాలు, చిప్స్, బ్యాటరీ స్టోరేజ్, స్పేస్, డ్రోన్లు, డేటా సెంటర్లు, క్వాంటం కంప్యూటింగ్, ఏఐ అన్నీ ఒకదానికొకటి అనుసంధానించబడిన సాంకేతికతలు. ఇవి మన ఆర్థిక, వ్యూహాత్మక భద్రతకు ముడిపడి ఉన్నందున, ఈ రంగాల్లో దేశం విదేశాలపై ఆధారపడి ఉండకూడదు" అని తెలిపారు. రాజకీయల కంటే దేశమే గొప్పదని.. 'నేషన్ ఫస్ట్' స్ఫూర్తితో పనిచేస్తున్నామని మోదీ పేర్కొన్నారు.
ఇప్పటిదాకా సాధించిన విజయాలివే..
ఆర్టికల్ 370ని రద్దు చేయడం, ఈశాన్య రాష్ట్రాల్లో శాంతి ఒప్పందాలు, ఉగ్రవాదంపై దేశ ప్రతిస్పందనను ప్రధాని గుర్తుచేశారు. "గత ప్రభుత్వాలు ఆర్టికల్ 370 గురించి చర్చించడానికి కూడా సంకోచించేవి. మేం ఆర్టికల్ 370ని తొలగించి, దేశవ్యాప్తంగా రాజ్యాంగాన్ని ఏకరీతిగా అమలు చేశాం. గతంలో ఈశాన్య ప్రాంతంలో శాంతిని, స్థిరత్వాన్ని పునరుద్ధరించాము" అని వివరించారు."గతంలో, దేశం ఉగ్రవాద దాడులను మౌనంగా భరించేది. ఇప్పుడు, ఉగ్రవాదులపై సర్జికల్ స్ట్రైక్స్, ఎయిర్‌స్ట్రైక్స్, ఆపరేషన్ సిందూర్ తో ప్రతిస్పందించాం" అని చెప్పారు.
