వాళ్లు మళ్లీ ప్రతిపక్షంలోనే.. ప్రధాని ఫైర్​

వాళ్లు మళ్లీ ప్రతిపక్షంలోనే.. ప్రధాని ఫైర్​

న్యూఢిల్లీ: వచ్చే లోక్​సభ ఎన్నికల తర్వాత పార్లమెంటులో ప్రతిపక్షాల సభ్యుల సంఖ్య మరింత తగ్గుతుందని, వాళ్లంతా ప్రతిపక్షంగానే మిగిలిపోతారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పార్లమెంటులో సెక్యూరిటీ బ్రీచ్​పై అపోజిషన్ పార్టీల మెంబర్లు  ప్రవర్తిస్తున్న తీరే అందుకు నిదర్శనమన్నారు. సెక్యూరిటీ ఉల్లంఘించి, సభలోకి చొరబడినోళ్లకు పరోక్షంగా మద్దతు ఇస్తున్నారని మోదీ మండిపడ్డారు. ఈ మధ్య జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో వాళ్లంతా నిరాశ చెందారని, ఆ ఫ్రస్ట్రేషన్​తోనే పార్లమెంటు ఉభయ సభల్లో గందరగోళం సృష్టిస్తున్నారని ఫైర్ అయ్యారు. మంగళవారం ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని మాట్లాడారు. 

ప్రభుత్వాన్ని పడగొట్టాలన్నదే వాళ్ల టార్గెట్

కాంగ్రెస్ కూటమి నేతలు బీజేపీని గద్దె దించడమే టార్గెట్​గా పనిచేస్తున్నారని, తాము మాత్రం దేశ నిర్మాణం లక్ష్యంగా ముందుకెళ్తున్నామని మోదీ చెప్పారు. ‘‘మమ్మల్ని పడగొట్టేందుకే కొందరు ఏకమవుతున్నారు. వాళ్లు తమ శక్తినంతా ప్రభుత్వాన్ని ఎలా పడగొడదామా అని ఆలోచించేందుకే కేటాయిస్తున్నారు. మేము మాత్రం దేశ ఉజ్వల భవిష్యత్, అభివృద్ధి కోసం మా బలాన్ని ఉపయోగిస్తాం. ప్రతిపక్షాల సభ్యులను ప్రతిపక్షంలోనే ఉంచాలని దేశ ప్రజలు కూడా కోరుకుంటున్నారు. 2024 లోక్​సభ ఎన్నికల తర్వాత పార్లమెంటులో బీజేపీ సభ్యుల సంఖ్య మరింత పెరుగుతుంది”అని మోదీ అన్నారు. 

రాబోయే రోజుల్లో కీలక బిల్లులు చర్చకు వస్తాయని, బీజేపీ ఎంపీలు తప్పనిసరిగా సమావేశాలకు హాజరుకావాలని ప్రధాని సూచించారు. ప్రజాస్వామ్య నిబంధనలను పాటించాలని కోరారు. 2024లో తొలిసారి ఓటు వేయబోతున్న యువత బీజేపీ హయాంలో జరుగుతున్న అభివృద్ధిని మాత్రమే చూసిందని, పదేండ్ల కిందటిదాకా కాంగ్రెస్ చేసిన మోసాల యుగం గురించి వారికి తెలియకపోవచ్చని మోదీ అన్నారు. వారికి దీనిపై అవగాహన కల్పించాలని బీజేపీ నేతలకు ఆయన సూచించారు.