తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల పేరుతో దోపిడి.. రైతు పథకాల పేరుతో అక్రమ సంపాదన: మోదీ

తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల పేరుతో దోపిడి.. రైతు పథకాల పేరుతో అక్రమ సంపాదన: మోదీ

తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం పేరుతో దోపిడి జరుగుతోందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఎన్నికల కోసం ఆర్భాటంగా ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నారని విమర్శించారు. వేల కోట్లతో ప్రాజెక్టులు,  సాగునీటి కాల్వలు నిర్మించామని చెప్పుకుంటున్నారని..కానీ ఏ ఒక్క కాల్వల్లో  చుక్క నీరు కూడా పారడం లేదన్నారు. 
 
కేసీఆర్ సర్కారు రైతు పథకాల పేరుతో అక్రమంగా సంపాదిస్తోందన్నారు ప్రధాని మోదీ. రైతుల రుణమాఫీ చేస్తామని  అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్..ఆ తర్వాత హామీని నెరవేర్చలేదన్నారు.  ఓట్లు దండుకుని రాజకీయంగా లబ్దిపొందారని విమర్శించారు.  ఎన్నికల కోసం ఇప్పుడు రుణమాఫీ చేస్తున్నారని మండిపడ్డారు. కానీ కేంద్ర ప్రభుత్వం అన్నదాతలను గౌరవిస్తోందని చెప్పారు. వారి కష్టానికి తగిన ప్రతిఫలం అందిస్తున్నామని చెప్పారు. తెలంగాణ రైతులకు ఎంఎస్పీ ధరల ద్వారా ఏటా రూ. 27000 కోట్లు అందజేస్తున్నట్లు తెలిపారు. గతంతో పోలిస్తే ఇది 8 రెట్లు ఎక్కువ అని వెల్లడించారు. అంతేకాకుండా ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ఏటా తెలంగాణ రైతులకు రూ. 10 వేల కోట్లు వారి ఖాతాల్లో జమ చేస్తున్నామని చెప్పారు.  ప్రపంచంలో అతిపెద్ద పసుపు ఉత్పత్తి దారుగా భారతదేశం ఉందన్నారు.  పసుపు ఎగుమతి రెట్టి్ంపు అయ్యిందని...అందుకే పసుపు రైతులకు తగిన ప్రతిఫలం అందివ్వబోతున్నామని చెప్పారు. త్వరలో పసుపు బోర్డు ఏర్పాటు చేయబోతున్నామని వెల్లడించారు.  పసుపు బోర్డు ఏర్పాటుతో తెలంగాణ రైతులకు మేలు జరుగుతుందని చెప్పారు. 

తెలంగాణలో ప్రజల బతుకులు బాగుపడేందుకు బీజేపీ కృషి చేస్తోందన్నారు ప్రధాని మోదీ. 2014కు పూర్వం రాష్ట్రంలో  2500 కిలో మీటర్ల జాతీయ రహదారులు నిర్మిస్తే..ఆ తర్వాత బీజేపీ ప్రభుత్వం కేవలం 9 ఏండ్లలో 2500 కిలో మీటర్లకు పైగా జాతీయ రహదారులను నిర్మించామన్నారు.  తెలంగాణలో ప్రతీ పల్లె నుంచి పట్నానికి వచ్చే వరకు రోడ్లు వేశామని చెప్పారు. 

Also Read :- బీఆర్ఎస్ , కాంగ్రెస్లకు ఈ రాత్రి నిద్ర పట్టదు

తెలంగాణ ప్రజలు  మార్పు కోరుకుంటున్నారని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు.  తెలంగాణలో అవినీతి రహిత ప్రభుత్వం రావాలి. తప్పుడు వాగ్దానాలతో..మభ్యపెట్టే మాటలు చెప్పే ప్రభుత్వం కాకుండా తెలంగాణ అభివృద్ధి చేసే ప్రభుత్వం రావాలని ప్రజలు అనుకుంటున్నారని చెప్పారు.  అదే బీజేపీ ప్రభుత్వం రావాలని  ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. 

తెలంగాణలో రూ. 13500 కోట్లతో పలు అభివృద్ధికి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దీని వల్ల తెలంగాణలో ఎంతో మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయని చెప్పారు. రాణి రుద్రమ దేవి వంటి ధీర వనితలు పుట్టిన గడ్డ తెలంగాణ అని కొనియాడారు. కొద్ది రోజుల క్రితమే..పార్లమెంట్ లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును ఆమోదించుకున్నామని చెప్పారు. చట్టసభల్లో రాబోయే రోజుల్లో మహిళల భాగస్వామ్యం పెరుగుతుందని సంతోషం వ్యక్తం చేశారు. దేశ వ్యాప్తంగా మహిళల ఆత్మగౌరవంతో ముడిపడి ఉన్న సౌచాలయాల నిర్మాణం, ముద్ర లోన్లు, ఆవాస్ యోజన కింద రుణాలు మంజూరు చేశామని గుర్తు చేశారు.