సత్యసాయి జీవితం వసుధైక కుటుంబం భగవాన్‌‌‌‌  ప్రేమ, సేవ కోట్ల మందిని ప్రభావితం చేసింది: ప్రధాని మోదీ

సత్యసాయి జీవితం వసుధైక కుటుంబం భగవాన్‌‌‌‌  ప్రేమ, సేవ కోట్ల మందిని ప్రభావితం చేసింది: ప్రధాని మోదీ
  • పుట్టపర్తి ఓ ఆధ్యాత్మిక భూమి..‘లవ్ ఆల్.. సర్వ్ ఆల్’ అని సాయి బోధించేవారు
  • దేశంలో ఎక్కడ ప్రకృతి వైపరీత్యం వచ్చినా సేవాదళ్ సభ్యులు ముందుంటారని వెల్లడి
  • సత్యసాయి శత జయంతి ఉత్సవాలకు హాజరు
  • రూ. 100 నాణెం, పోస్టల్ స్టాంప్‌‌‌‌లు రిలీజ్ చేసిన ప్రధాని
  • అటెండ్ అయిన సీఎం చంద్రబాబు, క్రికెటర్‌‌‌‌‌‌‌‌ సచిన్, నటి ఐశ్వర్యరాయ్

హైదరాబాద్ ,వెలుగు: సత్యసాయి బాబా పాటించిన ప్రేమ, సేవా భావన ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మందిని ప్రభావితం చేసిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.  ఆయన జీవితమే వసుధైక కుటుంబం అనే భావనతో సాగిందన్నారు. సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాలు జరుపుకోవడం ఓ వరమని పేర్కొన్నారు. బుధవారం ఏపీలోని పుట్టపర్తి హిల్‌‌‌‌‌‌‌‌వ్యూ స్టేడియంలో నిర్వహించిన సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాల్లో   ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.  అంతకుముందు  సాయి కుల్వంత్‌‌‌‌‌‌‌‌ హాల్‌‌‌‌‌‌‌‌లో బాబా  మహా సమాధిని దర్శించుకొని, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.  

ప్రధాని మోదీకి ఆలయ పూజారులు వేద ఆశీస్సులు ఇచ్చారు.  సత్యసాయి జీవితం, బోధనలు, సేవల స్మారకార్థంగా రూపొందించిన రూ.100 నాణెం, 4 తపాలా బిళ్లలను ప్రధాని మోదీ ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్,  కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, కిషన్‌‌‌‌‌‌‌‌రెడ్డి, శ్రీనివాసవర్మ, ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్,  మాజీ మిస్ వరల్డ్ ఐశ్వర్యారాయ్  బచ్చన్, సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ రత్నాకర్ పాల్గొన్నారు.  

ఈ సందర్భంగా  మోదీ మాట్లాడుతూ.. మన భారతీయుల జీవన విధానమే సేవ, భక్తి, జ్ఞానం అని, వీటన్నింటినీ సాయిబాబా బోధించారని చెప్పారు.  సేవా పరమో ధర్మః అనేవి మన మూల జీవన విధానంలోనే ఉన్నాయని, ‘లవ్ ఆల్.. సర్వ్ ఆల్’ అని బోధించారని, వీటిని ఆయనతోపాటు ఆయన సంస్థలూ  పాటిస్తూ వస్తున్నాయని తెలిపారు.

బాబా ప్రేమ మనోతోనే ఉన్నది..

పుట్టపర్తి ఆధ్యాత్మిక భూమి అని, సత్యసాయి భౌతికంగా మనతో లేకున్నా.. ఆయన ప్రేమ మనతోనే ఉందన్నారు. ఎన్నో కోట్ల మందికి బాబా మార్గదర్శనం చేశారని గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా ఎక్కడ ప్రకృతి వైపరీత్యం వచ్చినా  సత్యసాయి సేవా దళ్ సభ్యులు ప్రజలకు సేవలందిస్తున్నారని తెలిపారు. భుజ్ భూకంపం సమయంలో సేవాదళ్ చేసిన సేవలు తనకు బాగా గుర్తున్నాయని చెప్పారు.  3 వేలకు కిలోమీటర్లకు పైగా తాగునీటి పైపుల్ని వేసి..  ప్రజల దాహార్తి తీర్చారని చెప్పారు. 

బాబా నిర్మించిన హాస్పిటల్స్‌‌‌‌‌‌‌‌లో వైద్యం ఉచితంగా అందిస్తున్నారని, సుకన్య సమృద్ధి యోజన కోసం వేల మంది బాలికలకు ట్రస్ట్ ఆర్థికి సాయం చేస్తున్నదని చెప్పారు. వంద గిర్ జాతి గోవులను  సత్యసాయి ట్రస్టు.. పేదవారికి తన చేతుల మీదుగా అందించడం సంతోషంగా ఉన్నదని అన్నారు.  రాష్ట్రీయ గోకుల్ మిషన్‌‌‌‌‌‌‌‌లో భాగంగా వారణాసిలో 480కి పైగా గిర్ జాతి ఆవులను పేదవారికి అందించానని చెప్పారు.   భగవాన్ సత్యసాయి ప్రేరణతో అంతా కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు.   

మనం చూసిన దైవ స్వరూపం సత్యసాయి: ఏపీ సీఎం చంద్రబాబు

ఈ భూమిపై మనకు తెలిసిన, మనం చూసిన దైవ స్వరూపం భగవాన్  సత్యసాయి బాబా అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.  ప్రేమ, సేవ, ప్రశాంతత, పరిష్కారానికి బాబా ప్రతిరూపం అని పేర్కొన్నారు. సత్యసాయి బాబాకు సమ్మోహన శక్తి ఉందని, ఎంతో మంది నాస్తికులను ఆధ్యాత్మికత వైపునకు మళ్లించారని గుర్తు చేశారు. 

కన్ఫ్యూజన్‌‌‌‌‌‌‌‌లో ఉన్నప్పుడు మార్గం చూపారు: సచిన్‌‌‌‌‌‌‌‌ 

పుట్టపర్తి అనేది లక్షల మందికి స్ఫూర్తినిచ్చే ప్రాంతమని క్రికెటర్ సచిన్ టెండూల్కర్ అన్నారు. సత్యసాయి నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని చెప్పారు, చిన్నప్పుడు తన హెయిర్‌‌‌‌‌‌‌‌స్టైల్ చూసి  చిన్న సత్యసాయి అని పిలిచేవారని గుర్తుచేసుకున్నారు. 1997 నుంచి సత్యసాయితో అనుబంధం ఉందని తెలిపారు.  ఎన్నోసార్లు పుట్టపర్తికి వచ్చి బాబా ఆశీర్వాదం తీసుకున్నానని, కన్ఫ్యూజన్‌‌‌‌‌‌‌‌లో ఉన్నప్పుడు తనకు బాబా సరైన మార్గం చూపారన్నారు.  2011లో  లాస్ట్ వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌ ఆడే సమయంలో బాబా  ఫోన్‌‌‌‌‌‌‌‌చేసి ధైర్యం చెప్పారని గుర్తు చేసుకున్నారు.