బుజ్జగింపు రాజకీయాలకు అభివృద్ధితో చెక్

బుజ్జగింపు రాజకీయాలకు అభివృద్ధితో చెక్

ఆజమ్ గఢ్: ఉత్తరప్రదేశ్ లో అభివృద్ధి కొత్త శిఖరాలకు చేరుకున్నదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రాష్ట్రంలో తాము చేస్తున్న అభివృద్ధి పనుల వల్లే విషం లాంటి బుజ్జగింపుల రాజకీయం బలహీనపడిందన్నారు. కుటుంబ, బంధుప్రీతి రాజకీయాలు చేసేవాళ్లు అభివృద్ధిని ఓర్వలేక ఫ్రస్ట్రేషన్ తోనే తనను తిడుతున్నారని విమర్శించారు. ఆదివారం యూపీ సహా పలు రాష్ట్రాల్లో రూ.42 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు, అభివృద్ధి పనులకు మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం యూపీలోని ఆజమ్ గఢ్ లో జరిగిన ర్యాలీలో ఆయన మాట్లాడారు. గతంలో ఆజమ్ గఢ్ చాలా వెనుకబడి ఉండేదని, కానీ ఇప్పుడు అభివృద్ధిలో దూసుకెళ్తోందన్నారు. 

ఆజమ్ గఢ్ ను సమాజ్ వాదీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, దివంగత ములాయం సింగ్ యాదవ్ లు తమ జాగీరుగా భావించేవారని, నియోజకవర్గమంతా వాళ్ల కుటుంబ, బంధుప్రీతి రాజకీయాలే నడిచేవన్నారు. కానీ ఇప్పుడు బీజేపీ యువ నేత దినేశ్ లాల్ యాదవ్ ఇక్కడ కుటుంబ రాజకీయాలను ఓడించాడన్నారు. ‘‘అభివృద్ధిని ఓర్వలేకనే కుటుంబవాద నేతలు ఫ్రస్ట్రేషన్ తో మోదీని తిడుతున్నారు. నాకు కుటుంబమే లేదని అంటున్నరు. కానీ దేశంలోని 140 కోట్ల మంది ప్రజలే మోదీ కుటుంబం అన్న విషయం వాళ్లు మరిచిపోతున్నరు” అని ప్రధాని మరోసారి స్పష్టం చేశారు. 

ఎన్నికలతో ముడిపెట్టొద్దు.. 

ఇప్పుడు తాను ప్రారంభిస్తున్న, శంకుస్థాపనలు చేస్తున్న ప్రాజెక్టులను ఎన్నికలతో ముడిపెట్టొద్దని ప్రధాని కోరారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్ ను సాధించే లక్ష్యంతోనే ఈ ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నానని చెప్పారు. అభివృద్ధి చెందిన భారత్ కలను సాకారం చేయడం కోసమే తాను ఇలా పరుగులు పెడుతున్నానని తెలిపారు. ‘‘గత 30 ఏండ్ల కింద అప్పటి ప్రభుత్వాలు చేసిన ప్రకటనలను నేను సమీక్షించాను. అప్పటి ప్రభుత్వాలు ఎన్నికలకు ముందు శంకుస్థాపనలు చేసి, ఆ తర్వాత వాటిని మరిచిపోయాయి. కానీ మోదీ వారికి భిన్నమైన నాయకుడని నేడు దేశం గ్రహిస్తోంది” అని ఆయన అన్నారు. దేశంలో 30 ఏండ్ల క్రితమే అర్బనైజేషన్ కు ప్రణాళికలు వేయాల్సి ఉన్నా.. అప్పటి ప్రభుత్వాలు ఆ పని చేయలేదని మోదీ విమర్శించారు. అందుకే నేడు అర్బనైజేషన్ ను ఒక అవకాశంగా మలచుకునేందుకు తాను పని చేస్తున్నానని చెప్పారు. ప్రభుత్వాలు మంచి ఉద్దేశాలతో, నిజాయతీగా పని చేసినప్పుడే ఇంత స్పీడ్ గా అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. అవినీతిలో కూరుకుపోయే కుటుంబ పార్టీల పాలనతో ఇంత భారీ స్థాయిలో అభివృద్ధి సాధ్యమయ్యేది కాదన్నారు.

3 కోట్ల మహిళలను లక్షాధికారులను చేస్తం..

దేశవ్యాప్తంగా 3 కోట్ల మంది మహిళలను ‘లఖ్ పతి దీదీ’లుగా మార్చడమే కేంద్రం లక్ష్యమని ప్రధాని మోదీ చెప్పారు. చత్తీస్​గఢ్​లో మహతరి వందన్ పథకాన్ని ప్రధాని ఆదివారం వర్చువల్​గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహతరి వందన్ పథకం కింద 70 లక్షల మంది మహిళలకు ప్రతినెలా రూ.1000 ఆర్థిక సాయం చేస్తామన్నారు. స్కీంలో తొలి విడతగా రూ.655 కోట్ల నిధులను ఆదివారమే లబ్ధిదారుల అకౌంట్లలో వేశామన్నారు.

రూ. 42 వేల కోట్ల ప్రాజెక్టులు.. 

ప్రధాని ఆదివారం యూపీతోపాటు పలు రాష్ట్రాల్లో చేపట్టిన రూ. 42 వేల కోట్ల విలువైన అభివృద్ధి పను లు, ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. వీటిలో అత్యధికంగా యూపీలోనే రూ. 34,700 కోట్ల విలువైన పనులు ఉన్నాయి. యూపీలో ఆజమ్ గఢ్, చిత్రకూట్, అలీగఢ్ ఎయిర్ పోర్టులు, లక్నో ఎయిర్ పోర్టులో కొత్త టెర్మినల్ బిల్డింగ్, మహారాజా సుహెల్ దేవ్ యూనివర్సిటీ, 5 నేషనల్ హైవే ప్రాజెక్టులు, 59 జిల్లాల్లో రోడ్లు, 12 రైల్వే ప్రాజెక్టుల వంటివి ప్రధాని ప్రారంభించారు.