రాజ్యసభలో అదానీ రచ్చ.. మోడీ ప్రసంగాన్ని అడ్డుకున్న విపక్షాలు

రాజ్యసభలో అదానీ రచ్చ.. మోడీ ప్రసంగాన్ని అడ్డుకున్న విపక్షాలు

రాజ్యసభలో గందరగోళం నెలకొంది. రాష్ట్రపతి ప్రగంసంపై ధన్యవాద తీర్మానంపై ప్రధాని మోడీ మాట్లాడుతుండగా విపక్షాలు అడ్డుకున్నాయి. అదానీ ఇష్యూపై చర్చకు పట్టుబట్టాయి. వెల్లోకి దూసుకొచ్చి మోడీ, అదానీ భాయి భాయి అంటూ నినాదాలు చేస్తూ సభా కార్యక్రమాలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అదానీ ఇష్యూలో జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.  విపక్ష సభ్యుల నిరసన మధ్యే మోడీ తన ప్రసంగాన్ని కొనసాగించారు.  

ప్రసంగాన్ని అడ్డుకుంటున్న విపక్షాల తీరు దౌర్బాగ్యకరమని పీఎం మోడీ అన్నారు. ప్రతిపక్ష ఎంపీలు ఎంత బురదజల్లితే కమలం అంత వికసిస్తుందని చెప్పారు. ప్రజా సమస్యలపై చర్చ జరగడం విపక్షాలకు ఇష్టంలేదన్న ఆయన.. పరిష్కారం చూపేవాళ్లను అడ్డుకోవడం మంచిపద్దతి కాదని హితవు పలికారు. ఎంత అడ్డుకున్నా సమస్యల పరిష్కారంలో వెనకడుగు వేయమని మోడీ తేల్చి చెప్పారు. గత మూడు నాలుగేళ్లలో కేంద్ర ప్రభుత్వం 11 కోట్ల ఇండ్లకు మంచినీటి కనెక్షన్లు ఇచ్చిన విషయాన్ని మోడీ సభలో ప్రస్తావించారు. గత 9ఏండ్లలో 48 కోట్లు జన్ ధన్ ఖాతాలు ప్రారంభించినట్లు చెప్పారు. కల్బుర్గి వెళ్తే వాస్తవ పరిస్థితులు తెలుస్తాయన్న మల్లిఖార్జున ఖర్గే వ్యాఖ్యలపైనా ప్రధాని స్పందించారు. కర్నాటకలో మొత్తం కోటి 70లక్షల జన్ ధన్ బ్యాంకు ఖాతాలు ఓపెన్ చేస్తే అందులో ఒక్క కల్బుర్గిలోనే 8 లక్షల మంది ఈ అకౌంట్లకు తెరిచారని చెప్పారు. 

4దశాబ్దాలుగా గరీబీ హఠావో నినాదం ఇస్తున్న కాంగ్రెస్ పార్టీ పేదరిక నిర్మూలనకు చేసిందేమీ లేదని మోడీ అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక పేదల ఆశలు, ఆకాంక్షలు పూర్తి చేసేందుకు శ్రమిస్తున్నామని చెప్పారు. సామాన్య ప్రజలే తమ ప్రాధాన్యతన్న పీఎం.. మారుమూల పల్లెలను అభివృద్ధి చేశామని చెప్పారు. దేశంలో 25 కోట్ల కుటుంబాలకు ఎల్పీజీ కనెక్షన్లు ఇచ్చామని, వివక్ష లేకుండా అన్నివర్గాలకు సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకున్నామని ప్రధాని ప్రకటించారు.