- సోషల్ డిస్టెంసింగ్‌కు వీలుగా నిర్ణయం తీసుకున్న బోర్డు
న్యూఢిల్లీ: ఆగస్టు 5న జరగబోయే అయోధ్య రామమందిరం శంకుస్థాపనకు కేవలం 200 మందిని మాత్రమే అనుమతించాలని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర బోర్డు నిర్ణయించింది. 150 మంది అతిథులతో కలిపి ఈ సంఖ్యను నిర్ణయించినట్లు బోర్డు సభ్యులు చెప్పారు. “ అతిథులతో కలిసి కేవలం 200 మందిని మాత్రమే కార్యక్రమానికి అనుమతించాలని నిర్ణయం తీసుకున్నాం” అని ట్రెజరర్ గోవింద్ దేవ్ గిర్ చెప్పారు. కరోనా నేపథ్యంలో సోషల్ డిస్టెంసింగ్ పాటించేలా జాగ్రత్తలు తీసుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఆగస్టు 5న ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేస్తారని, వివిధ రాష్ట్రాల సీఎంలను కూడా ఆహ్వానిస్తున్నామన్నారు. శంకుస్థాపనకు ముందు ప్రధాని మోడీ రామ మందిరం, హనుమాన్ గరీ మందిరాల్లో ప్రత్యేక పూజలు చేస్తారని చెప్పారు. ఆగస్టు 3 నుంచి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేస్తున్నట్లు చెప్పారు. ఆగస్టు 5న భూమి పూజ తర్వాత మందిరం నిర్మాణం ప్రారంభం అవుతుందని చెప్పారు. బీజేపీ నేతలు ఎల్‌కే. అడ్వానీ, మురళీ మనోహర్ జోషీ, ఉమాభారతిలను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నామని ట్రస్ట్ మెంబర్ కామేశ్వర్ చౌపాల్ అన్నారు. 12.15 గంటలకు శంకుస్థాపన కార్యక్రమం ఉంటుందని చెప్పారు.
