ఒకే వేదికపై మోదీ-పవార్.. నవంబర్ 3న బారామతిలో ప్రధాని పర్యటన

ఒకే వేదికపై  మోదీ-పవార్.. నవంబర్ 3న బారామతిలో ప్రధాని పర్యటన

ముంబై: ప్రధాని మోదీ నవంబర్ 3న మహారాష్ట్రలోని బారామతిలో పర్యటించనున్నారు. ఎన్సీపీ (ఎస్పీ) చీఫ్ శరద్ పవార్ అధ్యక్షతన నిర్వహిస్తున్న‘విద్యా ప్రతిష్ఠాన్’ సంస్థలో 9 అడుగుల ఎత్తు, 4 టన్నుల బరువున్న గౌతమ బుద్ధుడి విగ్రహాన్ని పీఎం ఆవిష్కరించనున్నారు. 

శనివారం బారామతిలో జరిగిన ప్రెస్​ కాన్ఫరెన్సులో శరద్ పవార్ ఈ పర్యటన వివరాలను వెల్లడించారు. విద్యా ప్రతిష్ఠాన్ పరిధిలోని నక్షత్ర గార్డెన్​లో ఏర్పాటు చేసిన ఈ బుద్ధుడి విగ్రహం చుట్టూ జిజామాత, షాహూ మహారాజ్, మహాత్మా గాంధీ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, భౌరావ్ పాటిల్, అన్నాభావు సాఠే, యశ్వంత్ రావ్ చవాన్, శారదాబాయి పవార్ తదితరుల చిత్రలేఖనాలను ప్రదర్శించనున్నారు. 

ఈ కార్యక్రమానికి గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంలు ఏక్​నాథ్​ షిండే, సునేత్రా పవార్ తదితరులు హాజరుకానున్నారు. పొలిటికల్​గా విభిన్న ధ్రువాలుగా ఉన్న మోదీ, శరద్ పవార్ ఒకే వేదికను పంచుకోనుండటం రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.