ప్రపంచ శాంతి కోసం కలిసి పనిచేస్తాం

ప్రపంచ శాంతి కోసం కలిసి పనిచేస్తాం
  • ప్రజాస్వామ్య విలువలే భారత్, యూఎస్  సంబంధాలకు పునాదులు: మోడీ
  • వైట్ హౌస్ లో ప్రెసిడెంట్ బైడెన్ తో భేటీ అయిన ప్రధాని 
  • కరోనా తర్వాత పరిస్థితులు మారుతున్నయ్
  • సుస్థిరాభివృద్ధి, ఆహార భద్రతకు కట్టుబడి ఉన్నామని ప్రకటన 

న్యూఢిల్లీ/వాషింగ్టన్: ప్రపంచ శాంతి కోసం అమెరికాతో కలిసి పనిచేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సుస్థిరాభివృద్ధి, ఆహార భద్రతకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. అమెరికా పర్యటనలో ఉన్న మోదీ.. గురువారం వాషింగ్టన్ కు చేరుకున్నారు. వైట్ హౌస్ లో ప్రెసిడెంట్  బైడెన్  ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. వైట్ హౌస్ లోని సౌత్  లాన్స్ లో అమెరికా, భారత్  ల జాతీయ గీతాలను ఆలపించారు. 19 గన్  సెల్యూట్ తో మోదీకి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బైడెన్  మాట్లాడుతూ ప్రస్తుత ప్రపంచ పరిణామాల నేపథ్యంలో ఇండియా, అమెరికా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. మోదీ మాట్లాడుతూ ప్రజాస్వామ్య విలువలపైనే భారత్, అమెరికా బంధాలు ఆధారపడి ఉన్నాయన్నారు. రెండు దేశాల రాజ్యాంగాలు కూడా ‘వీ ద పీపుల్’ తోనే ప్రారంభమవుతాయని, రెండు దేశాల వైవిధ్యం కూడా గర్వించదగ్గదని మోదీ అన్నారు. ‘‘కరోనా తర్వాత ప్రపంచంలో పరిణామాలు మారుతున్నాయి. పేదరికాన్ని నిర్మూలించడం, క్లైమేట్  చేంజ్  సమస్యను పరిష్కరించడం, హెల్త్ కేర్ ను విస్తరించడం, అందరికీ ఆహార భద్రత వంటి విషయాల్లో ఇండియా, అమెరికా కలిసి పనిచేస్తున్నాయి” అని ఆయన అన్నారు.

21వ శతాబ్దాన్ని మార్చగలం: బైడెన్

ఇండియా, యూఎస్  21వ శతాబ్ద గమనాన్ని మార్చగలవని ప్రెసిడెంట్  బైడెన్  అన్నారు. ‘‘అమెరికా, ఇండియా రెండూ శక్తివంతమైన దేశాలు. శతాబ్దపు గమనాన్ని ఇండియా, యూఎస్  మార్చగలవు. నేడు మనం తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తు తరాలపై ప్రభావం చూపుతాయి. హెల్త్ కేర్, క్లైమేట్  చేంజ్, రష్యా–ఉక్రెయిన్  యుద్ధం వల్ల తలెత్తుతున్న సవాళ్లు వంటి అంశాలపై రెండు దేశాలు కలిసి పనిచేస్తున్నాయి. రెండు దేశాలకూ మతస్వేచ్ఛ చాలా కీలకం.  సమానత్వం, భావప్రకటన స్వేచ్ఛ, ప్రజల మధ్య వైవిధ్యానికి సవాళ్లను అధిగమిస్తున్నాయి” అని బైడెన్  అన్నారు. 

ఇది 140 కోట్ల మందికి దక్కిన గౌరవం: మోదీ

వైట్ హౌస్ లో తనకు లభించిన ఘన స్వాగతం 140 కోట్ల ఇండియన్లకు దక్కిన గౌరవమని ప్రధాని మోదీ అన్నారు. తనకు సాదర స్వాగతం పలికిన బైడెన్ కు ఆయన థ్యాంక్స్  చెప్పారు. తాను 30 ఏండ్ల క్రితం అమెరికా వచ్చినప్పుడు వైట్ హౌస్ ను బయటి నుంచి చూశానని గుర్తు చేసుకున్నారు. 

మోదీకి ఆత్మీయ విందు

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ప్రథమ మహిళ జిల్ బైడెన్.. ప్రధాని నరేంద్ర మోదీకి ఆత్మీయ విందు ఇచ్చారు. తొలుత వైట్‌‌హౌస్‌‌లోని సౌత్ పోర్టికోలో మోదీని బైడెన్ దంపతులు సాదరంగా ఆహ్వానించారు. ఫొటోలకు పోజులిచ్చిన ముగ్గురు నేతలు.. అక్కడే కొద్దిసేపు ముచ్చటించారు.  తర్వాత ‘‘స్థానిక భారతీయ నృత్య స్టూడియో ‘స్టూడియో ధూమ్’ ఆధ్వర్యంలో నిర్వహించిన సంగీత విభావరిని బైడెన్, జిల్ బైడెన్, మోదీ ఆస్వాదించారు. వీరితోపాటు అమెరికా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ జాక్ సలివన్, భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా పాల్గొన్నారు. 

మిల్లెట్ మెనూ

వైట్‌‌ హౌస్‌‌లోని సౌత్‌‌ లాన్‌‌లో ప్రధాని మోదీకి స్టేట్‌‌ డిన్నర్‌‌‌‌ కూడా ఏర్పాటు చేశారు. మిల్లెట్లు, మొక్కజొన్న గింజల సలాడ్, పుట్టగొడుగులు తదితరాలు మెనూలో ఉన్నాయి. సుమారు 400 మంది అతిథులను ఆహ్వానించారు. ప్రధాని మోదీ శాకాహారి కావడంతో.. అదిరిపోయేలా వెజిటేరియన్ మెనూ ఏర్పాటు చేయాలంటూ చెఫ్ నైనా కర్టిస్‌‌ను జిల్ బైడెన్ కోరారు. ఫస్ట్ కోర్స్ కింద (డిన్నర్ ఆరంభంలో) మ్యారినేటెడ్ మిల్లెట్, గ్రిల్డ్ కార్న్ కెర్నెల్ సలాడ్, కంప్రెస్డ్ వాటర్ మెలాన్, ట్యాంగీ అవకాడో సాస్ ఇస్తారు. తర్వాత మెయిన్ కోర్స్ లో భాగంగా స్టఫ్డ్ పోర్టోబెల్లో పుట్టగొడుగులు, క్రీమీ శాఫ్రాన్ రిసోట్టో, సుమాక్ రోస్టెడ్ సీ బాస్, లెమన్ డిల్ యుగర్ట్ సాస్, క్రిస్డ్ మిల్లెట్ కేక్స్, సమ్మర్ స్క్వాషెస్ వడ్డిస్తారు. టేబుల్స్ పై శాఫ్రాన్ కలర్ పువ్వులతో అలంకరిస్తారు. భారత జాతీయ పతాకంలోని రంగుల పూలతో ఈ అలంకరణ ఉంటుంది.