♦ నేటి నుంచి రెండ్రోజులు చైనా ప్రెసిడెంట్ టూర్
♦ ఎకానమీ, బోర్డర్, కాశ్మీర్, టెర్రరిజంపై చర్చించే చాన్స్
♦ హాంకాంగ్, దలైలామా తదితరాలపై చర్చకు దూరం..
♦ చెన్నై లోని మహాబలిపురం సందర్శన… మోడీతో భేటీ
న్యూఢిల్లీ:
రెండు రోజుల ఇండియా పర్యటన కోసం చైనా ప్రెసిడెంట్ జిన్‌పింగ్ శుక్రవారం వస్తున్నారు. చెన్నై లోని మహాబలిపురం సందర్శించడంతో పాటు ప్రధాని నరేంద్ర మోడీతో చర్చలు జరుపుతారు. ఈ భేటీలో రెండు దేశాల మధ్య వ్యాపార సంబంధాలతో సహా పలు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చించనున్నారు. ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో పాకిస్తాన్‌తో మనకు గొడవ, పాక్‌కు చైనా వంతపాడటం.. తదితర సమస్యల నేపథ్యంలో మోడీ, జిన్‌పింగ్‌ల భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఇది అధికారిక సమావేశం కాదని, కేవలం ఇన్ఫార్మల్ మీటింగ్ మాత్రమేనని అధికార వర్గాలు చెప్పాయి. ఈ మీటింగ్‌కు ఎలాంటి ఎజెండా ఉండదని తెలిపాయి. ఇద్దరు నేతలు ఈ కింది అంశాలు చర్చించే అవకాశం ఉందని సమాచారం..
గ్లోబల్ ఎకానమీ
బ్రిటన్, యూరోపియన్యూనియన్మధ్య ‘బ్రెగ్జిట్’ గందరగోళం వల్ల గ్లోబల్ ఎకానమీ ఎగుడుదిగుడులకు లోనవుతున్న ప్రస్తుత సందర్భంలో మోడీ, జిన్‌పింగ్ భేటీ అవుతున్నారు. అనుకున్నట్లుగానే అక్టోబర్ 31 నాటికి బ్రెగ్జిట్ ప్రక్రియ పూర్తయితే.. ఇంటర్నేషనల్ బిజినెస్‌పై ఆ ప్రభావం పడుతుంది. ఇండియా, చైనాలు కూడా బ్రెగ్జిట్ పరిణామాలను ఎదుర్కోవాల్సిందే. ఈ నేపథ్యంలో బ్రెగ్జిట్ తర్వాతి పరిణామాలు, ఇండియా, చైనాలపై పడే ప్రభావంపై మోడీ, జిన్‌పింగ్ లోతుగా చర్చిస్తారు. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ‘ట్రేడ్ వార్’ నేపథ్యంలో డొమెస్టిక్ ఇండస్ర్టీస్, బిజినెస్‌ను మరింత బలోపేతం చేసే విషయంలోనూ చర్చిస్తారు.
సరిహద్దు సమస్యలు
కొన్ని దశాబ్దాలుగా ఇండియా, చైనా సరిహద్దు సమస్యలు ఎదుర్కొంటున్నాయి. 1980ల నాటి నుంచి గొడవలు జరుగుతూనే ఉన్నాయి. చర్చలు జరుగుతున్నాయి. కానీ కొలిక్కి రావడం లేదు. అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూకాశ్మీర్‌లో చైనాతో మనకు సరిహద్దు సమస్యలు ఉన్నాయి. అరుణాచల్ అనేది సౌత్ టిబెట్ అని, 1940–1950ల్లో దాన్ని ఆక్రమించుకున్నారని చైనా వాదిస్తోంది. ఉత్తరాఖండ్‌లో కొన్ని ప్రాంతాలు తమవేనని చెబుతోంది. ఇక 1962 యుద్ధం సమయంలో చైనా ఆక్రమించుకున్న ఆక్సాయ్ చిన్ విషయంలోనూ
గొడవలున్నాయి. ‘డోక్లాం’ విషయంలో మొదలైన గొడవ.. ‘యుద్ధం’ గురించి హెచ్చరించే వరకు వెళ్లింది. వీటన్నింటిపైనా ఇద్దరు నేతలు చర్చించే అవకాశం ఉంది.
టెర్రరిజం
టెర్రరిజానికి వ్యతిరేకంగా మిగతా దేశాలతో కలిసి చైనా పెద్దగా గొంతు విప్పడం లేదు. టెర్రరిజం ఎఫెక్ట్ చైనాకు కూడా ఉంది. జింజియాంగ్ప్రావిన్స్లో జిహాదీ టెర్రరిజం ఎక్కువగానే ఉంది. దీంతో అక్కడ 10 లక్షల మంది నుంచి 30 లక్షల మంది వీగర్ ముస్లింలను చైనా నిర్బంధ శిబిరాల్లో ఉంచినట్లు అంతర్జాతీయ మీడియా చెబుతోంది. మరోవైపు పాకిస్తాన్‌కు వత్తాసు పలుకుతోంది. ఆర్టికల్ 370 రద్దు విషయంలోనూ ఆ దేశానికి అండగా నిలబడింది. జిన్‌పింగ్‌తో జరిగే చర్చలో మోడీ కచ్చితంగా పాకిస్తాన్ గురించి మాట్లాడే అవకాశం ఉంది. ఇండియాలో టెర్రరిజాన్ని పాక్ ఎగదోస్తోందని చెప్పే
చాన్స్ ఉంది.
కాశ్మీర్
చర్చల్లో కాశ్మీర్ అంశంఉంటుందో లేదో అధికారికంగా చెప్పకున్నా.. ఇద్దరు నేతలు కచ్చితంగా చర్చించే అవకాశం ఉంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాక్ కు మద్దతుగా చైనా మాట్లాడింది. ఆ దేశ ప్రధాని ఇమ్రాన్.. చైనాలో పర్యటించారు. కానీ ఇప్పుడు జిన్‌పింగ్ నేరుగా ఇండియా వస్తున్నారు. మిత్ర దేశమైన పాక్‌కు కాకుండా ఇండియాలో పర్యటిస్తుండటంతో చైనా యూటర్న్ తీసుకున్నట్లుగా ఉందని ఎక్స్పర్టులు అభిప్రాయపడుతున్నారు. మోడీ కూడా… ఆర్టికల్ 370 రద్దు తర్వాతి పరిణామాలు, ప్రస్తుతం జమ్మూకాశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితి, టెర్రరిస్టులను సరిహద్దుల గుండా పంపేందుకు పాక్ ప్రయత్నాలు… వంటి వాటిని జిన్‌పింగ్‌కు వివరించనున్నారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో చైనా ఎకనామిక్ కారిడార్ నిర్మిస్తోంది. దానిపై చర్చించే అవకాశాలున్నాయి.
చర్చించని అంశాలివీ..
పదేళ్లలో మన బోర్డర్ సెక్యూరిటీ అప్రోచ్‌లో చాలా మార్పు వచ్చింది. బోర్డర్ రీజియన్స్‌లో ఇన్‌ఫ్రా అభివృద్ధిపై ఇండియా దృష్టిపెట్టింది. స్పెషలైజ్డ్ మౌంటైన్ స్ట్రైక్ కోర్ (ఎంఎస్‌సీ) ను ఏర్పాటు చేసింది. ఎంఎస్‌సీ హెడ్ క్వార్టర్స్ ను వెస్ట్‌బెంగాల్‌లోని పనగఢ్‌లో ప్రారంభించింది. శత్రుమూకలు దాడికి పాల్పడితే ఎంఎస్‌సీ వెంటనే రియాక్ట్ అవుతుంది. అరుణాచల్ ప్రదేశ్‌లో ఇప్పటికే హిమ్ విజయ్ మిలటరీ ఎక్స్‌ర్‌సైజ్ మొదలైంది. ఈ ఎక్సర్‌సైజ్‌కు చైనా అభ్యంతరం చెప్పింది. అరుణాచల్‌ప్రదేశ్‌లో మనం జరిపే ఎలాంటి సైనిక కసరత్తునైనా చైనా వ్యతిరేకించడం మామూలే. అయితే చైనా ప్రెసిడెంట్ ఈ అంశాన్ని మహాబలిపురం మీటింగ్‌లో ప్రస్తావించకపోవచ్చని తెలుస్తోంది. టిబెటెన్ ఆధ్యాత్మిక గురువు దలైలామా, హాంకాంగ్ లో ప్రజాస్వామ్య అనుకూల ఆందోళనకారులు చేస్తున్న నిరసనల అంశాలు కూడా ఇద్దరు నేతల మధ్య చర్చకు వచ్చే అవకాశం లేదంటున్నారు.
