
- ఇండియా, చైనా సంబంధాలకు పరస్పర
- నమ్మకం, గౌరవం, అవసరాలే ప్రాతిపదిక: మోదీ
- ఇరు దేశాల బంధం 280 కోట్ల ప్రజల సంక్షేమంతో ముడిపడి ఉంది
- బార్డర్లో ఉద్రిక్తతలు తగ్గినయ్.. మానస సరోవర్ యాత్ర ప్రారంభం
- రెండు దేశాల మధ్య డైరెక్ట్ ఫ్లైట్ సర్వీసులూ స్టార్టవుతయ్
- ఎస్సీవో సమిట్ వేదికగా చైనా ప్రెసిడెంట్ జిన్‌పింగ్‌తో ప్రధాని భేటీ
- టెర్రరిజంపై పోరాటానికి మద్దతు తెలిపిన జిన్‌పింగ్
- ఎలిఫెంట్, డ్రాగన్ ఏకతాటిపైకి రావాలి
- ప్రత్యర్థులుగా కాకుండా ఫ్రెండ్స్‌గా ఉండాలని ఆకాంక్ష
- నేడు పుతిన్‌తో భేటీ కానున్న మోదీ
తియాంజిన్: ఇండియా, చైనా సంబంధాలకు పరస్పర నమ్మకం, గౌరవం, అవసరాలే ప్రాతిపదిక కావాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ సంబంధాలు ఇరు దేశాల్లోని 280 కోట్ల మంది ప్రజల ప్రయోజనాలు, సంక్షేమంతో ముడిపడి ఉన్నాయన్నారు. ఇరు దేశాల బంధం మొత్తం మానవాళి సంక్షేమానికి కూడా మార్గం సుగమం చేస్తుందని ఆకాంక్షించారు. చైనాలోని తియాంజిన్‌లో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్ సీవో) వార్షిక సదస్సు సందర్భంగా ఆదివారం చైనా ప్రెసిడెంట్ షీ జిన్ పింగ్‌తో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మోదీ, జిన్ పింగ్ ఇద్దరూ నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. మీటింగ్‌లో ద్వైపాక్షిక అంశాలు, అంతర్జాతీయ వ్యవహారాలు, ఇతర అంశాలపై చర్చించారు. సుమారు గంట సేపు జరిగిన ఈ సమావేశం అనంతరం ఇరువురు నేతలు సంయుక్తంగా టెలివిజన్ ద్వారా మాట్లాడారు. ముందుగా మోదీ ప్రసంగం ప్రారంభిస్తూ.. ఎస్సీవో సమిట్‌ను విజయవంతంగా నిర్వహిస్తున్నందుకు గాను జిన్ పింగ్‌కు అభినందనలు తెలిపారు. ఇండియా, చైనా సంబంధాల్లో ఇటీవల పురోగతి సాధించామని చెప్పారు. గత ఏడాది బలగాల ఉపసంహరణ తర్వాత నుంచి సరిహద్దులో ప్రశాంత వాతావరణం నెలకొందన్నారు. బార్డర్ వివాదంపై ఇరు దేశాల ప్రత్యేక ప్రతినిధుల మధ్య అగ్రిమెంట్ కుదరడం, కైలాస మానస సరోవర్ యాత్ర తిరిగి ప్రారంభం కావడం వంటి అంశాలను ఆయన ప్రస్తావించారు. ఇరుదేశాల మధ్య డైరెక్ట్ ఫ్లైట్ సర్వీసులు కూడా త్వరలోనే తిరిగి ప్రారంభం కానున్నాయని తెలిపారు. ఇరుదేశాల సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లాలని అంగీకరించామని చెప్పారు. ‘‘రెండు దేశాలూ వ్యూహాత్మక స్వతంత్రతను కోరుకుంటున్నాయి. ఈ రెండింటి మధ్య సంబంధాలను మూడో దేశం లెన్స్ ద్వారా చూడొద్దు” అని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.
ప్రత్యర్థులం కాదు.. మిత్రులం: జిన్ పింగ్
ఇండియా తమకు ‘కీలక మిత్ర దేశం’ అని చైనా ప్రెసిడెంట్ షీ జిన్ పింగ్ అన్నారు. రెండు దేశాలు తమ సంబంధాలను వ్యూహాత్మక విధానం నుంచి దీర్ఘకాలిక దృక్పథంతో ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. బార్డర్ సమస్య రెండు దేశాల మధ్య సంబంధాలను నిర్వచించేలా ఉండొద్దు. ఇండియా, చైనా ఒకదానినొకటి ప్రత్యర్థులుగా కాకుండా భాగస్వాములుగా చూస్తే.. అద్భుతమైన, స్థిరమైన సంబంధాలు నెలకొంటాయి. ప్రపంచంలో ఇప్పుడు శతాబ్దానికి ఒకసారి వచ్చే మార్పు కనిపిస్తోంది. అంతర్జాతీయంగా పరిస్థితి గందరగోళంగా ఉంది. చైనా, ఇండియా ప్రాచీన నాగరికతలు ఉన్న, ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశాలు. గ్లోబల్ సౌత్ లోనూ అతి పురాతన దేశాలు కూడా. మనం మిత్రులుగా, మంచి పొరుగువారిగా ఉండటం చాలా కీలకం. అందుకే డ్రాగన్(చైనా), ఎలిఫెంట్(ఇండియా) ఒకేతాటిపైకి రావాలి” అని జిన్ పింగ్ పిలుపునిచ్చారు. ప్రపంచ దేశాల మధ్య సహకారం, శాంతి, అంతర్జాతీయ సంబంధాల్లో aప్రజాస్వామ్యం కోసం కూడా రెండు దేశాలు కృషి చేయాలన్నారు. ఇండియా, చైనా దౌత్య సంబంధాలకు ఈ ఏడాదితో 75 ఏండ్లు పూర్తవుతున్నాయని, రెండు దేశాలూ ఒకదానికొకటి అభివృద్ధికి మార్గాలని జిన్ పింగ్ అన్నారు. ఎలిఫెంట్, డ్రాగన్ పరస్పర సహకారంతో కలిసి డ్యాన్స్ చేసేందుకు ఇదే మంచి అవకాశమని అభివర్ణించారు.
టెర్రరిజంపై పోరులో ఇండియాకు మద్దతు
టెర్రరిజం, ఫెయిర్ ట్రేడ్ తదితర అంశాల్లో ద్వైపాక్షిక, ప్రాంతీయ, ప్రపంచ సమస్యలు, సవాళ్లపై ఉమ్మడి కార్యాచరణను అనుసరించాల్సిన అవసరం ఉందని జిన్ పింగ్, మోదీ అంగీకరించారని భారత విదేశాంగ శాఖ తెలిపింది. బార్డర్ సమస్యకు పరస్పర ఆమోదయోగ్యమైన పరిష్కారం కోసం కృషి చేద్దామని నిర్ణయించుకున్నట్టు వెల్లడించింది. జిన్ పింగ్‌తో సమావేశంలో టెర్రరిజంపై పోరాటం విషయాన్ని మోదీ ప్రస్తావించారని విదేశాంగ శాఖ సెక్రటరీ విక్రమ్ మిస్రీ తెలిపారు. ఆదివారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఇండియాతోపాటు చైనా కూడా టెర్రర్ బాధిత దేశమేనని మోదీ చెప్పారు. టెర్రరిజంపై పోరులో ఇండియాకు మద్దతుగా ఉంటామని జిన్ పింగ్ తెలిపారు” అని మిస్రీ వెల్లడించారు. దీర్ఘకాలిక అభివృద్ధి ని దృష్టిలో పెట్టుకుని కలిసి పనిచేయాలని అంగీకారానికి వచ్చాయన్నా రు. వచ్చే ఏడాది ఇండియాలో జరిగే బ్రిక్స్ సమిట్‌కు రావాలని జిన్ పింగ్‌ను మోదీ ఆహ్వానించారని తెలిపారు.