ఎర్రకోట నుంచి సుదీర్ఘమైన ప్రసంగంగా.. మోదీ కొత్త రికార్డ్

ఎర్రకోట నుంచి సుదీర్ఘమైన ప్రసంగంగా.. మోదీ కొత్త రికార్డ్

ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ జెండాను అవిష్కరించిన ప్రధాని నరేంద్ర  మోదీ సరికొత్త రికార్డు సృష్టించారు. ఎర్రకోటపై వరుసగా పదేళ్ల పాటు జాతీయ జెండాను ఎగురవేసిన తొలి కాంగ్రెస్సేతర ప్రధానిగా నిలిచారు.  జాతీయ జెండా అవిష్కరణ అనంతరం జాతినుద్దేశించి ప్రసగించిన మోదీ..  దాదాపు 90 నిమిషాలు (1 గంట 30 నిమిషాలు) కొనసాగింది. మణిపూర్‌లోని పరిస్థితి, జీ20 సదస్సు, మహిళల భద్రత, ఆర్థిక వ్యవస్థ, అవినీతి, వంశపారంపర్య రాజకీయాలు వంటి పలు అంశాలపై ప్రధాని మోదీ ప్రస్తావించారు.

 మోదీ ప్రసంగంలోనూ సరికొత్త రికార్డు సృష్టించారు. ఇప్పటివరకు 10 సార్లు మోదీ ప్రసంగించగా.. సగటు సమయం 82 నిమిషాలుగా ఉంది. అయితే  దేశ చరిత్రలో ఇతర ప్రధానులు మాట్లాడిన ప్రసంగ సమయం కంటే ఇది ఎక్కువ కావడం విశేషం.  దేశ ప్రధానిగా 2014లో ఎర్రకోట నుంచి మోదీ తొలి ప్రసంగం చేశారు.  ఆ ఏడాది 65 నిమిషాల పాటు ఆయన మాట్లాడారు. 

ఆ తర్వాత వరుసగా 2015లో  86 నిమిషాలు, 2016లో 96 నిమిషాల, 2017లో 56 నిమిషాలు, 2018లో  83 నిమిషాలు, 2019లో  92 నిమిషాలు, 2020లో  90 నిమిషాలు, 2021లో 88 నిమిషాలు, 2022లో 74 నిమిషాలు మోదీ ప్రసంగించారు. ఈ ఏడాది కూడా 90 నిమిషాల పాటు సుదీర్ఘ ప్రసంగం చేశారు. మొత్తంగా ప్రధాని సగటు ప్రసంగం నిడివి 82 నిమిషాలు కాగా.. ఇప్పటివరకు ఏ ప్రధాని సగటుగా ఇంత సమయం ప్రసంగించలేదు.

1947లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశ తొలి ప్రధానిగా  జవహర్‌లాల్‌ నెహ్రూ మొట్టమొదటి ప్రసంగం చేశారు.  అప్పుడాయన 24 నిమిషాల పాటు మాట్లాడారు. ప్రధానిగా ఇప్పటివరకు అత్యధిక పంద్రాగస్టు ప్రసంగాలు చేసింది కూడా నెహ్రూనే కావడం విశేషం . మొత్తంగా 17 సార్లు స్వాత్రంత్య దినోత్సవం రోజున జాతినుద్దేశించి ప్రసంగించారు. ఆ తర్వాత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 16 సార్లు నాడు స్వాత్రంత్య దినోత్సవం రోజున మాట్లాడారు. 1972లో సుదీర్ఘంగా 54 నిమిషాలు  ఆమె ప్రసంగించారు.

ఇక మాజీ ప్రధాని ఐకే గుజ్రాల్‌ కేవలం ఒకే ఒక్కసారి మాత్రమే ఎర్రకోట నుంచి ప్రసంగించారు. 1997లో ఆయన 71 నిమిషాల పాటు మాట్లాడారు. ప్రధాని మోదీ తర్వాత రెండో అత్యధిక సగటు ప్రసంగ సమయం ఈయనదే. ఇక మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తన పదవీ కాలంలో 10 ప్రసంగాలు చేశారు.  అయితే ఆ ప్రసంగాలను 50 నిమిషాల వరకే ఉన్నాయి.  వాజ్‌పేయీ 2002లో 25 నిమిషాలు, 2003లో 30 నిమిషాల పాటు ప్రసంగించారు.