- కుల గణన, బీసీ రిజర్వేషన్లపై స్పందిస్తారనుకున్నం
- టీజేఎస్ చీఫ్, ఎమ్మెల్సీ కోదండరాం
హైదరాబాద్, వెలుగు: పరేడ్ గ్రౌండ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన స్పీచ్ మన్ కీ బాత్‌లా ఉందని టీజేఎస్ చీఫ్, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం ఎద్దేవా చేశారు. జన గణనలో కుల గణన, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ప్రధాని ప్రకటన చేస్తారని ఆశించామన్నారు. అయితే, ప్రధాని స్పీచ్ తెలంగాణ ప్రజలను తీవ్రంగా నిరాశపరిచిందన్నారు. ఈ మేరకు సోమవారం నాంపల్లి టీజేఎస్ ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడారు. “బంగారం కొనొద్దు, పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గించాలి.. అంటూ సుభాషితాలు చెప్పిపోయారు.
ఈ సుభాషితాలు దూరదర్శన్‌లొ కూర్చొని కూడా చెప్పవచ్చు” అని వ్యాఖ్యానించారు. మంగళవారం నెక్లెస్ రోడ్ జలవిహార్‌లో టీజేఎస్ నాలుగో ప్లీనరీ నిర్వహిస్తున్నామని తెలిపారు. గత ప్లీనరీలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా బీఆర్ఎస్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేశామని ఆయన గుర్తు చేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, నిరుద్యోగుల సమస్యలపై పోరాటం చేశామని, ప్లీనరీలో గత పోరాటాలు, విజయాలను సమీక్షించుకుని, భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తామని పేర్కొన్నారు.
కాంగ్రెస్‌తో కలిసి పని చేసినా తమ అస్తిత్వాన్ని కోల్పోమని ఆయన స్పష్టం చేశారు. పార్టీ ప్లీనరీకి అన్ని జిల్లాల నుంచి ప్రతినిధులు , తెలంగాణ ఉద్యమకారులు అటెండ్ అవుతారని వెల్లడించారు. ఈ సమావేశంలో పార్టీ నేతలు ధర్మార్జున్, బైరి రమేష్, పల్లె వినయ్, ఆశప్ప, నిజ్జన రమేశ్, నర్సయ్య, సర్దార్ వినోద్ పాల్గొన్నారు.
