విశ్వశాంతికి మోదీ ఆశాకిరణం..అణ్వాయుధ ముప్పు నుంచి ప్రపంచాన్ని రక్షించాలి: రాంచందర్ రావు

విశ్వశాంతికి మోదీ ఆశాకిరణం..అణ్వాయుధ ముప్పు నుంచి ప్రపంచాన్ని రక్షించాలి: రాంచందర్ రావు
  •     యుద్ధాలు దేనికీ పరిష్కారం కావు
  •     నాచారంలో గ్లో పీస్ అంతర్జాతీయ శాంతి సదస్సు 
  •     ప్రపంచ శాంతికి చొరవ చూపాలని ప్రధానికి లక్ష పోస్ట్‌‌‌‌ కార్డులు

హైదరాబాద్, వెలుగు: అంతర్జాతీయంగా నెలకొన్న సంక్షోభ పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా శాంతిని నెలకొల్పడానికి భారత ప్రధాని నరేంద్ర మోదీయే ఏకైక ఆశాకిరణమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అన్నారు. యావత్ ప్రపంచం ఇప్పుడు మోదీ వైపే ఆశగా చూస్తోందని ఆయన పేర్కొన్నారు. శనివారం నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఆవరణలో నిర్వహించిన గ్లో పీస్ అంతర్జాతీయ శాంతి సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న యుద్ధ వాతావరణంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నిరంతర యుద్ధాలతో అమాయక ప్రజలు, ముఖ్యంగా చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. గతంలో జరిగిన హిరోషిమా, నాగసాకి అణు విపత్తులను గుర్తుచేస్తూ.. ప్రస్తుత కాలంలో అణ్వాయుధ ముప్పు మానవాళి మనుగడకే ప్రమాదకరంగా మారిందని హెచ్చరించారు. 

యుద్ధాలు ఎప్పటికీ సమస్యలకు పరిష్కారం కావని, కేవలం శాంతి చర్చల ద్వారానే సంక్షోభాలను అధిగమించవచ్చని స్పష్టం చేశారు. కొన్ని దేశాల నేతల్లో శాంతి ఆలోచన లోపించడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల మనసుల్లో చిన్నతనం నుంచే శాంతి భావనలను నాటాలని రాంచందర్ రావు పిలుపునిచ్చారు. ‘శాంతి అనేది కేవలం దేశాల మధ్యే కాదు. ఇల్లు, బడి, స్నేహితులు, సమాజం నుంచి ప్రారంభం కావాలి. విద్యార్థులు శాంతి దూతలుగా మారి ప్రపంచానికి గొప్ప సందేశాన్ని ఇవ్వాలి’ అని ఆయన సూచించారు. జనజాగృతిలో భాగంగా తెలంగాణ గడ్డపై డీపీఎస్ యాజమాన్యం ఇలాంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమని కొనియాడారు.

మోదీకి లక్ష పోస్ట్‌‌ కార్డులు.. 

ప్రపంచ శాంతి కోసం ప్రధాని మోదీ చొరవ చూపాలని కోరుతూ ఈ సదస్సు ద్వారా పోస్ట్‌‌కార్డుల ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఒక్క డీపీఎస్ నాచారం నుంచే 20 వేల మంది విద్యార్థులు పోస్ట్‌‌కార్డులు రాయగా, ఇతర బడులతో కలిపి మొత్తం లక్ష కార్డులను ప్రధానికి పంపుతున్నట్టు ఆయన వెల్లడించారు. ప్రపంచానికి ‘శాంతి దూత’గా నిలవాలని విద్యార్థులు కోరడం గొప్ప విషయమన్నారు. ఈ చిన్న ప్రయత్నం భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయిలో పెద్ద శాంతి ఉద్యమంగా మారుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.