గుజరాత్ సీఎంకు మోదీ ఫోన్ సరిహద్దు భద్రతా చర్యలపై ఆరా

గుజరాత్ సీఎంకు మోదీ ఫోన్ సరిహద్దు భద్రతా చర్యలపై ఆరా

అహ్మదాబాద్: భారత్, పాకిస్తాన్​మధ్య ఉద్రికత్త​పరిస్థితులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ.. గుజరాత్​సీఎం భూపేంద్ర పటేల్‌‌కు ఫోన్ చేశారు. ఈ  సందర్భంగా ఆయన సరిహద్దులో రాష్ట్ర సంసిద్ధత, భద్రతా చర్యలపై ఆరా తీశారు. ప్రధానంగా ఆయన పాక్ సరిహద్దులో గల గుజరాత్‌‌లోని సున్నితమైన జిల్లాలైన కచ్, బనస్కాంఠ, పటన్, జామ్‌‌నగర్‌‌లలో భద్రతా ఏర్పాట్లు, పౌరుల భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ముందస్తు ప్రణాళికల గురించి అడిగి తెలుసుకున్నారు. 

గుజరాత్ రాష్ట్రం భూభాగంతో పాటు సముద్ర సరిహద్దులను కూడా పాకిస్తాన్‌‌తో పంచుకుంటున్న విషయం తెలిసిందే. కాగా, శుక్రవారం ఉదయం ప్రధాని మోదీ తనతో ఫోన్‌‌లో మాట్లాడారని గుజరాత్​సీఎం భూపేంద్ర పటేల్​తెలిపారు. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల్లో భద్రతా పరంగా రాష్ట్ర ప్రభుత్వ ముందస్తు ప్రణాళికల గురించి ఆరా తీశారని, పలు సలహాలు సూచనలు అందించారని, కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తామని హామీ ఇచ్చారని ఎక్స్​లో పోస్ట్​చేశారు. 

భారత్, పాక్​ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో గురువారం రాత్రి గుజరాత్‌‌లోని కచ్, బనస్కాంత సరిహద్దు జిల్లాల్లోని అనేక ప్రాంతాల్లో 7 గంటలకు పైగా బ్లాక్‌‌అవుట్ అమలు చేసినట్టు అధికారులు తెలిపారు. పాకిస్తాన్ దాడికి పాల్పడే అవకాశం ఉందన్న సంకేతాల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా భుజ్, నలియా, నఖత్రానా, గాంధీధామ్ పట్టణాలతో సహా కచ్‌‌లోని అనేక ప్రాంతాలను పూర్తిగా బ్లాక్‌‌అవుట్ చేసినట్టు పేర్కొన్నారు. అలాగే, శుక్రవారం ఉదయం రాష్ట్రంలో తమ కార్యకలాపాలను నిర్వహించడంలో దళాలు ఎటువంటి ఇబ్బందులను ఎదుర్కోకుండా చూసుకోవడానికి పటేల్ వివిధ విభాగాల అధిపతులు, సాయుధ దళాల అధికారులతో సమావేశమయ్యారు.