కుటుంబ పార్టీలకు ప్రధాని మోదీ సవాల్

 కుటుంబ పార్టీలకు ప్రధాని మోదీ సవాల్

లోక్‌సభలో విపక్షాలపై ప్రధాని నరేంద్ర మోదీ సెటైర్లు వేశారు.  విపక్షాలు చాలా కాలం విపక్షంలోనే ఉండాలని సంకల్పం తీసుకున్నాయని..  దశాబ్దాల తరబడి అధికారంలో ఉన్నందున మళ్లీ దశాబ్దాల తరబడి విపక్షంలో ఉండాలని భావిస్తున్నారని చెప్పారు.  బీజేపీపై పోటీ చేయడానికి విపక్ష నేతలు భయపడుతున్నారంటూ మోదీ కామెంట్స్ చేశారు.  ఎంపీగా గెలవలేమని కొంతమంది లోక్ సభను మార్చుకున్నారని..  అందుకే వారు దొడ్డిదారిన రాజ్యసభకు వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు.  రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా మోదీ మాట్లాడారు.  

ఎన్నికలు ఏ విధంగా ఎదుర్కోవాలో తెలియని స్థితిలో విపక్షాలు ఉన్నాయన్నారు మోదీ. లోక్ సభ  ఎన్నికల తర్వాత విపక్ష నేతలు ప్రేక్షకుల సీట్లకే పరిమితం అవుతారని జోస్యం చెప్పారు.   దేశాన్ని విభజించడమే విపక్షాల లక్ష్యమని మోదీ ఆరోపించారు. దేశంలో నాలుగు వ్యవస్థలు పటిష్టంగా ఉన్నప్పుడే  ప్రజాస్వామ్యం విరాజిల్లుతుందని అభిప్రాయపడ్డారు. కుటుంబ పాలకులతో దేశానికి నష్టమని చెప్పారు. ఆజాద్ అందుకే కాంగ్రెస్ పార్టీని వీడారని చెప్పారు.  

కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ పై మండిపడ్డారు మోదీ.  ఇంకెన్ని  రోజులు మైనార్టీ  రాజకీయాలు చేస్తారని సభలో ఫైరయ్యారు.  వారసులు రాజకీయాల్లోకి వెళ్లడం మంచిదేనన్న మోదీ.. వాళ్ల చేతుల్లోకి పార్టీ వెళ్లడం మంచిది కాదన్నారు.   కుటుంబ పార్టీలకు మోదీ సవాల్ విసిరారు.   మీ వారసులకు కాకుండా కార్యకర్తలకు అవకాశం ఇస్తారా అని ప్రశ్నించారు.  తాను, అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ అలాంటి పని చేయలేదన్నారు.  

కేంద్రంలో మళ్లీ తామే అధికారంలోకి వస్తామని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు.   2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి 400 సీట్లు వస్తాయని, బీజేపీకి సొంతంగా 370 స్థానాలు గెలుచుకుంటుందన్నారు.  వంద రోజుల్లో ముచ్చటగా మూడోసారి తమ ప్రభుత్వమే  ఏర్పాటు అవుతుందని చెప్పారు.  తాము సాధించిన అభివృద్ధి సాధించాలంటే కాంగ్రెస్ కు వందేళ్లు పడుతుందని చెప్పారు మోదీ.