ఇవాళ హైదరాబాద్ కు రానున్న మోడీ

ఇవాళ హైదరాబాద్ కు రానున్న మోడీ

ప్రధాని నరేంద్ర మోడీ శనివారం హైదరాబాద్ కు రానున్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో పాటు పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ జాతీయ నేతలు  హైదరాబాద్ కు రానున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం12.45 గంటలకు బయలుదేరనున్న మోడీ మధ్యాహ్నం 2. 55 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. మధ్యాహ్నం 3 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో బయలుదేరి మధ్యాహ్నం 3.20 గంటలకు హెచ్ఐసీసీ నోవాటెల్​కు వస్తారు. సాయంత్రం 4 గంటలకు నోవాటెల్ లో జరుగనున్న జాతీయ కార్యవర్గ సమావేశాల్లో  పాల్గొంటారు. రాత్రి 9 గంటల వరకు కొనసాగునున్న ఈ సమావేశాల్లో ఆయన పాల్గొననున్నారు. అనంతరం అక్కడే బస చేస్తారు. 

పలు రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు, పార్టీ జాతీయ నేతలు గురువారమే హైదరాబాద్ చేరుకొని తమకు కేటాయించిన నియోజకవర్గాల్లో పార్టీ కార్యకర్తల సమావేశాల్లో పాల్గొంటున్నారు. వీరంతా శనివారం సాయంత్రం 4 గంటలకు నోవాటెల్ కు చేరుకొని జాతీయ కార్యవర్గ సమావేశాలకు హాజరవుతారు. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4. 30 గంటల వరకు రెండో రోజు జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతాయి. ఇందులోనూ ప్రధాని మోడీ పాల్గొంటారు. సాయంత్రం పరేడ్ గ్రౌండ్ బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. ఆ రోజు రాత్రి రాజ్ భవన్ లేదా నోవాటెల్ లో బస చేస్తారు.

మోడీ సభకు విస్తృతమైన ఏర్పాట్లు

ఆదివారం విజయ సంకల్ప సభ పేరుతో పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించనున్న ప్రధాని మోడీ సభకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం విస్తృతమైన ఏర్పాట్లు చేపట్టింది. ఈ సభలో మొత్తం నాలుగు వేదికలను ఏర్పాటు చేస్తున్నారు. ఒక వేదికపై మోడీ, నడ్డా, అమిత్ షా, రాజ్‌‌నాథ్ సింగ్, గడ్కరీ, కిషన్ రెడ్డి, సంజయ్, లక్ష్మణ్, డీకే అరుణ ఉంటారు. రెండో వేదికపై పలు రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు కూర్చుంటారు. మూడో వేదికపై పార్టీ జాతీయ నేతలు ఉంటారు. నాలుగో వేదికపై సాంస్కృతిక బృందాల కళా ప్రదర్శనలు ఉంటాయి.