తమిళ నాడు అభివృద్ధే మా లక్ష్యం : ప్రధాని నరేంద్ర మోదీ

తమిళ నాడు అభివృద్ధే మా లక్ష్యం : ప్రధాని నరేంద్ర మోదీ
  •     ప్రధాని నరేంద్ర మోదీ
  •     మధురైలో రూ.4,400 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

మధురై: అభివృద్ధి చెందిన భారతదేశం కోసం అభివృద్ధి చెందిన తమిళనాడును నిర్మించడం కేంద్ర ప్రభుత్వ ఉమ్మడి లక్ష్యమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి, సమగ్రాభివృద్ధికి పూర్తిగా కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఆదివారం తమిళనాడులోని మధురైలో రూ.4,400 కోట్లకు పైగా విలువైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల పనులను ప్రధాని ప్రారంభించారు. చెన్నై బీచ్‌‌, చెన్నై ఎగ్మోర్‌‌‌‌ మధ్య 4వ రైల్వే లైన్‌‌ను జాతికి అంకితం చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో మోదీ మాట్లాడారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశాన్ని నిర్మించడానికి ప్రతి భారతీయుడు స్ఫూర్తితో ఉన్నారన్నారు. 

దేశ భవిష్యత్తును రూపొందించడంలో తమిళనాడు నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుందని చెప్పారు. ఆదిత్యనల్లూరు వంటి చారిత్రక ప్రదేశాలను అంతర్జాతీయ పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతామన్నారు. పులికాట్‌‌ సరస్సు, పొదిగై మలై ప్రాంతాల్లో పర్యాటకాన్ని ప్రోత్సహించడం ద్వారా కొత్త ఉపాధి అవకాశాలను కల్పిస్తామని తెలిపారు. 2014 నుంచి తమిళనాడులో 4 వేల కిలోమీటర్లకు పైగా నేషనల్‌‌ హైవేలను నిర్మించినట్లు వెల్లడించారు. అలాగే, గత దశాబ్ద కాలంలో భారత రైల్వేలు ఆధునిక కాలానికి అనుగుణంగా మారాయన్నారు. 

2009–2014 మధ్య తమిళనాడుకు సగటు వార్షిక రైల్వే కేటాయింపు రూ.880 కోట్లు ఉండగా, 2026–27 నాటికి అది రూ.7,600 కోట్లకు పెరిగిందని చెప్పారు. రాష్ట్రంలో నడుస్తున్న 9 వందే భారత్‌‌, 9 అమృత్‌‌ భారత్‌‌ రైళ్ల కోచ్‌‌లు చెన్నైలోని ఐసీఎఫ్‌‌లోనే తయారయ్యారన్నారు. ఈ ప్రాంతంలో ఆర్థిక వ్యవస్థను మార్చేందుకు బెంగళూరు– చెన్నై, చెన్నై– హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్‌‌ కారిడార్లను ప్రతిపాదించినట్లు తెలిపారు. అనంతరం ప్రధాని మోదీ సంప్రదాయ దుస్తులు ధరించి, తిరుప్పంకుండ్రంలోని ప్రసిద్ధ అరుల్మిగు సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని సందర్శించారు. ప్రధానితో గవర్నర్‌‌‌‌ ఆర్‌‌‌‌ఎన్‌‌ రవి, కేంద్ర మంత్రి ఎల్‌‌.మురుగన్‌‌, బీజేపీ రాష్ట్ర చీఫ్‌‌ నైనార్‌‌‌‌ నాగేంద్రన్‌‌ ఉన్నారు.