యుద్ధాన్ని ఆపేందుకు ప్రయత్నిస్తాం... జెలెన్ స్కీతో మోడీ భేటీ

యుద్ధాన్ని ఆపేందుకు ప్రయత్నిస్తాం... జెలెన్ స్కీతో మోడీ భేటీ

ప్రధాని నరేంద్ర మోడీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో తొలిసారి సమావేశమయ్యారు. 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌ రష్యా మధ్య యుద్దధం ప్రారంభమైన  తర్వాత ప్రధాని మోదీ, జెలెన్స్కీ వ్యక్తిగతంగా కలుసుకోవడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. జపాన్ లోని హిరోషిమాలో జరుగుతున్న జీ-7 దేశాల సదస్సుకు అతిథిగా ప్రధాని మోడీ వెళ్లారు. ఈ సమయంలో మోడీ ..జెలెన్ స్కీతో  భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ప్రధాని మోడీతో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా ఉన్నారు.

ఏం చర్చించారంటే..

ఏడాదిన్నరగా రష్యా, ఉక్రెయిన్ యుద్దానికి సంబంధించి జెలెన్ స్కీతో తాను ఫోన్ లో మాట్లాడానని..ఇప్పుడు ఆయన్ను కలిసే అవకాశం వచ్చిందని  ప్రధాని మోదీ తెలిపారు. రష్యా -ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచానికి ఒక సమస్యగా మారిందని చెప్పారు. ఈ యుద్ధం అన్ని దేశాలపై  అనేక రకాలుగా ప్రభావం చూపుతోందన్నారు. రష్యా -ఉక్రెయిన్ యుద్ధాన్ని  రాజకీయ, ఆర్థిక సమస్యగా చూడటం లేదని....మానవత్వానికి సంబంధించిన సమస్యగా భారత్ చూస్తోందన్నారు.  మానవ విలువలకు సంబంధించిన సమస్య అని పేర్కొన్నారు.  యుద్ధం వలన కలిగే బాధలు ఏంటో భారత కంటే ఉక్రెయిన్కే ఎక్కువ తెలుసన్నారు. యుద్ధం వల్ల భారత్ విద్యార్థులు ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చినప్పుడు అక్కడి పరిస్థితుల గురించి విద్యార్థులు చెప్పిన వివరాలు చూస్తే ఉక్రెనియన్లు అనుభవించిన బాధలను అర్థం చేసుకోగలనమన్నారు. భారత్ తరఫున.. తన వ్యక్తిగత సామర్థ్యం మేరకు యుద్ధానికి  పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తామని  జెలెన్‌స్కీకి మోడీ  భరోసా ఇచ్చారు.

జపాన్ ప్రధానికిషిదా ఆహ్వానం మేరకు జపాన్ ప్రెసిడెన్సీలో జరుగుతున్న జీ7 సమ్మిట్‌కు  ప్రధానని నరేంద్ర మోడీ హాజరయ్యారు. మే 19 నుంచి మే 21 వరకు జీ7 శిఖరాగ్ర సదస్సు జరుగనుంది. ఈ సదస్సు పూర్తయ్యేంత వరకు ప్రధాని మోడీ హిరోషిమాలోనే ఉండనున్నారు. ఈ సదస్సులో భాగంగా  భారత్ మూడు అధికారిక సెషన్లలో పాల్గొంటుంది. ఇందులో మొదటి రెండు సెషన్లు మే 20న, మూడో సెషన్ మే 21న జరుగుతుంది. మొదటి రెండు సెషన్లలో ఆహారం, ఆరోగ్యం, లింగ సమానత్వం, వాతావరణ మార్పులు, పర్యావరణం వంటి అంశాల‌పై చ‌ర్చలు నిర్వహిస్తారు. మూడో సెషన్‌లో శాంతియుత, స్థిరమైన ప్రగతిశీల, ప్రపంచం వంటి అంశాలపై చర్చిస్తారు. వీటిపై ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు. జీ7 గ్రూప్‌లో అమెరికా , యూకే, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, కెనడా, జపాన్ దేశాలు ఉన్నాయి. అయితే  ప్రస్తుతం ఈ గ్రూప్‌కు జపాన్ అధ్యక్షత వహిస్తోంది. అయితే జీ 7 దేశాల కూటమిలో భారత్ కు సభ్యత్వం లేకున్నా.. జపాన్ ప్రధాని కిషిడా ప్రత్యేక ఆహ్వానం మేరకు ప్రధాని మోడీ ఆ దేశం వెళ్లారు. సమ్మి్ట్లో పాల్గొనేందుకు  భారత్ సహా మరో ఏడు కీలక దేశాలను ఆహ్వానించింది.

మోడీకి ఘన స్వాగతం..

జపాన్లోని హిరోషిమాలో జీ7 సమ్మిట్ వర్కింగ్ సెషన్‌లో పాల్గొనేందుకు వచ్చిన ప్రధాని మోడీకి...ఆ దేశ ప్రధాని ఫ్యూమియో కిషిడా ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత ఫ్యూమియో కిషిదాతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. భారత్-జపాన్ మధ్య సంబంధాల బలోపేతం, వ్యాపార, వాణిజ్య భాగస్వామ్యంపై కీలక చర్చించారు. జపాన్ తో పాటు.. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌, వియత్నాం ప్రధాని ఫామ్‌మిన్‌ చిన్‌ లతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. 

గాంధీ విగ్రహం ఆవిష్కరణ

జీ7 సదస్సులో పాల్గొనేందుకు జపాన్‌ వెళ్లిన  ప్రధాని నరేంద్ర మోడీ.. హిరోషిమాలో మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. గాంధీ విగ్రహం అహింస ఆలోచనను ముందుకు తీసుకెళ్తుందంటూ మోడీ  ట్విటర్‌ లో మహాత్మా గాంధీ విగ్రహానికి సంబంధించిన ఫోటోనుషేర్‌ చేశారు. హిరోషిమాలోని గాంధీ విగ్రహం చాలా ముఖ్యమైన సందేశాన్ని ఇస్తుందని....శాంతి, సామరస్యం అనే గాంధేయ ఆదర్శాలు ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తాయన్నారు.  మిలియన్ల మందికి బలాన్ని ఇస్తాయి..అని ప్రధాని మోడీ జపాన్‌ భాషలో ట్వీట్‌ చేశారు.