ప్రెసిడెంట్, పీఎంకు వాడే స్పెషల్ ఫ్లైట్స్ ఇవే..

ప్రెసిడెంట్, పీఎంకు వాడే స్పెషల్ ఫ్లైట్స్ ఇవే..
  •     అమెరికా నుంచి రెండు బోయింగ్ 777 విమానాలు తిరిగొచ్చినయ్
  •     మిసైల్ డిఫెన్స్ సిస్టమ్, సెల్ఫ్ ప్రొటెక్షన్ సూట్‌‌‌‌‌‌‌‌తో రిట్రోఫిట్టింగ్ చేయించిన కేంద్రం

న్యూఢిల్లీ: ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ ప్రయాణించేందుకు రెండు స్పెషల్ ఫ్లైట్స్ మార్పులు, చేర్పులతో రెడీ అయ్యాయి. వీవీఐపీల కోసం అనేక సౌలతులు, రక్షణ ఏర్పాట్లతో స్పెషల్ గా రిట్రోఫిట్టింగ్(మార్పులు చేర్పులు చేసిన) రెండు బీ777 విమానాలు గురువారం ఢిల్లీకి చేరుకున్నాయని అధికారులు వెల్లడించారు. అమెరికా నుంచి అధునాతన మిసైల్ డిఫెన్స్ సిస్టమ్, సెల్ఫ్ ప్రొటెక్షన్ సూట్లను కూడా కొనుగోలు చేసి వీటిలో అమర్చారు. ఇప్పటివరకు ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ బోయింగ్ 747 విమానాల్లో ప్రయాణించేవారు. వీటిని ఆ సమయంలో ‘ఎయిర్ ఇండియా వన్’ అనే పేరుతో పిలిచేవారు. వీటిని ఇండియన్ ఎయిర్ లైన్స్ పైలట్లు నడిపేవారు. వీటి నిర్వహణను ఎయిర్ ఇండియా ఇంజనీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ చూసుకునేది. వీవీఐపీల ప్రయాణాలు లేనప్పుడు వీటిని ఎయిర్ ఇండియా కమర్షియల్ ఆపరేషన్లకు కూడా వాడుకునేది. అయితే వీవీఐపీలకు పూర్తి రక్షణతో కూడిన స్పెషల్ ఫ్లైట్లు ఉండాలని భావించిన కేంద్ర ప్రభుత్వం రెండు బీ777 విమానాల్లో మార్పులు చేసేందుకు అమెరికాలోని బోయింగ్ కంపెనీకి 2018లో పంపింది. ఇందుకోసం రూ. 8,400 కోట్లతో డీల్ కుదుర్చుకుంది. వీటిలో లార్జ్ ఎయిర్ క్రాఫ్ట్ ఇన్ఫ్రారెడ్ కౌంటర్ మీజర్స్, సెల్ఫ్​ప్రొటెక్షన్ సూట్ కొనుగోలుకే రూ.1,388 కోట్లు ఖర్చు పెట్టింది. బీ777 ఫ్లైట్లు జులైలోనే మనదేశానికి రావాల్సి ఉండగా, కరోనా కారణంగా వాయిదాపడింది. ఈ రెండు విమానాలను ఇకపై కమర్షియల్ ఆపరేషన్లకు ఇవ్వకుండా వీవీఐపీల టూర్లకు మాత్రమే వాడనున్నారు. పేరు మాత్రం ‘ఎయిర్ ఇండియా వన్’గానే కొనసాగుతుంది.