నారీశక్తి.. అమ్మవారి స్వరూపం: ప్రధాని మోదీ

నారీశక్తి.. అమ్మవారి స్వరూపం: ప్రధాని మోదీ

సేలం: కాంగ్రెస్​ పార్టీ మాజీ చీఫ్​ రాహుల్ ​గాంధీ చేసిన శక్తి వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి విరుచుకుపడ్డారు. శక్తితో పెట్టుకున్నోళ్లను ఆ శక్తే సర్వనాశనం చేస్తుందని డీఎంకే సహా ఇండియా కూటమిని ఉద్దేశించి ఘాటుగా హెచ్చరించారు. లోక్​సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ఆయన తమిళనాడులోని సేలంలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు. కాంగ్రెస్, డీఎంకే పార్టీలు అవినీతి, కుటుంబ పాలనతో నాణేనికి రెండు పార్శ్వాల్లాంటివని ఎద్దేవా చేశారు.  ఇండియా కూటమిలోని పార్టీలు ఇతరుల మత విశ్వాసాల విషయంలో మాట్లాడవని.. అదే హిందూమతాన్ని దూషించేందుకు సెకన్ ​కూడా ఆలోచించవని దుయ్యబట్టారు. 

‘లోక్​సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముంబైలో నిర్వహించిన మొదటి ర్యాలీలోనే ఇండియా కూటమి ప్రణాళిక బయటపడింది. విశ్వాసం అనే శక్తిని నాశనం చేస్తామని ఆ కూటమి నాయకులు పేర్కొన్నారు. హిందూమతంలో శక్తి అంటే ఏమిటి? తమిళనాడులోని అందరికీ తెలుసు’ అని మోదీ వ్యాఖ్యానించారు. తమిళనాడులో శక్తి అంటే అమ్మవార్ల స్వరూపం.. కంచి కామాక్షి అమ్మ, మధురై మీనాక్షి అమ్మ శక్తిపీఠం, సమయపురం మరియమ్మ అని పేర్కొన్నారు. హిందూమతంలో శక్తి అంటే మాతృశక్తి, నారీశక్తి అని తెలిపారు. శక్తిని నాశనం చేయాలనుకున్నవాళ్లే నాశనమైపోతారని మన ఇతిహాసాల్లో ఉన్నదని అన్నారు. ఏప్రిల్​19న రాష్ట్రంలో జరుగబోయే ఎన్నికల్లో అది 

నిజం చేసి చూపాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

ఆడిటర్​ రమేశ్​ను తలుచుకొని భావోద్వేగం

పదేండ్ల క్రితం హత్యకు గురైన పార్టీ నాయకుడు, ఆడిటర్​ వీ రమేశ్​ను గుర్తుచేసుకుంటూ మోదీ భావోద్వేగానికి గురయ్యారు. కొద్దిసేపు ప్రసంగాన్ని నిలిపేసి.. మళ్లీ తిరిగి ప్రారంభించారు. ‘ఆడిటర్​ రమేశ్​మనతో లేరు. ఆయనను ఎప్పుడూ మరిచిపోలేను. రాత్రింబవళ్లు పార్టీకోసం శ్రమించారు. కానీ ఆయన హత్యకు గురయ్యారు.ఆయనకు నేను ఈ సభలో నివాళులర్పిస్తున్నా’ అని మోదీ పేర్కొన్నారు.  

కేరళ​లో భారీ ర్యాలీ

బీజేపీకి ఓటుబ్యాంకులేని కేరళ రాష్ట్రంలో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రధాని మోదీ మంగళవారం భారీ ర్యాలీ చేపట్టారు. పాలక్కడ్​లోని కొత్తమైదాన్​ అంచువిలక్​నుంచి హెడ్​పోస్టాఫీస్​ వరకు ర్యాలీ కొనసాగింది. పూలతో అలంకరించిన ఓపెన్​రూఫ్​టాప్​ వాహనంపై నిలబడి ప్రజలకు అభివాదం చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ముందుకు కదిలారు.