వచ్చే నెల నుంచి పిల్లలకు న్యుమోనియా టీకా

వచ్చే నెల నుంచి పిల్లలకు న్యుమోనియా టీకా
  • పిల్లలకు న్యుమోనియా టీకా
  • రాష్ట్రంలో వచ్చేనెల నుంచి ప్రారంభం
  • న్యుమోకోకల్​ కాంజుగేట్​ వ్యాక్సిన్​ వేసేందుకు నిర్ణయం
  • ఇప్పటికే టీకా ప్రోగ్రామ్​లో చేర్చిన కేంద్రం

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్రంలో వచ్చే నెల నుంచి పిల్లలకు న్యుమోకోకల్​ కాంజుగేట్​ వ్యాక్సిన్​ (పీసీవీ) వేయాలని ఆరోగ్యశాఖ అధికారులు నిర్ణయించారు. న్యుమోకోకల్​ బ్యాక్టీరియా వల్ల వచ్చే న్యుమోనియా, మెనింజైటిస్​ (మెదడువాపు) వంటి వ్యాధులను నివారించేందుకు ఈ టీకా ఇవ్వనున్నారు. దేశంలో ఏటా 16 లక్షల మంది ఈ వ్యాధుల బారినపడుతుండగా..  68,700 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారు. వీళ్లంతా ఐదేండ్లలోపు వాళ్లే కావడంతో యూనివర్సల్​ ఇమ్యునైజేషన్​ ప్రోగ్రామ్​లో పీసీవీని చేరుస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. మొదట మధ్యప్రదేశ్‌‌, ఉత్తరప్రదేశ్‌‌, బీహార్‌‌‌‌, హిమాచల్ ప్రదేశ్‌‌, రాజస్థాన్‌‌ లలో ఈ టీకాను అందుబాటులోకి తెచ్చింది. అక్కడ మంచి ఫలితాలు రావడంతో  అన్ని రాష్ట్రాల్లోనూ అమలు చేయాలని సూచించింది. ఈ నేపథ్యంలో గురువారం సమావేశమైన రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు.. ఆగస్టు 12 నుంచి 19 మధ్యన వ్యాక్సినేషన్ ప్రారంభించాలని నిర్ణయించారు. న్యుమోకోకల్ బ్యాక్టీరియాతో బ్యాక్టీరీమియా (రక్తం ఇన్​ఫెక్షన్​), సైనస్​, చెవి ఇన్​ఫెక్షన్ల వంటివి వస్తాయి. అన్ని వయసుల వాళ్లకూ సోకుతుంది. రెం డేండ్ల లోపు పిల్లలు, 65 ఏండ్లు దాటిన పెద్దలకు రిస్క్ ఎక్కువగా ఉంటుంది. 

ఒక్కొక్కరికి 3 డోసులు
రోటా, పెంటావాలెట్​ వ్యాక్సిన్ల లాగానే పీసీవీనీ ఒక్కొక్కరికి మూడు డోసులు ఇవ్వనున్నారు. పుట్టిన నెలన్నరకు తొలి డోసు, మూడున్నర నెలలకు రెండో డోసు, 9 నెలలు నిండినంక బూస్టర్ డోసు ఇస్తారు. రాష్ట్రంలో ప్రతిఏటా 6.5 లక్షల మంది పుడుతున్నారు. వీళ్లందరికీ వ్యాక్సిన్ ఇస్తామని హెల్త్ ఆఫీసర్ ఒకరు తెలిపారు. దీంతో పిల్లల మరణాల సంఖ్య మరింత తగ్గుతుందని ఆశిస్తున్నామని చెప్పారు. వ్యాక్సిన్ వేసిన చోట నొప్పి, ఎర్రబడడం, వాపు వంటి చిన్న ఇబ్బందులు తప్ప..  సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవని డాక్టర్లు చెబుతున్నారు.