
- 10,500 ఎకరాలకు అందనున్న సాగునీరు
- ఆనందంలో ఆయకట్టు రైతులు
లింగంపేట, వెలుగు: కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం పోచారం ప్రాజెక్టు నిండుకుండలా మారింది. కాలువల ద్వారా నీటి విడుదల కొనసాగుతుండడంతో ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఖరీప్ పంటలకు ఢోకా ఉండదని సంబురపడుతున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 21 అడుగులు(1.820 టీఎంసీ) కాగా, ఎగువ ప్రాంతాలైన గాంధారి, లింగంపేట, తాడ్వాయి మండలాల్లో కురిసిన వానలకు ప్రాజెక్టులోకి భారీగా వరద వచ్చి చేరింది.
ప్రాజెక్టు నీటితో నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి మండలాల్లోని 14 చెరువులు నింపనున్నారు. ఖరీప్లో పోచారం ప్రాజెక్టు కింద 10,500 ఎకరాలకు సాగు నీరు అందించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రాజెక్టు ఆయకట్టును ఏ, బీ జోన్లుగా విభజించారు. ఖరీఫ్ లో రెండు జోన్లకు సాగు నీటిని అందిస్తారు.
రబీలో ఒక ఏడాది ఏ జోన్కు, మరో ఏడాది బీ జోన్కు నీటిని విడుదల చేస్తారు. ప్రాజెక్టు నిండు కుండలా మారడంతో ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట మండలాల రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు అలుగుదుంకుతుండగా, ఈ నీరంతా నిజాంసాగర్ ప్రాజెక్టులోకి వెళ్తున్నాయి.