ఎమ్మెల్యే కొడుకుపై పోక్సో కేసు!

ఎమ్మెల్యే కొడుకుపై పోక్సో కేసు!
  • ఫొటో, వీడియోల ఆధారంగా కేసు పెట్టేందుకు సిద్ధమవుతున్న పోలీసులు
  • మరోసారి బాలిక స్టేట్​మెంట్​ రికార్డ్​ చేయనున్న అధికారులు
  • బాలికపై గ్యాంగ్​ రేప్​ కేసులో మరో మైనర్​ అరెస్ట్​
  • ఇన్నోవాను ఫాం హౌస్​కు తీసుకెళ్లిన కార్పొరేటర్​కు నోటీసులు
  • బెంజ్​ కారులో బాలిక చెప్పులు, చెవి రింగు లభ్యం  

హైదరాబాద్​, వెలుగు: జూబ్లీహిల్స్​లో బాలికపై గ్యాంగ్​రేప్​ కేసులో ఎమ్మెల్యే కొడుకుపైనా కేసు పెట్టేందుకు పోలీసులు రెడీ అవుతున్నారు. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్​ రావు బయటపెట్టిన ఫొటోలు, వీడియో ఆధారంగా బెంజ్​ కారులో బాధితురాలి పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్టు ఆధారాలను సేకరించారు. దాంతో పాటు బాధితురాలి నుంచి మరోసారి స్టేట్​మెంట్​ను రికార్డ్​ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆమె ఇచ్చే సమాచారం, ఫొటో, వీడియో ఆధారాల ప్రకారం ఎమ్మెల్యే కుమారుడిని నిందితుడిగా చేర్చి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసే అవకాశాలున్నాయని ఓ అధికారి చెప్పారు. మరోవైపు ఈ కేసుకు సంబంధించి ఆదివారం సంగారెడ్డి జిల్లాకు చెందిన మరో మైనర్​(17)ను పోలీసులు అరెస్ట్​ చేశారు. ఘటన తర్వాత గుల్బర్గా వెళ్లిపోయిన అతడిని శనివారం రాత్రి హైదరాబాద్​కు తీసుకొచ్చారు. ఆదివారం జడ్జి ముందు ప్రవేశపెట్టి జువనైల్​ హోంకు తరలించారు. మరో నిందితుడు ఉమేర్​ ఖాన్​ను విచారిస్తున్నారు. పబ్​ నుంచి బేకరీకి వెళ్లే మార్గంలో బెంజ్​ కారులో, బేకరీ నుంచి పబ్​కు వచ్చేటప్పుడు ఇన్నోవాలో జరిగిన ఘటనల వివరాలను రికార్డ్​చేశారు. ఇన్నోవాను మొయినాబాద్​ఫాం హౌస్​కు ఓ కార్పొరేటర్​ తరలించినట్టు తెలుసుకుని.. అతడికి నోటీసులిచ్చారు. సోమవారం విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఇటు అమ్నీషియా పబ్​ సిబ్బందిని కూడా విచారించారు. ఈవెంట్​ నిర్వహించిన వారి వివరాలను పోలీసులు తెలుసుకున్నారు.  

కార్లలో ఫోరెన్సిక్​ ఆధారాల సేకరణ 
సీజ్​ చేసిన బెంజ్​, ఇన్నోవా కార్లలో ఆదివారం ఫోరెన్సిక్​, క్లూస్​ టీం ఆధారాలను సేకరించింది. బెంజ్​ కారులో బాధిత బాలిక చెప్పులు, చెవికమ్మ, వెంట్రుకలు,  వేలి ముద్రలు సహా 15 రకాల క్లూస్​ను స్వాధీనం చేసుకున్నారు. వాటిని ఫోరెన్సిక్​ సైన్సెస్​ లేబొరేటరీకి తరలించారు. ఇన్నోవాలోని సీట్ల మధ్యలో 20 రకాల క్లూస్​ను తీసుకున్నారు. వాటితో పాటు నిందితుల మొబైల్​ ఫోన్​ డేటాను పరిశీలిస్తున్నారు. సోషల్​ మీడియాలో షేర్​ అవుతున్న వీడియోలు, ఫొటోలను ఎవరు షేర్​ చేశారనే విషయాలపై దర్యాప్తు చేస్తున్నారు.