ఆదిలాబాద్ టౌన్/దండేపల్లి/తిర్యాణి/జైనూర్/ఇచ్చోడ, వెలుగు : పోడు సమస్య పరిష్కరించాలని, ఆదివాసీలపై జరుగుతున్న దాడులు అరికట్టాలని డిమాండ్‌చేస్తూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సోమవారం చేపట్టిన బంద్ సక్సెస్ అయ్యింది. ఆదిలాబాద్‌లో జరిగిన నిరసనలో తుడుం దెబ్బ జల్లి అధ్యక్షుడు గోడం గణేశ్మాట్లాడారు. ఆదివాసీలకు జరుగుతున్న అన్యాయాలపై మరోదశ పోరాటానికి శ్రీకారం చుడుతామన్నారు. మంచిర్యాల జిల్లా కోయ పోచగూడెం ఆదివాసీ మహిళలపై అటవీ శాఖ అధికారులు దాడిచేయడం అమానుషమన్నారు. దాడుల వెనుక సీఎం కేసీఆర్, మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి హస్తం ఉందని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు కావాలనే గిరిజనులపై కక్షగట్టి అడవి నుంచి బలవంతంగా వెళ్లగొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిరసనలో లీడర్లు ఉయ్క సంజీవ్, శ్యాంరావు, మనోజ్, గోడం రేణుక, ఇందిర, వరుణ్, రాహుల్ తదితరులు పాల్గొన్నారు.
దండేపల్లి, లక్సెట్టిపేట మండలాల్లో బంద్జరిగింది. ఆదివాసీలు తాళ్లపేట నుంచి ముత్యంపేట వరకు బైక్ ర్యాలీ నిర్వహిస్తూ తాళ్లపేట, మ్యాదరిపేట, దండేపల్లి, ముత్యంపేటలలో దుకాణాలను బంద్ చేయించారు. నిరసనలో కొట్నాక తిరుపతి, దోసండ్ల ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
తిర్యాణి మండలంలో బంద్నిర్వహించారు. ఈ సందర్భంగా తుడుం దెబ్బ డివిజన్అధ్యక్షుడు భగవంతరావు మాట్లాడుతూ భూమి కోసం పోరాడుతున్న మంచిర్యాల జిల్లా కోయ పోచగూడెం ఆదివాసీ మహిళలను పోలీసులు, ఫారెస్ట్ ఆఫీసర్లు కొట్టారని, చీరలు లాగారని, చిత్రహింసలకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నిరసనలో నాయక్పోడ్రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు పెద్ది రామ్ చందర్, జిల్లా అధ్యక్షుడు బొమ్మన దశరథం, తోటి సంఘం జిల్లా అధ్యక్షుడు ఆత్రం సంతోష్, లీడర్లు రవీందర్, వెంకటేశ్వర్లు, వెంకటేశ్,శంకర్ తదితరులు ఉన్నారు.
జైనూర్‌లో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివాసీ సంక్షేమ పరిషత్ జిల్లా మహిళా ప్రెసిడెంట్ గోడం జంగుబాయి మాట్లాడారు. ఆదివాసీలపై ఫారెస్ట్ ఆఫీసర్ల దాడులు అమానుషమన్నారు. నిరసనలో లీడర్లు మేస్రం శేకు, కొడప మోతుబాయి, మేస్రం కమలాబాయి, ఆత్రం శేషు, అడా అమృత్ రావు తదితరులు ఉన్నారు.
ఇచ్చోడలో నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పోడు భూములకు పట్టాలిచ్చి వ్యవసాయ పథకాలన్నీ వర్తింపజేయాలన్నారు. నిరసనలో ఆదివాసీ సంఘాల లీడర్లు జలైజాకు, కుమురం కోటేశ్వర్, గెడం నాగేందర్, ఆత్రం మహేందర్, బీఎస్పీ లీడర్లు తదితరులు పాల్గొన్నారు.
