పట్టాలిచ్చే వరకు అడవిని వదలం

పట్టాలిచ్చే వరకు అడవిని వదలం
  • ఆఫీసర్లకు తెగేసి చెప్పిన కోయపోచగూడ ఆదివాసీలు  
  • వారం రోజులుగా కుటుంబాలతో అటవీ ప్రాంతంలోనే నివాసం  
  • చర్యలు తప్పవన్న డీఎఫ్​ఓ 
  • రెవెన్యూ భూమి ఇప్పిస్తామని హామీ

మంచిర్యాల, వెలుగు:తమకు అటవీ హక్కు పత్రాలు ఇచ్చే వరకు తాము నమ్ముకున్న భూమిని వదిలేది లేదని మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని కోయపోచగూడ ఆదివాసీలు జిల్లా ఉన్నతాధికారులకు తెగేసి చెప్పారు. తమకు మూడెకరాల భూమి ఇస్తూ హక్కు పత్రాలు ఇవ్వాలనే డిమాండ్​తో వారం రోజులుగా పిల్లాపాపలతో అడవిలోనే వంటావార్పు చేసుకుంటూ అక్కడే చెట్ల కింద ఉంటున్నారు. దీంతో ఉట్నూర్​ ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్ ​అంకిత్, జిల్లా ఫారెస్ట్​ఆఫీసర్ ​శివాని డోంగ్రె, జన్నారం ఎఫ్​డీఓ సిరిపురం మాధవరావు, దండేపల్లి తహసీల్దార్ హనుమంతరావు, లక్సెట్టిపేట సీఐ కరీముల్లాఖాన్ గురువారం కోయపోచగూడకు వచ్చారు. వెంటనే అటవీ ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్లాలని కోరారు. ఐటీడీఏ, పంచాయతీరాజ్ శాఖల ద్వారా ఉపాధి కల్పిస్తామన్నారు. సమీప గ్రామాల్లో రెవెన్యూ భూములు ఉంటే సర్వే చేయించి ఒక్కో కుటుంబానికి మూడెకరాలు ఇవ్వడానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఆఫీసర్లు ఎంత నచ్చచెప్పినా గిరిజనులు ససేమిరా అంటూ హక్కు పత్రాలు ఇస్తేనే అక్కడి నుంచి కదులుతామని భీష్మించుకొని కూర్చున్నారు. ఆఫీసర్లు చేసేదేమీ లేక గిరిజనుల సమస్యలను కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి నివేదిస్తామని చెప్పి వెనుదిరిగారు.
 
అటవీ భూములు ఆక్రమిస్తే చర్యలు 
అటవీ భూముల్లో చెట్లని కొట్టి ఆక్రమిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకోక తప్పదని డీఎఫ్​ఓ శివాని డోంగ్రె హెచ్చరించారు. తాళ్లపేట ఫారెస్ట్ రేంజ్ ఆఫీసులో ఐటీడీఏ పీఓతో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు. రిజర్వ్ ఫారెస్ట్ యాక్ట్ ప్రకారం అటవీ భూముల్లో చెట్లను నరికినా, ఆక్రమించినా కేసులు పెట్టాల్సి ఉంటుందన్నారు. 2005 కు ముందు నుంచి పోడు చేసుకుంటున్న వారికి మాత్రమే అటవీ హక్కు పత్రాలు వస్తాయన్నారు.  

ఆ 29 మంది నిర్దోషులు

  • గిరిజన మహిళలపై కేసు కొట్టివేత

ములకలపల్లి, వెలుగు  : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలో29 మంది గిరిజన మహిళలపై  ఫారెస్ట్​ ఆఫీసర్లు పెట్టిన కేసును గురువారం కొత్తగూడెం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కొట్టివేశారు. ములకలపల్లి మండలం అన్నారం బీట్ కాంపౌండ్ నంబర్16లో 2015 సంవత్సరంలో 50 హెక్టార్ల  ఏరియాలోని పోడు భూమిలో వెదురు, జామాయిల్ మొక్కలను తొలగించారు. అన్నారం రెవెన్యూ పరిధిలోని 29 మంది గిరిజన మహిళలే వీటిని కొట్టేశారని ఫారెస్ట్ ​బీట్​ఆఫీసర్ ​ములకలపల్లి పీఎస్​లో కేసు పెట్టారు. ఇందులో పది మంది సాక్షులను విచారించడంతో పాటు రెండు వర్గాల వాదనలు విన్న ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి బత్తుల రామారావు గురువారం నిర్ధోషులుగా ప్రకటించారు. నిందితుల తరపున ఉప్పుశెట్టి సునీల్ కుమార్ వాదనలు వినిపించారు.