పట్టాలు ఇస్తలేరు... పంటలు వేయనిస్తలేరు! 

పట్టాలు ఇస్తలేరు... పంటలు వేయనిస్తలేరు! 
  • ఎనిమిది నెలలుగా దరఖాస్తులు పెండింగ్​
  • సాగును అడ్డుకుంటున్న ఫారెస్ట్​ ఆఫీసర్లు 
  • జిల్లాలో 11వేల మందికిపైగా ఎదురుచూపులు 

మంచిర్యాల,వెలుగు: పోడు భూములకు అటవీ హక్కు పత్రాలు ఇస్తామన్న ప్రభుత్వం ఏండ్లు గడుస్తున్నా వాటి సంగతి తేల్చడం లేదు. రేపు మాపంటూ నాన్చుతుండడంతో సాగుదారులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం దరఖాస్తులు తీసుకుని ఎనిమిది నెలలు గడుస్తున్నా పరిశీలన ఊసెత్తడం లేదు. ఇదే అదనుగా ఫారెస్ట్​ ఆఫీసర్లు రెచ్చిపోతున్నారు. రైతులు వానాకాలం పంటలు వేయకుండా అడ్డుకుంటున్నారు.

దశాబ్దాలు గడుస్తున్నా...
జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఆదివాసీ గిరిజనులు, భూమిలేని నిరుపేదలు పోడు వ్యవసాయం చేస్తున్నారు. దండేపల్లి, జన్నారం, జైపూర్​, భీమారం, కోటపల్లి, వేమనపల్లి, నెన్నెల, కాసిపేట తదితర మండలాల్లో వేల ఎకరాల్లో పోడు భూములు ఉన్నాయి. ఆదివాసీల గిరిజనులే కాకుండా గిరిజనేతరులు సైతం ఉన్నారు. తాతలు తండ్రుల కాలం నుంచి అటవీ భూములను సాగు చేసుకుంటున్నారు. వారికి పట్టాలు లేకపోవడంతో ఫారెస్ట్​ ఆఫీసర్లు ఏటా పంటలను ధ్వంసం చేస్తున్నారు. కందకాలు తీసి మొక్కలు నాటుతున్నారు. రాజకీయ నాయకులు అటవీ హక్కు పత్రాల అంశాన్ని ఎన్నికల నినాదంగా వాడుకుంటూ మరింత అగ్గి రాజేస్తున్నారు. గతంలో కాంగ్రెస్​ ప్రభుత్వ హయాంలో కొంతమందికి పట్టాలు ఇచ్చారు. 

దరఖాస్తులు మూలకు...
సీఎం కేసీఆర్​ మరోసారి పోడు భూములకు అటవీ హక్కు పత్రాలు ఇస్తామని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించి ఏడాది గడిచింది. ఈ మేరకు అధికారులు నిరుడు నవంబర్​లో రాష్ర్టవ్యాప్తంగా అన్ని జిల్లాలో పోడు రైతుల నుంచి దరఖాస్తులు తీసుకున్నారు. జిల్లాలో 93 గ్రామపంచాయతీ పరిధిలోని 128 హాబిటేషన్ల నుంచి 11,774 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో ఎస్టీలు 4,460 మంది కాగా, గిరిజనేతరులు 7,314 మంది ఉన్నారు. మొత్తం 33,418.19 ఎకరాలకు గాను గిరిజనులు 13,587.37 ఎకరాల్లో సాగు చేసుకుంటుండగా, గిరిజనేతరుల ఆధీనంలో 19,830.22 ఎకరాల భూములు ఉన్నాయి. ఈ దరఖాస్తుల పరిశీలన కోసం ప్రభుత్వం గ్రామాల వారిగా ఫారెస్ట్​ రైట్స్​ కమిటీ(ఎఫ్​ఆర్​సీ)లను ఏర్పాటు చేసింది. ఈ కమిటీల్లో గుర్తించిన భూములకు పట్టాలు జారీ చేయనున్నట్టు స్పష్టం చేసింది. దరఖాస్తులు స్వీకరించి ఎనిమిది నెలలు గడుస్తున్నా అతీగతీ లేకపోవడంతో పోడు రైతులు ఆందోళన చెందుతున్నారు.  

పంటలు ధ్వంసం... రైతులపై కేసులు... 
ఈసారి కూడా వానాకాలం సీజన్​లో పంటలు వేసుకుంటున్న రైతులను ఫారెస్ట్​ ఆఫీసర్లు ఇబ్బందులు పెడుతున్నారు. పంటలు వేయకుండా అడ్డుకుంటున్నారు. వేసిన పంటలను ధ్వంసం చేస్తున్నారు. పోడు భూముల చుట్టూ కందకాలు తీసి మొక్కలు నాటేందుకు రెడీ అయ్యారు. అంతేగాకుండా రైతులపై కేసులు పెట్టి సతాయిస్తున్నారు. ఇటీవల దండేపల్లి మండలం కోయపోచగూడెంలో 12 మంది ఆదివాసీ మహిళలపై కేసులు నమోదు చేసి జైలుకు పంపడం తెలిసిందే. జిల్లాలో ఫారెస్ట్​ ఆఫీసర్లు గుర్తించిన 128 హ్యాబిటేషన్ల నుంచే కాకుండా మరో 100కు పైగా గ్రామాలను గుర్తించాలని డిమాండ్లు వెల్లువెత్తాయి. వివిధ గ్రామాలకు చెందిన ఆదివాసీ గిరిజనులు, ఇతర రైతులు కలెక్టరేట్​ దగ్గర ఆందోళనలు చేశారు.