స‘జీవం’ పోసే కవితలు!

స‘జీవం’ పోసే కవితలు!

తెలకపల్లి రవి.. పరిచయం అక్కర్లేని పేరు. ఆయన సాహితీ ప్రియులందరికీ సుపరిచితులే. జర్నలిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా, కథకుడిగా, రాజకీయ విశ్లేషకుడిగా, విమర్శకుడిగా, ఉపన్యాసకుడిగా, చరిత్రకారుడిగా బహుముఖ ప్రజ్ఞ కలిగిన వ్యక్తి. ‘సజీవం’ ఇది ఆయన తొలి కవిత్వం.

అసలు ఆయన కవిత్వం కూడా రాస్తారన్న విషయం ఈ పుస్తకం ద్వారానే మనకు తెలుస్తోంది. రాజకీయ విమర్శల కోణంలో ఇప్పటికే చాలా పుస్తకాలు రాసి పాఠకుల ముందుకు తీసుకొచ్చారు. కానీ కవితా సంపుటి తీసుకురావడం ఇదే మొదటిసారి. ఈ సంపుటిలో ఉన్నవి చిట్టి కవితలే అయినా భావం, సందేశం, అధికార గళాల్ని ప్రశ్నించే గొంతుతో లోతుగా ఉంటాయి.

‘కవిత్వమా క్షమించు, తప్పిపోయిన బిడ్డలా వెతుక్కుంటూ వచ్చాను’ అంటూ ఆధునిక కవిత్వంలో ఇప్పుడు తనదైన మార్గాన్ని వెతుక్కునే తీరును ‘జీవధార’లో చక్కగా చెప్పుకొచ్చారు. ‘దిన దినం పలకరిస్తుంది చరిత్ర, క్షణక్షణం నిర్మాణమవుతుంది చరిత్ర’ అంటూ ‘నిరంతరం’ సాగే చరిత్ర గమనాన్ని మొదటి కవితలో వివరిస్తారు. ఓటమి ఎదురైనా ఆశయం చిరంజీవి, ‘అలా నడిపిస్తూనే’ ఉంటుందంటారు. 

‘దేవుడెప్పుడూ అడగడు, కాబట్టి జీవుడి ఆకలి చూడు’ అంటూ ‘అక్కడే’ వెతుకూ అనే సందేశాన్ని అందించారు. అవమానించొద్దు, ప్రయత్నిస్తూనే ఉంటాను అనే అర్థం స్ఫురించేలా ‘అగ్గినవుతా’లో రాస్తే మరో కవితలో జీవితంలో కష్టాలు, నష్టాలు, దుఃఖాలు వస్తూనే ఉంటాయి. అయినా సరే జీవితం ‘అద్భుతమే’ అంటారు. ‘చూశాంలే’ కవితలో ఎన్నో ఎత్తులు, జిత్తులు, మహత్తులు అబ్బో చాలానే చూశాం అంటాడు. ‘ద్వేషగీతం’లో కొన్ని మొహాలు సాదాసీదాగా ఉంటాయి. కానీ సత్యం చెబుతుంటాయి అని మొదలుపెట్టి దేశం పేరు చెబుతూ ద్వేషమే చూపుతాయన్నారు.

 ఆధునికత ముసుగులో మనం చేస్తున్న వికృతాలు, విద్వేషాల మూలంగా సమాజం వెనక్కి పోతోంది. ‘అసలు ఈ సమాజంలో మనిషి ఉన్నాడన్నది భ్రమలా మిగిలిపోతుందేమో’ అంటూ మొబైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫోన్ల విపరీత వాడకాన్ని, అవి తెచ్చే ముప్పును ఈ కవిత్వంలో చెప్పారు. 

అదంతే, ప్రవాహ ప్రశ్న, సహజం, సజీవం, నో ఆన్సర్, నా కవిత్వం, ఒకటైతే నిజం.. లాంటి మరిన్ని కవితలు నేటి సమాజపు పోకడల్ని, మానవ స్వభావాల్ని విశదీకరిస్తాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సంపుటిలోని 61 కవితలు వేటికవే అన్నట్లు ఉంటాయి. రచయిత తన కవితల ద్వారా ఏది రాసినా.. ఏం మాట్లాడినా ఆయన ప్రజల పక్షానే మాట్లాడతారు. ప్రజల పక్షానే నిలబడతారని ఈ కవితలు మనకు చెప్పకనే చెబుతున్నాయి.

- పి. రాజ్యలక్ష్మి-