లోకం రెప్పల్లోకి ప్రయాణించే కవిత్వం.. నూటొక్క కవితల సమాహారం..

 లోకం రెప్పల్లోకి ప్రయాణించే కవిత్వం.. నూటొక్క కవితల సమాహారం..

“ముల్లును పీకడానికి / కవిత్వం ఓ పిన్నీసు “ – ఈ కవితా పంక్తులు ‘కాలాన్ని నిద్రపోనివ్వని జలగీతం కవి , బహు భాషల్లోకి తన కవిత్వం అనువదించబడిన డా. ఎన్.గోపి గారి తాజా కవితా సంపుటి ‘రెప్పలు దాటని లోకం’ లోనివి. ఇది నూటొక్క కవితల సమాహారం. రోజూ మనుషుల మనసుల్లో అనంతంగా ఎన్నో వికలాత్మక ముళ్ళు గుచ్చుకుంటూనే ఉంటాయి. 

ఎంత నేర్చినా ఇంకెంతో మిగిలే ఉంటుంది అన్నట్టుగా రోజువారీ జీవన యాత్ర లో ఎన్నో సందేహాలు పోగు బడుతూనే ఉంటాయి. ముచ్చట్లు, సంభాషణలు, అక్కడక్కడ వార్తలు, గట్రా ఈ సందేహాలకి వేదికలవుతాయి. అయితే ఈ రెప్పలు దాటని లోకం కవితా సంపుటి లోకి గాని ప్రవేశిస్తే నిత్య నైమిత్తిక సంఘటనలు, సందేహాలు , కవితల ద్వారా ప్రత్యక్షమై పరిష్కారం దిశగా నడిపిస్తాయి. మనసులకు ఆనందకరమైన ఊరట లభిస్తుంది. అవును కదా, నిజం కదా అని మళ్ళీ మళ్ళీ కవితల్లోకి తొంగి చూస్తాం.

కరెంటు స్తంభం, చలి, చెప్పులు, మొబైల్ నెంబర్, అల్లం మురబ్బా, గోరు చిక్కుడు కాయ, దండ,  మందుల పెట్టె – ఇలా తెల్లవారిన దగ్గరి నుంచి రాత్రి నిద్రా సమయం వరకు మనిషి కాలానుభవాలు అక్షరాల కవితా పంక్తులగా పేనబడి నాగలి దున్నే మోకులా తయారవుతాయి. గోళం మీది మనిషి గోలీల మీదే బతుకుతున్నాడంటే అబద్ధం ఎంత మాత్రమూ కాదు , ఆశ్చర్యం అంతకన్నా కాదు. “గిన్ని గోలీలా!/ పరగడుపున ప్రారంభమవుతాయి. 

ఇప్పుడు వాటి పేర్లన్నీ/ కరతలామలకం/స్పెల్లింగులతో సహా! కొన్ని రోగాల పేర్లు కూడా/ కవితాత్మకంగా ఉంటాయి. రోజూ అద్దంలో/మొహం చూసుకుంటాడు/గోలీలు పనిచేస్తున్నట్టున్నాయి/రాత్రి పడుకునేటప్పుడు / ఆ రోజు కాదే ఆఖరు గోలి / స్వప్నాల్లో/ ఆకాశానికద్దిన చుక్కల్లా /గోలీలు తిరుగుతుంటాయి .”- చుక్కల్లా గోలీలు తిరగడమే కాదు పాఠకుడు కూడా కవిత చుట్టూ తిరుగుతూనే ఉంటాడు, అనారోగ్య జీవితం గురించి ఆలోచిస్తూనే ఉంటాడు.

కతల్లా మొదలవుతాయి. కథలు చెప్తుంటాయి ఈ కవితలు. “కవిత్వం అశాంతికి చిరునామా/అక్షరాలు/లోకానికి రాసిచ్చిన వీలునామా’’ అంటూ అనంత సంవేదనలకి దోసిలి పడుతుంటుంది కవిత్వం అని చెప్పుకొస్తారు ఈ కవి. “గోధుమ పిండిలో/పాలు కలిపినట్టు ముద్దుగా ఉంటాడు / వస్తూ పోతూ “హాయ్ అంకుల్’’ అని పలకరిస్తాడు.  ‘‘ఇవాళ వాడు పెద్దవాడై /అంత్యక్రియల ఏర్పాట్లు చూస్తున్నాడు/ పూర్ణ చంద్రుని లాంటి మోము/ సగం జాబిల్లిలా అణిగిపోయింది” అంటూ ఓ ‘మృత్యువు’ అన్న కవితలో ఓ పదేళ్ల బాలుడి తండ్రి చనిపోతే రాసిన వైనం. “ఇతరుల చావు వార్తా మనల్ని/ శీతాగాలి లా సోకుతుంది” అని కూడా అంటారు ఈ కవితలో. కవితా కళ సామర్ధ్యం, వైభవం, ప్రయోజనం లాంటివి ఎన్నో సరిగ్గా ఇలాంటి కవితలు అందించినప్పుడు సమకూరుతుంటాయి. అవగతమవుతుంటాయి.

కరుణరసంతో గుండెలు కరిగించి కళ్లకి , కాళ్లకి పని కల్పిస్తాయి. “ఎన్ని సార్లు వలవేసినా/సముద్రంలో చేపలు అయిపోవు/ అలాగే ఊహలు”, “పొద్దుట్నించి/ మీకో సూర్యుణ్ణి బాకీ పడ్డాను/తీర్చకుండా ముందుకెలా సాగుతాను” అంటారు బాకీ అన్న కవితలో. ఇలా అనడం లో కవి సామాజిక నిబద్ధత అర్ధమవుతూ ఉంటుంది. కళా సాంస్కృతిక రంగాల్లో కవి ప్రాముఖ్యత తెలిసివస్తుంది.

“తెలుగు  నా తొలి శ్వాస/ ఇతర భాషలు ప్రాణాయామం/ కవిత్వాన్ని మాత్రం/ స్వభాషలోనే ఆలోచిస్తాను నేను’’ -ఇలాంటి కవితా పంక్తులే కాకుండా సమగ్ర కవిత్వం కేవలం తెలుగు భాష మీద రావడం ప్రస్తుత కాలంలో ఎంతైనా సముచితం, ముఖ్యావసరం కూడా. అరుదుగా మాత్రమే తెలుగు భాష మీద కవిత్వం వెలువడుతుంది. రాజకీయంగా కూడా మాతృభాషకి అంతా ప్రాముఖ్యం దక్కడం లేదు. మాతృ భాషని ప్రేమిస్తూ పోషించడమంటే ధర్మాన్ని పాటించడం లాంటిది. ధర్మబద్ధ సమాజాన్ని స్థాపించడం లాంటిది.

గుప్పిళ్ల గుప్పిళ్లుగా కవిత్వం గురించి, కొత్త పాత కవుల గురించి కవితలు వెలువరించారు ఈ సంపుటిలో. ఓ ‘కొత్త కవి ‘ కవితలో  “చిన్న సెగ మీద/ ఉడుకుతున్న పాల మీది/ నురగలా ఉన్నాడు/ నీళ్లు చల్లకండి! ప్రేమ సామాజికం కాదని/ మూతి వీరవకండి. ప్రేమికుడు కానీ వాడు/ విప్లవకారుడి కాలేడు” అని ముగిస్తారు. సరికొత్త ఊహ, సమర్ధమైన ఊహ, అలాగే అర్ధవంతమైన సందేశం అన్నీ అందించారు ఈ కవితలో. సీతాకోకచిలుకను మించిన/ కవితా వస్తువు ప్రపంచం లోనే లేదు” అంటారు. ఒక మంచి కవిత చదివితే/ నాకారోజు అన్నం అక్కర్లేదు/ కూర్చున్నా/ లేచినా/ పడుకున్నా/ ఆ పంక్తులే నన్ను వెంటాడతాయి.”

ఇలా కవిత్వ ప్రేమే సర్వస్వంగా శ్వాసిస్తున్న కవికి నిజంగా మనం రుణపడి ఉంటాం. ఎందరెందరో కవి మిత్రుల గురించి, చిన్న చిన్న ఉపకారాలైనా సరే, పెద్దవైనా సరే హృదయపూర్వక కృతజ్ఞతలుగా కవితలు చెప్పుకొచ్చారు.

ఇదే కోవలో ప్రముఖ కవి ఆశారాజు గారికి ఈ ‘రెప్పలు దాటని లోకం’ కవితా సంపుటిని అంకితమిచ్చారు. “శరీరమంతా/ మనసుగా మారిన వ్యక్తిని/ చూసారా మీరు/ అతడితడే అని ఆశారాజు గురించి చెప్పుకొచ్చారు ‘హృదయ సమయం’ అన్న కవితలో. ఇంకా “స్నేహానికి పునరుక్తులండవు/ నిన్నటి మాటలే/ ఇవాళ కొత్తగా ఉంటాయి/ అసలా గొంతులోనే/ హృదయ నదులు ప్రవహిస్తుంటాయి’’ అని కూడా అంటారు.

ఇలా తెల్లారిన లోకం గురించి తేటతెల్లమైన కవన దర్శనంతో ఈ కవి మనల్ని అలరిస్తారు “లోపల అరుస్తున్న కవితా/ గొలుసు తెంపుకోవడానికి/ పెనుగులాడుతుంది అంటూ.-  

ఒబ్బిని సన్యాసి రావు

లైఫ్​& లిటరేచర్​ పేజీకి వ్యాసాలు పంపాల్సిన మెయిల్​ ఐడీ featureseditor@v6velugu.com