గోదావరి తీర గ్రామాల్లో పోలవరం మంపుపై ఆందోళన

 గోదావరి తీర గ్రామాల్లో పోలవరం మంపుపై ఆందోళన

భద్రాచలం, వెలుగు : తెలంగాణలోని గోదావరి తీర గ్రామాల గుండెల్లో పోలవరం కలవరం మొదలైంది. 1986 నాటి గోదావరి వరదలు, ఈ ఏడాది ముంపు తీవ్రతను విశ్లేషించుకుంటూ పోలవరం పూర్తయితే జరగబోయే నష్టం ఏ విధంగా ఉంటుందోనని భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో తమ ఊర్లను పోలవరం ముంపు గ్రామాలుగా ప్రకటించాలని ఉద్యమిస్తున్నారు. నాలుగు రోజులుగా బూర్గంపాడులో గ్రామస్తులు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. తమ భూములకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని, ఆర్ఆర్ ప్యాకేజీ కూడా ప్రకటించాలని, ఆ తర్వాతే పోలవరం ప్రాజెక్టు పనులు చేయాలని డిమాండ్ ​చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే ఈ కాక మిగిలిన పల్లెలకూ పాకుతోంది. మరోవైపు తెలంగాణ సర్కారు కూడా ఈ విషయంపై కేంద్ర జలవనరులశాఖపై ఒత్తిడి తెస్తోంది. ప్రాజెక్టు ఎత్తు పెంచడం వల్ల తెలంగాణలోని గోదావరి పరివాహక ప్రాంతాలకు ప్రమాదం పొంచి ఉంటుందని కేంద్ర ప్రభుత్వానికి రాసిన లెటర్లలో పేర్కొంది.  

వరదలకు మునిగిన 99  గ్రామాలు 
గత జూలైలో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. 71.3 అడుగుల నీటిమట్టం, 24.50లక్షల క్యూసెక్కుల ప్రవాహంతో భద్రాచలం తీర ప్రాంతంలోని 99 గ్రామాల్లో కల్లోలం సృష్టించింది. అశ్వాపురంలో 18, భద్రాచలంలో 5 కాలనీలు, బూర్గంపాడులో 12, చర్లలో 28, దుమ్ముగూడెంలో 25, పినపాకలో 11 గ్రామాలు పూర్తిగా మునిగాయి. బూర్గంపాడు మండల కేంద్రం మొత్తం జలమయమైంది. అన్ని మండలాల్లో కలిపి 27వేల కుటుంబాలుంటే 12,594 కుటుంబాల్లోని వారంతా వరద బాధితులుగా మారారు. ఇక కిన్నెరసాని ఉపనదిని సైతం బ్యాక్ వాటర్​ ముంచేసింది. దాని ప్రభావమే బూర్గంపాడుపై స్పష్టంగా కన్పించింది. 

పోలవరంలో 150 అడుగులుంటే.. భద్రాచలంలో 43 అడుగులు 
భద్రాచలం వద్ద గోదావరి రివర్​బెడ్​ సముద్ర నీటిమట్టానికి107 అడుగులుంటుంది. పోలవరం ప్రాజెక్టులో కనీస నీటిమట్టం135 అడుగులుంటే భద్రాచలం వద్ద 28 అడుగుల వరకు నీళ్లుంటాయి. అదే పోలవరంలో150 అడుగుల నీటిమట్టం ఉంటే భద్రాచలం వద్ద 43 అడుగులకు చేరుకుంటుంది. 150 అడుగుల ఎత్తులో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడం వల్ల సాధారణ రోజుల్లో కూడా 43 అడుగుల నీళ్లు ఉంటాయని ఇటీవల సీడబ్ల్యూసీకి ఇచ్చిన లెటర్​లో రాష్ట్ర నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు నివేదించారు. పోలవరం వద్ద 94 అడుగుల రివర్​బెడ్​పై 42 అడుగుల మేర గేట్లు కట్టారు. 49.50లక్షల క్యూసెక్కుల వరదను దృష్టిలో ఉంచుకుని 150 అడుగుల మేర ప్రాజెక్టు నిర్మాణం కొనసాగుతోంది.  దీంతో తెలంగాణలోని గోదావరి తీర ప్రాంతాలకు భారీ ముప్పు పొంచి ఉంటుంది.  పీపీఏ(పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ) కూడా ఈ 99  గ్రామాలకు పరిహారం ఇవ్వాలని డిమాండ్​ చేసింది. కేంద్ర జలసంఘం ఇటీవల తెలంగాణను పోలవరం ముంపు జాబితాలో చేర్చాలని ఆంధ్రప్రదేశ్​సర్కారును ఆదేశించింది. బ్యాక్​ వాటర్​వల్ల పొంచి ఉన్న ప్రమాదంపై ఆయా ప్రాంతాల్లో డీమార్కేషన్​ చేయాలని సూచించింది. కానీ నేటి వరకు ఆ ప్రక్రియ కోసం ఏపీ సర్కారు ఎటువంటి చర్యలు చేపట్టలేదు. మరోవైపు జాతీయ ఆదివాసీ సంఘాల ఐక్యవేదిక కూడా మాజీ జడ్పీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే చందా లింగయ్య దొర ఆధ్వర్యంలో ఉద్యమాన్ని షురూ చేసింది.  

ఉద్యమం ఉధృతం​ చేస్తం
పోలవరం ప్రాజెక్టు బ్యాక్​వాటర్​ వల్ల మా పల్లెలన్నీ మునిగిపోతున్నాయి. కానీ మాకు పైసా ఇవ్వడం లేదు. మా ఊళ్లను నిర్వాసిత గ్రామాలుగా ప్రకటించి పరిహారం ఇచ్చేంతవరకు ఉద్యమం చేస్తాం. విలీన ముంపు మండలాల్లో నిర్వాసితులకు ఇచ్చే విధంగా ఇక్కడ కూడా పరిహారం ఇవ్వాలి. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. లేకపోతే ఢిల్లీని తాకేలా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. తెలంగాణలోని మిగిలిన మండలాలు, గ్రామాలకు కూడా విస్తరిస్తాం.
– కేవీ రమణ, పోలవరం ముంపు బాధిత గ్రామాల జేఏసీ కన్వీనర్

చాలా గ్రామాలు జలసమాధి
పోలవరం ఎఫెక్ట్ తో ఒక్క భద్రాచలమే కాదు తీర ప్రాంతంలోని దుమ్ముగూడెం,అశ్వాపురం, మణుగూరు,చర్లల్లో కూడా చాలా గ్రామాలు జలసమాధి అవుతాయి. మొన్న వరదలు భవిష్యత్​ లో జరగబోయే ముప్పును చూపించాయి. ప్రభుత్వం వద్ద దీనిపై ఎలాంటి లెక్కలు లేకపోవడం దురదృష్టకరం. పోలవరానికి జాతీయహోదా ఉన్నందున కేంద్రమే తెలంగాణలోని ముంపు గ్రామాలకు పరిహారం ఇచ్చేలా చూడాలి. నిర్వాసితులకు ఉద్యమమే శరణ్యం.
– యలమంచి వంశీకృష్ణ, తెలంగాణ రైతు సంఘం నాయకులు,దుమ్ముగూడెం

కరకట్టలు పొడిగించకపోతే మునుగుతయ్​
సీతమ్మసాగర్​ బ్యారేజీ కోసం చర్ల మండలం సత్యనారాయణపురం నుంచి కరకట్టలు కడుతున్నారు. ఇటీవల వరదలు, పోలవరం బ్యాక్​వాటర్ ముంపు దృష్ట్యా భద్రాచలం నుంచి దుమ్ముగూడెం వరకు గోదావరికి రెండు వైపులా కరకట్టలు పొడిగించాలి. లేకపోతే ఐటీసీ, హెవీవాటర్ ప్లాంట్​, సింగరేణి బొగ్గుగనులు కూడా మునుగుతాయి.  పోలవరం ముంపు ప్రాంతంగా తెలంగాణలోని గోదావరి పరివాహక ప్రాంతాన్ని ప్రకటించి పరిహారం ఇవ్వాలి. ముంపు గ్రామాలను ఏకం చేసి ఉద్యమకార్యాచరణ రూపొందిస్తున్నాం.  
– రావులపల్లి రాంప్రసాద్​, సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు,భద్రాచలం