సభకు అడుగడుగునా అడ్డంకులు..పేపర్స్ లేవంటూ వెహికల్స్ సీజ్

సభకు అడుగడుగునా అడ్డంకులు..పేపర్స్ లేవంటూ వెహికల్స్ సీజ్
  • తనిఖీల పేరుతో వాహనాలు ఆపేసిన పోలీసులు

హైదరాబాద్/ఖమ్మం/భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: కాంగ్రెస్ సభకు పోలీసులు, ఆర్టీఏ అధికారులు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. వాహనాల తనిఖీల పేరుతో పార్టీ కార్యకర్తలు, అభిమానులు వస్తున్న వెహికల్స్ ను ఎక్కడికక్కడ ఆపేశారు. పేపర్లు సరిగ్గా లేవంటూ కొన్ని వెహికల్స్ ను సీజ్ చేశారు. ఆదివారం ఉదయం నుంచి హైదరాబాద్ తో పాటు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెంలో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వెహికల్స్ ను పోలీసులు చెక్ చేశారు. సభకు జనం రాకుండా అడ్డుకోవాలనే ఉద్దేశంతోనే పోలీసులు తనిఖీల పేరుతో వాహనాలు ఆపేశారని కాంగ్రెస్ నేతలు ఫైర్ అయ్యారు. ఈ క్రమంలో ఖమ్మం రూరల్ మండలం కరుణగిరిలో పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి తొలగించారు. 

మాజీ రాజ్యసభ సభ్యుడు వీహెచ్​ను పోలీసులు అడ్డుకోగా.. ఆయన ఖమ్మం రూరల్​ పోలీస్​స్టేషన్ ముందు బైఠాయించారు. కొన్ని వాహనాలను భద్రాచలం ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేయగా, ఎమ్మెల్యే పొదెం వీరయ్య స్టేషన్ కు వెళ్లి వాటిని విడిపించారు. ఇల్లెందు నుంచి జనంతో సభకు వెళ్తున్న పలు ప్రైవేట్ బస్సులను పోలీసులు ఆపి కొత్తగూడెం ఆర్టీసీ డిపోకు తరలించారు. కాగా, తనిఖీలపై ఆర్టీఏ అధికారులను వివరణ కోరగా.. ఎలాంటి తనిఖీలు చేయలేదని చెప్పడం గమనార్హం. రవాణా శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం నియోజవర్గంలో మీటింగ్ జరుగుతుండడంతో అది సక్సెస్ కాకూడదనే  అధికారులకు మంత్రి మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతున్నది. 

డీజీపీకి రేవంత్ ఫోన్..  

వెహికల్స్​ను పోలీసులు అడ్డుకోవడంపై కాంగ్రెస్ నేతలు ఫైర్ అయ్యారు. పార్టీ నేతలు, కార్యకర్తలను అడ్డుకుంటే ఊరుకోబోమని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హెచ్చరించారు. పోలీసుల తీరుపై డీజీపీ అంజనీకుమార్​కు ఫోన్ చేసి మాట్లాడారు. జాతీయ పార్టీ మీటింగ్​ను ఇలా అడ్డుకోవడం సరికాదని ఆయన అన్నట్లు తెలిసింది.