డ్రగ్స్ సప్లయర్ ఎవరు? వాడిందెవరు?

డ్రగ్స్ సప్లయర్ ఎవరు? వాడిందెవరు?

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: పబ్ డ్రగ్స్ కేసులో పోలీసులకు సవాళ్లు ఎదురవుతున్నాయి. సాక్ష్యాల సేకరణలో ఇబ్బందులు తప్పడం లేదు. డ్రగ్స్ సప్లయర్ ఎవరు? ఆర్డర్ చేసిందెవరు? వాడిందెవరు? అనే దానిపై ఎలాంటి ఎవిడెన్స్ దొరకలేదు. దీంతో నిందితులు ఇచ్చే సమాచారంపైనే పోలీసులు ఆధారపడ్డారు. సప్లయర్స్ గానీ, వినియోగదారులు గానీ తెలిస్తేనే కేసు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. అయితే పబ్ పై దాడి చేసిన రోజు.. పోలీసులు ఎవరి దగ్గరి నుంచి కూడా శాంపిల్స్ సేకరించలేదు. దీంతో పార్టీకి డ్రగ్స్‌‌‌‌ సప్లయ్‌‌‌‌ చేసినోళ్ల వివరాలు తెలిస్తే తప్ప.. ఆర్డర్‌‌‌‌‌‌‌‌ చేసిన కస్టమర్లు, వినియోగించినోళ్లను గుర్తించేందుకు అవకాశాలు లేవు. బలమైన ఆధారాలు లేకపోతే కోర్టులో కేసు వీగిపోయే ప్రమాదం ఉంది. కాగా, బంజారాహిల్స్‌‌‌‌ రాడిసన్‌‌‌‌ బ్లూ హోటల్‌‌‌‌ లోని ఫుడింగ్ అండ్ మింక్ పబ్ పై దాడి చేసిన పోలీసులు.. మేనేజర్ అనిల్ కుమార్, పబ్ పార్టనర్స్‌‌‌‌ అభిషేక్ ఉప్పల, అర్జున్‌‌‌‌ వీరమాచినేని, కిరణ్‌‌‌‌రాజ్‌‌‌‌లపై కేసు నమోదు చేశారు. అనిల్‌‌‌‌, అభిషేక్‌‌‌‌లను అరెస్ట్ చేసి రిమాండ్‌‌‌‌కు తరలించగా.. పరారీలో ఉన్న అర్జున్ కోసం వెతుకుతున్నారు. విదేశాల్లో ఉన్న కిరణ్ రాజ్ ఇండియాకు తిరిగి రాకపోవడంతో లుకౌట్ నోటీస్ జారీ చేశారు. 

కస్టడీ కోరిన పోలీసులు.. 
పబ్ పై దాడి చేసిన రోజు 145 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వాళ్ల వివరాలు తీసుకొని ఆ తర్వాత విడిచిపెట్టారు. ఆ టైమ్ లో ఒక్కరి దగ్గరి నుంచి కూడా శాంపిల్స్ సేకరించలేదు. దీంతో డ్రగ్స్ వాడిందెవరో గుర్తించడంలో సమస్యలు తలెత్తాయి. మేనేజర్ అనిల్ ట్రేలో దొరికిన 4.64 గ్రాముల కొకైన్ ను సప్లయ్ చేసిందెవరో కూడా తెలియలేదు. ఈ వివరాలు రాబట్టేందుకు అనిల్‌‌‌‌, అభిషేక్‌‌‌‌లను కస్టడీకి తీసుకునేందుకు పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. వారిచ్చే స్టేట్‌‌‌‌మెంట్‌‌‌‌ ఆధారంగా డ్రగ్స్ ఆర్డర్‌‌‌‌‌‌‌‌ చేసినోళ్లను గుర్తించనున్నారు. 

ఆఫ్టర్ పార్టీలతో హంగామా..  

పబ్​లో వీకెండ్స్‌‌‌‌లో ఆఫ్టర్‌‌‌‌‌‌‌‌ పార్టీలు ఎక్కువగా జరుగుతున్నాయని పోలీసులు గుర్తించారు. ఆఫ్టర్‌‌‌‌ పార్టీ అంటే అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగే పార్టీలని అర్థం. ఈ పార్టీల్లో లిక్కర్‌‌‌‌‌‌‌‌, డ్రగ్స్‌‌‌‌, స్మోకింగ్‌‌‌‌తో పాటు ఇతర ఇల్లీగల్‌‌‌‌ యాక్టివిటీస్‌‌‌‌ జరుగుతుంటాయి. ఈ క్రమంలోనే హైప్రొఫైల్‌‌‌‌ వ్యక్తులతో అభిషేక్‌‌‌‌ టచ్‌‌‌‌లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఏడాదిగా పబ్‌‌‌‌లో జరిగిన ఆఫ్టర్ పార్టీల వివరాలు బయటకు రాలేదని భావిస్తున్నారు. అభిషేక్ వాట్సాప్‌‌‌‌, ఫేస్‌‌‌‌బుక్‌‌‌‌, ఇన్‌‌‌‌స్టాగ్రామ్‌‌‌‌ అకౌంట్ల ఆధారంగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.