కబ్జాదారుల భరతం పడుతున్నరు.. కాంగ్రెస్​లో చేరినా వదలని కరీంనగర్​ పోలీసులు..

కబ్జాదారుల భరతం పడుతున్నరు.. కాంగ్రెస్​లో చేరినా వదలని కరీంనగర్​ పోలీసులు..
  •  హస్తం పార్టీలో చేరిన జడ్పీటీసీ భర్త రవీందర్ అరెస్టు
  • ఇద్దరు కార్పొరేటర్లు, ఆరుగురు కార్పొరేటర్ల భర్తలు కూడా కటకటాల్లోకి 
  • 1,700 ఫిర్యాదులపై దర్యాప్తు 
  • భయంతో పొన్నం వద్దకు కార్పొరేటర్లు.. కేసుల్లో జోక్యానికి మంత్రి ససేమిరా

కరీంనగర్, వెలుగు : బీఆర్ఎస్  సర్కారు హయాంలో కరీంనగర్​లో జరిగిన భూకబ్జాలపై సీపీ అభిషేక్  మహంతి కొరడా ఝుళిపిస్తున్నారు. కబ్జాల విషయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ సైతం సీరియస్​గా ఉండడం, సీపీకి ఫ్రీహ్యాండ్​ ఇవ్వడంతో పార్టీలకు అతీతంగా ఆయన దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్  కార్పొరేటర్లను, వారి భర్తలు, లీడర్లను అరెస్టు చేసిన కరీంనగర్  కమిషనరేట్ పోలీసులు.. ఇటీవల మంత్రి పొన్నం సమక్షంలో కాంగ్రెస్​లో చేరిన కొత్తపల్లి జడ్పీటీసీ సభ్యురాలి భర్త, తెలంగాణ మత్స్య పారిశ్రామిక సంఘం జిల్లా చైర్మన్  పిట్టల రవీందర్​తో పాటు కాంగ్రెస్ సీనియర్ లీడర్ మంద నగేశ్​ను కూడా అరెస్ట్ చేశారు. 

పార్టీ మారితే కబ్జా కేసుల నుంచి తప్పించుకోవచ్చనే పన్నాగానికి రవీందర్  అరెస్టు ద్వారా సీపీ చెక్ పెట్టారనే అభిప్రాయం జనాల్లో వ్యక్తమవుతోంది. అమాయకులను బెదిరించి భూకబ్జాలకు పాల్పడడం, నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్లు చేయించుకోవడం, అడ్వాన్సులు తీసుకుని రిజిస్ట్రేషన్లు చేయకపోవడం, డబుల్  రిజిస్ట్రేషన్లకు పాల్పడడం, తమకు మామూళ్లు ఇవ్వలేదని ఇండ్ల నిర్మాణాలను అడ్డుకోవడం, అవసరమైతే కూల్చివేయడం, గ్రీన్ ల్యాండ్స్, ప్రభుత్వ స్థలాలను కబ్జా పెట్టడం, భూవివాదాల్లో తలదూర్చి వసూళ్లకు పాల్పడడం లాంటి అనేక ఘటనలపై ఇప్పటి వరకు కరీంనగర్  సీపీ అభిషేక్  మహంతికి 1750కి పైగా ఫిర్యాదులు అందాయి.

 లోక్ సభ ఎన్నికల షెడ్యూల్  రావడానికి ముందు రోజూ బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించిన సీపీ.. షెడ్యూల్ వచ్చిన తర్వాత  బిజీగా మారడంతో ప్రతి సోమవారం కంప్లయింట్స్  తీసుకుంటున్నారు. బాధితులకు టోకెన్లు అందిస్తూ ఫిర్యాదులపై ఎంక్వైరీ చేయిస్తున్నారు. ఆయా స్టేషన్ల ఎస్సైలు, సీఐలతోపాటు ఎకనామిక్  అఫెన్సెస్  వింగ్ ద్వారా ఎంక్వైరీ చేయించి నిజానిజాలు తేలుస్తున్నారు. ఈ ఫిర్యాదులపై సీపీ ప్రత్యేక దృష్టి పెట్టడంతో కింది స్థాయి అధికారులు కూడా ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గకుండా పకడ్బందీగా కేసులు నమోదు చేస్తున్నారు. 

ఇద్దరు కార్పొరేటర్లు, ఆరుగురు కార్పొరేటర్ల భర్తలపై కేసులు

కరీంనగర్ లో సింగరేణి రిటైర్డ్  ఎంప్లాయీ కొత్త రాజిరెడ్డికి చెందిన భూమి కబ్జాకు గురైన అంశం రెండేండ్లుగా నానుతోంది. బీఆర్ఎస్  సర్కారు  హయాంలో ఆయన కలవని అధికారి లేడు. ప్రభుత్వం మారాక సీపీ అభిషేక్  మహంతి ఈ కేసులో 12వ డివిజన్  కార్పొరేటర్ తోట రాములుతో పాటు బీఆర్ఎస్  నాయకుడు చీటీ రామారావు, నిమ్మశెట్టి శ్యాంను అరెస్టు చేశారు. అలాగే భూ కబ్జాలు, నకిలీ పత్రాలు సృష్టించి భూములను రిజిస్ట్రేషన్  చేయడం, ఆక్రమించడం చేసిన వేర్వేరు కేసుల్లో 21వ డివిజన్ (సీతారాంపూర్) కార్పొరేటర్ జంగిలి సాగర్, 17వ డివిజన్  కార్పొరేటర్  కోల భాగ్యలక్ష్మి భర్త ప్రశాంత్, 18వ డివిజన్ కార్పొరేటర్ సుదగోని మాధవీలత భర్త కృష్ణా గౌడ్, 7వ డివిజన్  కార్పొరేటర్  ఆకుల పద్మ భర్త ప్రకాష్, 25వ డివిజన్  కార్పొరేటర్ ఎడ్ల సరిత భర్త అశోక్, 2వ డివిజన్  కార్పొరేటర్  కాశెట్టి లావణ్య భర్త శ్రీనివాస్, 20వ డివిజన్  కార్పొరేటర్ తుల రాజేశ్వరి భర్త బాలయ్యను అరెస్టు చేశారు. మొత్తంగా ఇద్దరు కార్పొరేటర్లు, ఆరుగురు కార్పొరేటర్ల భర్తలపై కేసులు నమోదయ్యాయి. అలాగే బీఆర్ఎస్  నాయకుడు నందెళ్లి మహిపాల్, తీగలగుట్టపల్లి మాజీ ఎంపీటీసీ కొమ్ము భూమయ్య, మాజీ సర్పంచ్  గంగాధర కనకయ్యను కూడా కబ్జా కేసుల్లో కటకటాల వెనక్కి నెట్టారు.

ఆఫీసర్లనూ వదలట్లే

భూ కబ్జాలకు పాల్పడిన లీడర్లతోపాటు వారికి సహకరించిన అప్పటి ఆఫీసర్లను కూడా పోలీసులు వదలడం లేదు. నకిలీ పేపర్లు సృష్టించడమే కాకుండా  దానిని ఉపయోగించి భూమిని ఆక్రమించినందుకు కొత్తపల్లి మాజీ ఎమ్మార్వో చిల్ల శ్రీనివాస్ (ప్రస్తుత గజ్వేల్ తహసీల్దార్) ను అరెస్టు చేశారు. నకిలీ పేపర్లతో చింతకుంటలో భూమిని ఆక్రమించడంలో సహకరించినందుకు కొత్తపల్లి మాజీ తహసీల్దార్​ మోహన్ రెడ్డిపైనా కేసు నమోదు చేశారు. ఆయనను కూడా త్వరలో అరెస్టు చేసి రిమాండ్ కు తరలించే అవకాశం ఉంది. దీంతో కబ్జాలకు సహకరించిన, రికార్డుల టాంపరింగ్ కు పాల్పడిన రెవెన్యూ సిబ్బంది ఆందోళనకు గురవుతున్నారు. తమ వంతు ఎప్పుడొస్తుందోనని టెన్షన్ పడుతున్నారు.

కాంగ్రెస్​లో చేర్చుకునేందుకు పొన్నం ససేమిరా

తొలుత ఒక కార్పొరేటర్​ను, తర్వాత ముగ్గు రు కార్పొరేటర్లను పోలీసులు అరెస్టు చేసినప్పుడే.. కబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్పొరేటర్లు కాంగ్రెస్​లో చేరేందుకు క్యూ కట్టారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత 17వ డివిజన్  బీఆర్ఎస్  కార్పొరేటర్  కోల భాగ్యలక్ష్మి భర్త ప్రశాంత్..  కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ను కూడా ఆయన కలిశారు. కానీ, ఆయనను చేర్చుకునేందుకు మంత్రి ససేమిరా అన్నారు. తర్వాత కొద్ది రోజులకే కబ్జా కేసులో ప్రశాంత్​ అరెస్టయ్యాడు. కబ్జా కేసుల్లో కార్పొరేటర్ల అరెస్టుల పర్వం ఆగకపోవడంతో కాంగ్రెస్ లో చేరేందుకు సుమారు 20 మంది కార్పొరేటర్లు మంత్రి పొన్నం, జిల్లా ఇన్ చార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిశారు. తమపై కేసులు మాఫీ చేయిస్తే వెంటనే కాంగ్రెస్​లో చేరుతామని చెప్పారు. కానీ, అవినీతి మరకలు ఉన్న మీ లాంటి లీడర్లను చేర్చుకుంటే ప్రజల్లో పార్టీ పలుచన అవుతుందని ఇద్దరు మంత్రులూ చెప్పి పంపించినట్లు తెలిసింది.