మా​ అభ్యర్థులను పోలీసులు వేధిస్తున్నరు .. ఈసీకి కాంగ్రెస్ నేతల​ ఫిర్యాదు

మా​ అభ్యర్థులను పోలీసులు వేధిస్తున్నరు .. ఈసీకి కాంగ్రెస్ నేతల​ ఫిర్యాదు

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్​ పార్టీ అభ్యర్థులను పోలీసులు వేధిస్తున్నారని ఆ పార్టీ నేతలు ఆరోపించారు. ఈ మేరకు బుధవారం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. అచ్చంపేట, ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల అభ్యర్థులను ఇబ్బందులకు గురిచేశారని  సీఈవో వికాస్​రాజ్​కు కాంగ్రెస్​ పార్టీ ఎలక్షన్​ కమిషన్​ కో ఆర్డినేషన్​ కమిటీ చైర్మన్​ నిరంజన్​ ఫిర్యాదు చేశారు. ఎల్బీనగర్​లో అర్ధరాత్రి కాంగ్రెస్​అభ్యర్థి మధు యాష్కీ ఇంటిపై పోలీసులు అకారణంగా దాడి చేశారన్నారు. 

జీహెచ్​ఎంసీ కార్పొరేటర్​ సోమశేఖర్​ రెడ్డి.. కొడంగల్​లో రేవంత్​ను ఓడించేందుకు డబ్బులు పంపిణీ చేసే ప్రయత్నం చేశారని, పట్టుకోవడానికి ప్రయత్నిస్తే పారిపోయారన్నారు. రివర్స్​లో మధుయాష్కీపై వనస్థలిపురం ఏసీపీ, హయత్​నగర్​ సీఐ వేధింపులకు పాల్పడుతున్నారన్నారు. నామినేషన్​ వేయడానికి వెళ్తున్న మల్​రెడ్డి రంగారెడ్డి, పార్టీ కార్యకర్తలపై బీఆర్ఎస్​ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్​ రెడ్డి రాళ్లదాడికి పాల్పడ్డారని తెలిపారు.

 కానీ, ఇబ్రహీంపట్నం సీఐ, ఏసీపీ కాంగ్రెస్​ అభ్యర్థిపైనే కేసు పెట్టారన్నారు. అచ్చంపేటలో కాంగ్రెస్​ అభ్యర్థి, కార్యకర్తలపై సీఐ బెదిరింపులకు పాల్పడ్డారన్నారు. ఈ ఘటనలపై స్పం దించి.. కాంగ్రెస్​ అభ్యర్థులపై వేధింపులకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. అలాగే, ముస్లిం మైనారిటీ డిక్లరేషన్​ కోసం ఆలయాల భూములు అమ్ముతామంటూ రేవంత్​ కామెంట్​ చేసినట్టు బీజేపీ, బీఆర్ఎస్​ఫేక్​ న్యూస్​సర్క్యులేట్​ చేస్తున్నాయని సైబర్​ క్రైమ్​ వింగ్​కు ఫిర్యాదు చేశారు.

ఓటర్లను తప్పుదోవ పట్టిస్తూ ఫేక్​ న్యూస్​ ప్రచారం చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ నేతలు చరణ్,​ కౌశిక్​ యాదవ్​ తదితరులు పోలీసులను కోరారు.