సీఎం ఫ్యామిలీ కోసం పని చేయడం మానుకోండి

సీఎం ఫ్యామిలీ కోసం పని చేయడం మానుకోండి
  • ​​​సీఎం ఫ్యామిలీ కోసం పని చేయడం మానుకోండి
  • బీజేపీ రాష్ట్ర ఇన్‌‌చార్జ్‌‌ తరుణ్ చుగ్
  • జూబ్లీహిల్స్ రేప్‌‌ ఘటనలో నిందితులను కాపాడేందుకు పోలీసుల ప్రయత్నం
  • బాధితురాలికి న్యాయం జరిగే దాకా పోరాడుతం

హైదరాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్ అత్యాచార ఘటనలో పోలీసులు పూర్తి పక్షపాతం చూపారని బీజేపీ రాష్ట్ర ఇన్‌‌చార్జ్‌‌ తరుణ్ చుగ్ ఆరోపించారు. కొందరు పోలీసులు కేసీఆర్ ఎట్ల చెబితే అట్ల వ్యవహరిస్తున్నారని, సీఎం కుటుంబం కోసం పని చేస్తున్నారని ఆరోపించారు. అలాంటి పద్ధతులను మానుకొని ప్రజల కోసం పని చేయాలని సూచించారు. గురువారం హైదరాబాద్​లో ఆయన మీడియాతో మాట్లాడారు. జూబ్లీహిల్స్ కేసులో బాధితురాలికి న్యాయం జరిగే వరకు, నిందితులకు శిక్ష పడే వరకు బీజేపీ పోరు ఆగదని స్పష్టం చేశారు. నిందితులను రక్షించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్న తీరు దారుణమన్నారు. అత్యాచారానికి నిందితులు వాడిన వాహనాన్ని గుర్తించడానికి ఎందుకు ఆలస్యమైందో పోలీసు అధికారులు చెప్పాలన్నారు.

బీజేపీ సమావేశాలపై వరుస సమీక్షలు

హైదరాబాద్‌‌లో వచ్చే నెల 2, 3 తేదీల్లో జరగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ఏర్పాట్లపై రాష్ట్ర నేతలతో జాతీయ నేతలు రెండు రోజులుగా వరుస సమావేశాలు, సమీక్షలు నిర్వహిస్తున్నారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇన్‌‌చార్జ్ తరుణ్ చుగ్, పార్టీ సంస్థాగత సహ ప్రధాన కార్యదర్శి శివ ప్రకాశ్, జాతీయ కార్యదర్శి అరవింద్ మీనన్.. బుధ, గురువారాల్లో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీలు లక్ష్మణ్‌‌, అర్వింద్, ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రాజాసింగ్, రఘునందన్ రావు, నేతలు ఇంద్రసేనా రెడ్డి, జితేందర్ రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, ఎన్వీఎస్‌‌ఎస్ ప్రభాకర్ తదితరులతో చర్చించారు. సమావేశాలు జరిగే నోవాటెల్ హోటల్‌‌ను గురువారం సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు.

గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్‌‌కు చేరుకొని కార్యవర్గ సమావేశాల కోసం ఏర్పాటు చేసిన వివిధ కమిటీలతో తరుణ్ చుగ్, శివ ప్రకాశ్, అరవింద్ మీనన్ సమావేశమయ్యారు. బేగంపేట్ ఎయిర్ పోర్టు నుంచి నోవాటెల్ హోటల్ వరకు మోడీ రోడ్ షో ఉండేలా ప్లాన్  చేస్తున్నారు. రోడ్డుకు ఇరువైపులా కటౌట్లు, ఫ్లెక్సీలు, కాషాయ జెండాలు ఏర్పాటు చేయాలని, ఇప్పటివరకు ఎప్పుడు జరుగని రీతిలో హైదరాబాద్‌‌లో మోడీ రోడ్ షో నిర్వహించి కొత్త చరిత్ర సృష్టించాలని నిర్ణయించారు. ఇందుకోసం పెద్ద సంఖ్యలో జనాన్ని తరలించాలని సూచించారు. సమావేశాల ముగింపు రోజున భారీ సభ ఏర్పాటు చేయడంపైనా మాట్లాడుకున్నట్లు సమాచారం. పీఎం మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, 18 రాష్ట్రాల సీఎంలు, పలువురు కేంద్ర మంత్రులు కలిపి మొత్తం 350 మందికి పైగా గెస్టులు రానున్నందున ఏర్పాట్లపై రాష్ట్ర నేతలు ప్రత్యేక దృష్టి సారించారు.