టీవీఎస్ ఎక్సెల్ వాహనాలే అతడి టార్గెట్..ఎందుకంటే..

టీవీఎస్ ఎక్సెల్  వాహనాలే అతడి టార్గెట్..ఎందుకంటే..

అతడు సైకిల్ పై కూరగాయలు అమ్మేవాడు. అయితే కొంతమంది టీవీఎస్ ఎక్సెల్ పై కూరగాయలు అమ్మడం చూసి తను కూడా ఆ వాహనం కొనాలనుకున్నాడు. కానీ డబ్బులేక ఆగిపోయాడు. ఒక రోజు అతడు కూరగాయలు విక్రయిస్తుండగా ‘కీ’ తో ఉన్న టీవీఎస్ ఎక్సెల్ వాహనం కన్పించింది. చుట్టూ ఎవరూ లేకపోవడంతో దానిని చోరీ చేశాడు. ఆ తర్వాత ఈజీ మనీ కోసం దానినే వృత్తిగా ఎంచుకుని కటకటాల పాలయ్యాడు. 

టీవీఎస్​ ఎక్సెల్ బైక్​లను చోరీ చేస్తున్న వ్యక్తిని హైదరాబాద్ నాచారం పోలీసులు అరెస్ట్​ చేశారు. మల్లాపూర్ శివ హోటల్ సమీపంలో పోలీసులు తనిఖీలు చేస్తుండగా ఫరీదుద్దిన్ అనే వ్యక్తి టీవీఎస్ ఎక్సెల్ పై అనుమానాస్పదంగా కన్పించాడు. పోలీసులు ఆపి విచారిస్తుండగా పారిపోయేందుకు ప్రయత్నించడంతో పట్టుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీసుల విచారణలో అతడు బైక్ దొంగతనాలకు పాల్పడినట్లుగా ఒప్పుకున్నాడు. నిందితుడి వద్ద నుండి  కోటి పదిహేను లక్షలు విలువ చేసే 22 టీవీఎస్​ బైక్​లను స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేశారు. గత రెండేళ్ల నుండి మల్లాపూర్, నాచారం, రామంతాపూర్, మోహదీపట్నం,అత్తాపూర్, కూకట్ పల్లి సహా పలు ప్రాంతాల్లో 100 బైకులను చోరీచేసినట్లు పోలీసులు తెలిపారు.